ఉత్తరాయణం

ప్రజాధనం దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో నూతన సచివాలయం నిర్మాణం పేరుతో ఇప్పుడున్న పాత భవనాలను కూల్చివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదు. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే నూతన సచివాలయం పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగపరచటమే అవుతుంది. ప్రస్తుత సచివాలయ భవనాలు పటిష్టవంతంగా ఉన్నాయని వాటిని కూల్చివేయరాదని, నూతన సచివాలయం అవసరం లేదని వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. వాస్తు, సెంటిమెంట్ల పేరిట నూతన భవనాన్ని నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తోంది. నూతన భవనాలను నిర్మించాలని భావిస్తే పాత భవనాలను కూల్చాలనడంలో అర్థం లేదు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకొని, ప్రజాసమస్యలపై దృష్టి సారించాలి. పొరుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలి తప్ప ఏదో ఒక సమస్యను తలెత్తే విధంగా చూడరాదు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేయటం సరికాదు. ప్రజావేదికను చంద్రబాబు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టినా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. దాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించి ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకుంటే ఉపయుక్తంగా ఉండేది. అక్రమ నిర్మాణమైనా అది ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు సరికాదు. అక్రమ వెంచర్లతో మోసం చేసే రియల్ ఎస్టేట్ సంస్థలను శిక్షించాలే తప్ప ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన భవనాలను కూల్చివేయడం భావ్యం కాదు. ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న పథకాలు, పేదప్రజల సంక్షేమానికి తీసుకుంటున్న నిర్ణయాలు హర్షించదగ్గ విషయం. కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్ళకుండా ఆచితూచి అడుగుబడాలి. ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలి. స్థానిక సమస్యలు అవే సర్దుకుంటాయి.
-ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాల కారణంగా తగినన్ని నిధులు రాలేదన్నది వాస్తవం. ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించాక, నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నించడంతో ఈసారి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల వరద పారుతుందని అందరూ ఆశించారు. లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకోగా, ఆ ఆశలపై కేంద్రం నీళ్లుచల్లింది. ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రిక్తహస్తం చూపించడం బాధాకరం. ఏపీలో సాంకేతిక విద్యారంగం పట్ల కేంద్రం మొండి చెయ్యి చూపింది. ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు, ట్రైబల్ వర్సిటీకి రూ.8 కోట్లు మాత్రమే కేటాయించింది. ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీలకు మాత్రం ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు. దీంతో వాటి నిర్వహణ భారం మొత్తం ఏపీ ప్రభుత్వంపై పడే అవకాశం వుంది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, రాజధాని అమరావతి, విశాఖ, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టులు, విజయవాడలో కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేకపోవడం ప్రజలను నిరాశ పరచింది. భారత్‌మాల, సాగరమాల తదితర పథకాలలో ఏపీకి ఎంత కేటాయించాలనే దానిపై స్పష్టత లేకపోవడం రాష్ట్ర ప్రజలను నిరుత్సాహపరచింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా, ఏపీ పట్ల కేంద్రం వైఖరి మారలేదనడానికి బడ్జెట్ ఒక నిదర్శనం.
-సి.హెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
ప్రైవేటు స్కూళ్లకు ‘అమ్మఒడి’ వద్దు
‘అమ్మఒడి’ పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థులకు మాత్రమే వర్తింపజేయడం సబబు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకూ ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తే ప్రభుత్వ బడులకు డిమాండ్ తగ్గడం ఖాయం. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న తమ పిల్లల్ని అక్కడ మాన్పించి తల్లిదండ్రులు ప్రవేట్ స్కూళ్లల్లో చేర్పించే ప్రమాదం ఉంది. ప్రైవేటు స్కూళ్లలో ఎంతటి భారీ ఫీజులున్నా తల్లిదండ్రులు వాటిపైనే మోజు చూపుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయం చేయకున్నా ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రభుత్వ స్కూళ్లను క్రమంగా మూసివేసేందుకు పాలకులు సుముఖత చూపుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేయాల్సిందిపోయి, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు దాసోహమనే చర్యలకు పూనుకోవడం మంచి నిర్ణయం కాదు. అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే సాయంతో పేద పిల్లలకు ప్రయోజనం చేకూరాలి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారాన్ని ప్రభుత్వం నియంత్రించాలి. నాణ్యమైన విద్యను అందించేందుకు అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయాలి.
-పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి