ఉత్తరాయణం

సత్వర న్యాయంతో ఉత్తమ సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగరిక సమాజం ఏర్పడాలంటే అది న్యాయ మార్గం ద్వారానే సాధ్యం. ఆలస్యం అమృతం విషం- అన్న సూక్తి న్యాయానికి చక్కగా అన్వయం అవుతుంది. ఆలస్యంగా న్యాయం అందితే అది- న్యాయం నిరాకరించబడినట్టే. అందుకనే పటిష్టమైన న్యాయవ్యవస్థను ఏర్పరచుకోవడం సమసమాజ స్థాపనకి మొదటిమెట్టు. అవసరమైన చట్టాలూ వాటిని నిష్పాక్షికంగా అమలు చేసే యంత్రాంగం, బాధ్యత కలిగిన పౌర సమాజం సత్వర న్యాయం దిశగా సమాజం నడవడానికి కీలకం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్టు న్యాయం అందాల్సింది చట్టబద్ధంగానే. చట్టం వెలుపల అందే న్యాయంతో ప్రమాదాలెక్కువ. ‘దిశ’ ఉదంతం నేపథ్యంలో మహిళలకు రక్షణ, బాధితులకు న్యాయంపై చర్చలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. న్యాయవ్యవస్థలో లోపాలు విశేషంగా కనబడుతున్నా మొత్తం వ్యవస్థలోనే సంస్కరణలు అవసరం. అందుకు బాధ్యత పౌరుల నుండి మొదలై ప్రభుత్వాల వరకూ ఉంటుంది. సత్వర చర్యల నుండి దీర్ఘకాలిక చర్యలు అవసరవౌతాయి. 2017లో దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 3 లక్షల 50వేలు. అందులో 7 శాతం అత్యాచారాలు. నమోదైన కేసులు వాస్తవంగా జరుగుతున్న నేరాల్లో కేవలం పది శాతం ఉంటాయి. అంటే ఏ స్థాయిలో నేరాలు జరుగుతున్నయో ఊహించగలం. కోర్టుదాకా వచ్చిన కేసుల్లో నిందితులకు శిక్ష పడినవి 30 శాతానికి మించవు. అధిక శాతం కేసులు నిరూపణ కాక నిందితుల నెత్తిమీద పాలు పోస్తున్నాయి. ఆ మాత్రం కేసులైనా తుది తీర్పు దశకు చేరడానికి దశాబ్దాలు పడతాయి. ఇంత నేరమయంగా ఉన్న సమాజంలో నేరస్థులకు భయం గానీ, బాధితులకు ఊరట కానీ ఎలా కలుగుతాయి? పిల్లల పెంపకం నుండి పౌరుల బాధ్యత మొదలౌతుంది. సోషల్ పోలీసింగు పెరగాలి. మహిళలకు ప్రత్యేక పోలీసు స్టేషన్లు, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు, ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా ఏర్పాటు, ఉదాసీన స్పందనకు చర్యలు వ్యవస్థీకృతం చేయాలి. దర్యాప్తులో ఆధునీకరణ పెరగాలి. న్యాయవ్యవస్థలో ఖాళీల్ని భర్తీ చేయాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా నెలల వ్యవధిలోనే అంతిమ తీర్పులు వెలువడేలా వ్యవస్థని సంస్కరించాలి. బాధితుల, నిందితుల హోదాలతో సంబంధం లేని న్యాయప్రక్రియ ఆటోమాటిక్‌గా జరుగుతూ పోవాలి. బాధితులు పూర్తి రక్షణకు, దోషుల సత్వర శిక్షకు పూచీ ఉండాలి. ఆ దిశగా ఆలోచించినప్పుడే సమస్య పరిష్కారవౌతుంది. సమాజంలో మద్యం నియంత్రణకు ప్రాధాన్యం కల్పించాలి. అంతర్జాలం ద్వారా వెల్లువెత్తుతున్న అశ్లీలతకు, భావ కాలుష్యాన్ని వెదజల్లే సినిమాలకు ముకుతాడు వేసే మార్గాలు అనే్వషించాలి. ఈ కార్యక్రమాలన్నీ సమాంతరంగా, స్థిరంగా జరుగుతూ ఉండాలి.
-డా. డి.వి.జి.శంకర్‌రావు, పార్వతీపురం
ఆర్టీసీ చార్జీలు భారమే..
ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయని ఉరుములేని పిడుగులా ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచటం సహేతుకం కాదు. ప్రైవేటు ఆపరేటర్లకు భారీగా లాభాలొస్తుంటే ఆర్టీసీకి ఎందుకు నష్టాలొస్తున్నాయో? మొదట నష్టనివారణ చర్యలు చేపట్టాలి. నాలుగేళ్ళకొకసారి జీతాలు పెంచుతున్నామంటూ, ఆ భారం పేద ప్రజలపై మోపటం రివాజుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీగా ప్రజాకర్షక పథకాలే కాదు, ఛార్జీలు, పన్నుపోట్లు పెరుగుతున్నాయి. ఒకవైపు జీవనవ్యయం అనూహ్యంగా పెరిగిపోతుంటే మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు ఛార్జీలు భారీగా పెంచటం సబబుకాదు. పెరుగుదల కొద్ది పైసలేనని రవాణా మంత్రి అంటారు కానీ, పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లు దూరప్రాంతాలు ప్రయాణించే వారికి అదనపు భారం వందల రూపాయల్లోనే వుంటుంది. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు కుటుంబానికి 1000/- రూ. దాటొచ్చు. అప్పులు, నష్టాలు. జీతాలు పెంచినప్పుడల్లా పేదలపై భారం మోపకుండా ఖర్చులు తగ్గించుకొని ఆదాయం సక్రమంగా పెంచుకునే చర్యలు తీసుకోవాలి. తమిళనాడులో వలె తక్కువ దూరం ప్రయాణించే బస్సుల్లో సీట్ల సంఖ్య కూడ పెంచాలి. వివిధ రాయితీలు ప్రకటించే ప్రభుత్వాలు ఆ భారం సంస్థకు చెల్లించాలి. వృద్ధులు, వికలాంగులు ఎత్తుగా వుండే మెట్లెక్కలేక కొందరు వ్యక్తిగత వాహనాలు, ఆటోలు ఆశ్రయిస్తున్నారు. కిలో ఉల్లిగడ్డల కోసం ప్రజలు పూటలకొద్దీ క్యూల్లో నిలబడుతున్నారంటే మనది ఎంత అసమానతల అభివృద్ధి దేశమో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గ్రహించాలి. ఆదాయం పెరిగేవారే కాదు, నికరాదాయం లేనివారు, అల్పాదాయ వర్గాలవారి సంఖ్య కూడ ఎక్కువే. కనుక ప్రభుత్వం తక్షణమే చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి. అవినీతిని, అక్రమాలను పెంచే, తాత్కాలిక ప్రజాకర్షక పథకాలకంటే ఇటువంటి రాయితీలు ప్రజలకు, పర్యావరణానికి శాశ్విత ప్రయోజనాలు కలిగిస్తాయి.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట