ఉత్తరాయణం

ఇంధన ధరలపై అదుపు ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఐదు నెలలకాలంలో గ్యాస్ పంపిణీ సంస్థలు సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 150 వరకు పెంచాయి. సబ్సిడీ లేని గ్యాస్‌ను వాడే వారిలో సంపన్న వర్గాలేగాక సామాన్యులెందరో వున్నారు. గతంలో ప్రధాని మోదీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పేదలకు చౌకగా వంట గ్యాస్ అందించటానికి, స్థితిపరులు సబ్సిడీని వదులుకోవాలని కోరితే, సామాన్యులు సైతం సబ్సిడీని వదులుకున్నారు. చిరువ్యాపారులకూ గ్యాస్ వాడకం అధికమే. జీవన వ్యయం పెరుగుతుంటే స్థిరాదాయం లేని సామాన్యులు అల్లాడుతున్నారు. గతంలో పెట్రోధరలు ప్రభుత్వ నియంత్రణలో వుండేవి. గల్ఫ్ సంక్షోభంలో బారెల్ ముడి చమురు 140 డాలర్లకు చేరిన రోజుల్లో కూడ ఇలా ధరలు పెరగలేదు. స్వేచ్ఛా వ్యాపారం పేరుతో ప్రభుత్వం భారాన్ని తగ్గించుకోటానికి సంతకం చేసి ఖాళీ చెక్కు ఇచ్చినట్లు ధరల నిర్ణయం అధికారాన్ని ప్రభుత్వ పంపిణీ సంస్థలకే అప్పగించటంతో, అవి తమ ఇష్టానుసారం ఇంధన ధరలు నిర్ణయిస్తున్నాయి. గతంలోవలెనే ధరల నియంత్రణను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకోవాలి. జీడీపీ అభివృద్ధి పేరుతో కార్పొరేట్, పారిశ్రామిక వర్గాలకు ఉదారంగా రాయితీలిస్తున్న ప్రభుత్వాలు సామాన్యులకు పెరిగిపోతున్న జీవన వ్యయం నుండి ఉపశమనం కలిగించాలని ఇంధన ధరలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవటమో, జీఎస్టీ పరిధిలోకి తేవటమో ఎక్సైజ్ సుంకం తగ్గింపువంటి చర్యలో తీసుకోవాలి. పొరుగున వున్న అన్ని దేశాల్లోకంటే ఇంధన ధరలు మన దేశంలోనే అధికంగా వున్నాయి. తమ పాలనలో గతంలోవలె అవినీతి, స్కాంలు లేవని బీజేపీ పెద్దలు ధీమాగా వున్నారు. కాని జీడీపీ, జాతీయ అంతర్జాతీయ సమస్యలతోపాటు సామాన్యుల ఆర్థిక స్థితిగతులను కూడ పట్టించుకోవాలి. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10వేల రూ. ఆదాయం లేని కుటుంబాలే (తలసరి ఆదాయం కాదు) అధికం. ఏ ప్రభుత్వానికైనా సామాన్యుల ఓటు బ్యాంకే కీలకం, సంపన్నవర్గాలు కాదు. బిలియనీర్లతోపాటు ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతూ సమాజంలో సైబర్ నేరాలు, అశాంతి, అరాచకాలు పెరిగిపోతున్నాయి. స్వదేశీయ ఉత్పత్తులు, స్వదేశీ వస్తువాడకం పెరగాలని ప్రజలను కోరుతున్న మన ప్రధాని ఆ దిశగా బయోగ్యాస్, బయోడీజెల్, గోబర్ గ్యాస్ వంటి స్వదేశీ ఇంధన తయారీని, సోలార్, పవన విద్యుత్ వంటి ప్రకృతి విద్యుత్ తయారీని చౌక రుణాలతో, రాయితీలతో ప్రోత్సహిస్తే గ్రామీణ పరిశ్రమలు, వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందుతాయి. పెట్రో దిగుబడులు గణనీయంగా తగ్గి విదేశీ మారకం ఆదా అవుతుంది. గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుంది. తరచూ గల్ఫ్ దేశాల్లో సంక్షోభాలు తలెత్తుతున్న దృష్ట్యా ఇంధన ధరలు ఇంకా పెరిగి ఆ భారం ప్రభుత్వ ఖజానాపై పడే ప్రమాదముంది. కనుక తక్కువ చార్జీలతో ప్రభుత్వ రవాణాను పెంచి, వ్యక్తిగత వాహన వినియోగం, వాహన కొనుగోళ్లు నియంత్రించే చర్యలు చేపట్టాలి. తద్వారా వాయుకాలుష్యం, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చు. మన వంతుగా వ్యక్తిగత వాహన వినియోగాన్ని సాధ్యమైనమేర తగ్గించుకుంటే మన దేహానికి, దేశానికి మంచిది.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
కాంగ్రెస్‌వి మత రాజకీయాలు..
పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహ్మదీయుల ఆధిక్యత గల ప్రాంతాలు మత ప్రాతిపదికన విభజనకు గురయ్యాయి. ఈ ఖండిత భారతావనికి ప్రథమ పాలకవర్గ సాక్షి నెహ్రూ. మహ్మద్ ప్రవక్త, జీసస్ బోధనల పేరు గల మతాలు మహ్మదీయ, క్రైస్తవులు. ఉభయులకూ వందల వేల దేశాలున్నాయి. ప్రవక్త పేరునగాక ఈ దేశీయత, వైదిక ఆలంబనతో గలదే హైందవం. ప్రపంచంలో ఏకైక హిందూ దేశం హిందూస్తాన్. ఏనాటికైనా ఈ దేశీయ సాంస్కృతిక వారసులతోనే తమ వంశపాలకులకు ముప్పు అని గ్రహించిన ఎమర్జెన్సీ పాలనా రూపశిల్పి ఇందిరమ్మ- రష్యా చీనాలను పలవరించే ఉభయ కమ్యూనిస్టుల సహాయ సహకారాలతో హిందూస్తాన్‌ను సెక్యులర్‌గా ప్రకటింపచేసింది. ఆమె హయాంలో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌ను ప్రపంచ ఇస్లామిక్ దేశాల సభలకు పంపిన వైనం గుర్తుతెచ్చుకోవచ్చు. స్వతంత్ర రాజకీయ భారతం ఏడు దశాబ్దాలుగా మైనారిటీ మహామంత్రాన్ని ప్రతి ఎన్నికల్లో జపించి తరిస్తోంది. ఈనాటికి సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అంటూ వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దాయాది దేశ దమనకాండకు తరిమివేయబడిన వారిని అక్కున చేర్చుకుంటున్న ఉదంతమే పౌర సవరణ చట్టం. ఇక జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్‌ఆర్‌సి)ను వ్యతిరేకిస్తూ, ఇది ముస్లిం వ్యతిరేకం అంటున్నారంటే అర్థవౌతోంది- పాక్ నుంచి తరిమివేయబడిన వారికి పౌరసత్వం వద్దంటున్న వారే చొరబాటుదార్లకు కాపుకాస్తున్నారని. పార్లమెంటు ‘జాతీయ పౌర జాబితాను’ సైతం ఎప్పటికైనా ఆమోదించి తీరుతుంది.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
చొరబాటుదార్లకు కళ్లెం
చొరబాటుదార్లను అడ్డుకోవటానికి ఉద్దేశించినదే పౌరసత్వ చట్టం. మన దేశపు పౌరసత్వం ఉన్న ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్లకు ఇది వర్తించదు. ఇతర దేశాల నుండి భారత్‌లోకి చొరబాటుగా వచ్చేవారిని నిరోధించటానికి ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన దేశంలో నివసించే వారు ముస్లింలైనా, క్రిస్టియన్లయినా, హిందువులైనా భారతీయులే. బంగ్లాదేశ్, పాక్ వంటి పొరుగు దేశాల నుండి అనేక లక్షల మంది భారతదేశంలో అడ్డదారిలోవచ్చి ఇక్కడే స్థిరపడి వెనక్కి పోవటం లేదు. అందుకు ఉదాహరణగా రోహింగ్యాలను చెప్పవచ్చు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల మనకు హానికలగదని భావించాలి. టెర్రరిస్టులను నిరోధించటానికి ఇది ఉపయోగంగా ఉంటుంది. దొంగ వీసాల ద్వారా జొరబడే వారిని ఈ చట్టం నియంత్రిస్తుంది. లౌకికవాదులైన ముస్లింలు సైతం దీన్ని సమర్ధిస్తున్నారు. దీన్ని హిందుతత్వానికి ముడిపెట్టవద్దు. ఇప్పటికే మన జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చొరబాటుదార్లకు పౌరసత్వం ఇస్తే మన జనాభా మరింత పెరగడం ఖాయం.
-ఎ.ఆర్.రామారావు, ఖమ్మం