ఉత్తరాయణం

నిరుద్యోగంలో వృద్ధి.. దేశానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరుద్యోగం గత ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని స్థాయికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంచనాలకు మించి శరవేగంగా నిరుద్యోగం పెరిగింది. దాదాపు నలభై యేండ్లపాటు నిలకడగా, పెద్దగా మార్పులేకుండా ఉన్న నిరుద్యోగిత రేటు గత ఏడేండ్లలో గణనీయంగా పెరగడం దేశంలో ఒక కొత్త సామాజిక సమస్యకు దారితీయడంతోపాటు దేశాభివృద్ధికి ఎంతమాత్రం మంచిది కాదని సామాజిక, ఆర్థిక నిపుణులు హెచ్చరించడం గమనించాల్సిన విషయం. నిరుద్యోగం పెరిగిందని ఎన్నికలకు చాలాముందునుంచే ప్రతిపక్షాలు ఎన్‌డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. విమర్శనాస్త్రాలు సంధించినా ప్రభుత్వం వాటన్నింటినీ కొట్టిపడేసింది. తాజా జాతీయ నమూనా సర్వే నివేదిక ఈ అంశాలను ధ్రువీకరించడం గమనార్హం. నిరుద్యోగులకు ఆసరా కల్పించే స్వచ్ఛంద ఉపాధి రంగం ఎందుకు కుప్పకూలిందో, చిన్నమధ్యతరహా పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు ఎందుకు కునారిల్లిపోతున్నాయో ప్రభుత్వం కూలంకుషంగా అధ్యయనం చేసి తదనుగుణంగా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలి.
- సి.సాయిప్రతాప్, హైదరాబాద్
ఉన్నతవిద్య ప్రక్షాళన దిశగా..
విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి కేంద్రం చూపుతున్న చొరవ అభినందనీయం. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలూ ఆర్నెల్లలోగా ఖాళీలను భర్తీచేయాలని, నిర్దేశిత గడువులోగా పోస్టులను భర్తీచేసుకోని విద్యాసంస్థలు ఇకపై గ్రాంట్లు అందుకొనే అవకాశాన్ని కోల్పోతాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు ఇవ్వడం హర్షణీయం. ఉన్నత విద్యాసంస్థల్లో తగినంత మంది ఆచార్యులు లేనందున కాంట్రాక్ట్ పద్ధతిన అధ్యాపకులతో తూతూ మంత్రం చందాన విద్యాబోధన జరుగుతున్నందున విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయి. 2018 నాటి ఒక అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచపు మొదటి 250 ఉత్తమ విద్యాసంస్థల్లో భారతదేశానికి చెందిన ఒక్క విద్యాసంస్థ కూడా లేకపోవడం ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది. పరిశోధనల పరంగా కూడా భారతీయ ఉన్నత విద్యాసంస్థలు మొదటి 300 స్థానాలలో స్థానం సంపాదించుకోలేకపోయాయి. ఉన్నత విద్యావ్యవస్థలో అర్హులైన ఉపాధ్యాయుల నియామకంతోపాటు పలు విప్లవాత్మక సంస్కరణలను తీసుకురావాల్సిన ఆవశ్యకతపై 2005లోనే సుదీప్‌ఘోష్ కమిటీ, 2009లో ప్రొఫెసర్ యశ్‌పాల్ కమిటీ, 2013లో సుబ్రమణియన్ కమిటీలు చేసిన సిఫార్సులను గత యూపీఏ ప్రభుత్వం బుట్టదాఖలు చేయడంవలనే ఉన్నత విద్య భ్రష్టుపట్టిపోయిందన్నది నిర్వివాదాంశం. ఉన్నత విద్యారంగంలో ఆచార్యుల కొరతను తీర్చడానికి యూజీసీ ఇంతటి విస్పష్టమైన ప్రణాళికను ప్రకటించి, దానిని విధిగా అనుసరించాలంటూ ఆదేశించడం గత 30 ఏళ్లలో ఇదే ప్రథమం. దీని వెనుక ఉన్నత విద్య అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవే ప్రధాన కారణం. గతంలో పలు ఉన్నత విద్యాసంస్థలలో అధ్యాపకుల నియామకంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకొని చివరకు యుజిసి ఆ నియామకాలను రద్దుచేయాల్సిరావడం జరిగే నేపథ్యంలో ప్రస్తుత నియామకాలు పూర్తి పారదర్శకంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా సాగేలా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
భావితరాలకు భరోసా..
పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం భావించడం సరైన నిర్ణయం కాదు. గత అర్ధ శతాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రాజెక్టు కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇతర రాజకీయ పార్టీల సభ్యులు, మేధావులతోపాటు కలిసివచ్చే పొరుగు రాష్ట్రాల ముఖ్యనేతలతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరితగతిన పూర్తి చేయాలి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని ఆధిక్యతకు నజరానాగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే భావితరాలకు భరోసా కల్పించిన వారు కాగలరు.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
ఆలోచన అమలు జరగాలి
దేశవ్యాప్తంగా మూడేళ్ళ వయసు నుండి పద్దెనిమిదేళ్ల వయసు వరకూ విద్యాహక్కు చట్టం వర్తింపజెయ్యాలని నూతన విద్యావిధానం ప్రతిపాదిస్తోంది. కానె్వంటు స్థాయి నుండి నిర్బంధ ఉచిత విద్య అందజేయడం ప్రభుత్వపు బాధ్యతగా, విద్య పొందడం చిన్నారుల హక్కుగా ఉండడం మంచి పరిణామవౌతుంది. కానె్వంటు చదువు అంటే వంద శాతం ప్రయివేట్ చదువే. బళ్ళో విద్యార్థి చేరేటప్పటికి కానె్వంటు విద్యార్థి రైమ్స్ చెప్తుంటే, డైరెక్ట్‌గా చేరిన విద్యార్థి అక్షరాలు దిద్దాల్సిన పరిస్థితి. అక్కడే వెనకబాటుతనం మొదలౌతుంది. ఆ పరిస్థితిని తప్పించడానికి తల్లిదండ్రులు పేదవారైనా వేలకువేలు పోసి కానె్వంటులో చేర్పించడం తప్పనిసరిగా మారింది. పైగా ఆ కానె్వంటులో కూడా ముక్కునపట్టి నేర్చుకొనే విద్యనే విద్యగా చలామణి అవుతుంది. వాటిలో కూడా పోటాపోటీగా పుస్తకాలు, ఇతర సామాగ్రి కొనిపించి చదువంటేనే విద్యార్థి భయపడేలా, స్కూల్ అంటేనే వెనకడుగు వేసేలా పరిస్థితి తయారైంది. పెద్దలకు ఆర్థిక భారం, పిల్లలకు మోత భారంగా తయారైన ఈ విధానం మార్చడం అత్యవసరం. నూతన విద్యావిధానం ప్రతిపాదిస్తున్నట్టుగా కానె్వంటు విద్యని ఫార్మల్ విద్యగా గుర్తిస్తూ సంస్కరించాలి. మూడేళ్ళ నుండి సరైన పునాదితో చదువు పిల్లలకు అందించాలి. ఆటపాటలు, వ్యాయామం, పౌష్టికాహారం అందిస్తూ చదువు నేర్చుకొనేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలి. ప్రాథమిక స్థాయిలోనే విద్య పట్ల అనురక్తికి, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి బీజం పడాలి. అందుకు తగ్గ అవకాశాల్ని, నిధుల్ని, ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం సమకూర్చాలి. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రేషనలైజేషన్ సాకుతో వందలాది బడుల్ని మూసివేసింది. అలాంటి చర్యలు విద్యావ్యాప్తికి భంగకరం. ప్రతి ఆవాసంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి. డ్రాప్ అవుట్ రేట్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు గైకొనాలి. రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న అమ్మఒడి పథకాలు వంటి ప్రోత్సాహకాలు నేరుగా విద్యార్థుల ఆరోగ్యం, చదువుకే వినియోగపడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం