ఉత్తరాయణం

పల్లెలకు బ్యాంకు సేవలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టణాలు, నగరాల్లో విస్తరిస్తున్న బ్యాంకింగ్ రంగం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించకపోవడం దారుణం. ఇప్పటికీ మండలానికి ఒక్క బ్యాంకు కూడా లేని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేక గ్రామీణులు, గిరిజనులు వడ్డీ వ్యాపారులు, బోగస్ చిట్‌ఫండ్ కంపెనీలపై ఆధారపడి భారీగా నష్టపోతున్నారు. ఆర్‌బిఐ నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న బోగస్ చిట్‌ఫండ్, మైక్రోఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వ్యవసాయం, వైద్యం, పెళ్లిళ్లు, చదువులకు పేద, మధ్య తరగతి ప్రజలు భారీగా అప్పులు చేసి వడ్డీ వ్యాపారుల వలలో చిక్కుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తృతపరచడం, బోగస్ ఫైనాన్స్ సంస్థల మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం వంటి చర్యలను ప్రభుత్వాలు చేపట్టాలి.
-ఎం.కనకదుర్గ, తెనాలి
‘ఫ్రంట్’లతో సుస్థిరత అసాధ్యం
నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకు తిరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ఎన్‌డిఏకు గుడ్‌బై చెప్పడం వెనుక చాలా దూ(దు)రాలోచన వుంది. యూపీలో రెండు ఉపఎన్నికల్లో ఓడిపోవడంతో మోదీ పని అయిపోయిందని బాబు అనుకుంటే చాలా పొరపాటు. తాను గతంలో కేంద్రంలో చక్రం తిప్పినపుడు అతుకుల బొంత ఫ్రంట్ ప్రభుత్వాలు కొద్దికాలానికే కూలిపోయిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు. సుస్థిర ప్రభుత్వాన్ని నడుపుతున్న మోదీని కాదని తలా తోకాలేని ఫ్రంట్‌లను ప్రజలు గెలిపించే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలతో కేంద్రంలో ఏర్పడబోయే ఫ్రంట్‌లో అందరూ ప్రధాని కావాలని కోరుకునేవారే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ప్రధాని పదవిపై మోజు పెంచుకున్నది. కాంగ్రెస్ మద్దతు కూడా ఆమెకే లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటే అది పగటికలగానే మిగిలిపోతుంది. వైకాపా, జనసేన పార్టీలు భాజపాతో కుమ్మక్కైనట్టు పదే పదే ప్రచారం చేసినా చంద్రబాబుకు ఫలితం ఉండదు. మోదీ సుస్థిర పాలన కంటే ఫ్రంట్‌ల పాలన ఊడబొడిచేదేమీ ఉండదు.
-టి.నాగరాజు, అనపర్తి
ఆ రాజకీయాలు మనకేల?
అమెరికాలో రాజకీయాల్ని తెలుగువారు శాసించాలని అక్కడ జరిగిన తెలుగు మహాసభల్లో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పిలుపునివ్వడం హాస్యాస్పదం. భారతీయ మూలాలు గల కొందరు అమెరికాలో ఉంటూ ముఖ్య పదవులు పొందారు. అది వారి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం. కాని రాజకీయంగా ఆ దేశాన్ని శాసించాలనుకోవడం ఎలా సాధ్యం? ఉద్యోగం కోసం వెళ్లినవారు ఉన్నత స్థానానికి ఎదగడం మంచిది కాని స్థానిక రాజకీయాల్లో తలదూర్చడం తగదు. విదేశీయులు మన దేశంలో రాజకీయాల్ని శాసిస్తే మనం ఊరకుంటామా? భాజపాకు ఓటు వేయవద్దని కర్నాటకలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేసినా అక్కడి తెలుగువారు వీళ్ల వలలో పడలేదు కదా. అలాగే అమెరికాలో మనవాళ్లు రాజకీయాలు చేయాలనుకోవడం తగదు.
-అభిలాష, కాకినాడ
ఎస్సీ, ఎస్టీ చట్టం భద్రంగానే ఉంది..
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సుప్రీం కోర్టు ఏ విధంగానూ నిర్వీర్యం చేయలేదు. అందులోని కొన్ని తప్పులను మాత్రమే సరిదిద్ది చట్టాన్ని పటిష్టపరిచింది. ఈ చట్టం క్రింద దేశంలోని అనేకమంది అమాయక ప్రజలపై దురుద్దేశంతో కేసులు పెట్టి పీడించడం జరుగుతున్నది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదులు తప్పుడు ఉద్దేశంతో నమోదేనపుడు, ప్రాథమిక దర్యాప్తులో అవాస్తవమని తేలితే, జామీనుపై ఆంక్షలుండవని ధర్మాసం చెప్పింది. ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్టు చేయరాదని, తగిన హోదాగల అధికారిచే విచారణ చేయించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఇది దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఊరట కల్పించింది. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం చెక్కుచెదరలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. రాజకీయవేత్తలు ఓటు బ్యాంకు కోసం ఆశించకుండా, దేశప్రజలకు న్యాయం జరిగేలా ప్రవర్తించాలి. ప్రజలను విడదీసే చట్టాలు సరైనవి కాదు. నాయకులు, కులసంఘాల వారు సుప్రీం తీర్పును చదివి మాట్లాడాలి. ఇప్పటికైనా వివాదాలకు ముగింపు పలికి సుప్రీం తీర్పును గౌరవించాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురం