ఉత్తరాయణం

తీవ్రరూపం దాలుస్తున్న మనుష్య అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కాలంలో అక్రమ రవాణా సమస్య నానాటికీ తీవ్రరూపం దాల్చడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచెయ్యడం ముదావహం. మనుష్యులను సరుకుల మాదిరిగా మానవత్వం మరిచి ఇష్టారాజ్యంగా రవాణాచేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించడం ప్రభుత్వాల నిర్లక్ష్యవైఖరికి నిదర్శనం. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అక్రమ రవాణాకి గురవుతున్న వారి లెక్కలు అందుబాటులో లేకపోవడం పట్ల సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. నిరంతరం తప్పిపోతున్న పిల్లలు, యువతులు సంఖ్య ఏటికేడు ఎక్కువవుతోందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. అక్రమ రవాణాకు గురవుతున్నవారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ ఉన్నారని గణాంకాలు వివరిస్తున్నాయి. అక్రమంగా రవాణా చేయబడుతున్న వారిని సెక్స్ వ్యాపారానికి, గల్ఫ్ మరియు ఇతర దేశాల్లో ఇంటి పనులకు, అవయవ వ్యాపారానికి, వెట్టిచాకిరీ కార్మికులుగానూ వినియోగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అరబ్బు షేకులు వచ్చి అభం శుభం తెలియని ముస్లిం అమ్మాయిలను, వాళ్ళ తల్లిదండ్రులకు పెద్దఎత్తున డబ్బు ఆసరా చూపి, చిన్న వయస్సులోనే వారిని పెళ్ళిళ్ళు చేసుకొని గల్ఫ్ దేశాలకు తరలించి అక్కడ వారిని వ్యభిచారానికి వినియోగిస్తున్న సంఘటనలు దేశంలోనే అత్యధికంగా జరుగుతున్నా వాటి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం.
జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదిక ప్రకారం 2016 గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు లక్షా 11వేల 569 మంది పిల్లలు అపహరణకు గురయ్యారు. జాతీయ నేర గణాంకాల బ్యూరో గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకరు అపహరణకు గురవుతున్నారు. అధిక శాతం మందిని విదేశాలకు అక్రమంగా తరలించి యువకుల్ని బానిసలుగా, బలవంతపు కూలీలుగా మారుస్తున్నారు. యుక్తవయస్సుకు రాని బాలికలకు బలవంతంగా హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వారిని వ్యభిచార రొంపిలోకి దించుకున్నారు. ఇక దేశీయంగా అయితే వ్యభిచార వృత్తిలోనికి 90శాతం మందిని దింపుతున్నారు. అభం శుభం తెలియని పిల్లల అవయవాలు తొలగించి యాచకులుగా మారుస్తున్నారు. ఇంతటి హేయమైన చర్య దేశంలో చోటుచేసుకుంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అర్థం కావడంలేదని సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా ఆవేదన వ్యక్తంచేసింది. బీహార్, ఒడిస్సా, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ సమస్య అత్యధికంగా వుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పేదవారైన వారి తల్లిదండ్రులకు అధిక మొత్తంలో ధనం ఆశచూపించి, చిన్నపిల్లలను దారుణంగా పెళ్ళిళ్ళుచేసుకొని వారిని గల్ఫ్ దేశాలకు తరలించుకుపోయి అమానుషంగా బానిసలుగానో లేక సెక్స్‌వర్కర్లగానో మార్చేసే అరబ్బు షేకుల దారుణాలు ఎప్పటినుండో వెలుగుచూస్తున్నా ప్రభుత్వాలు నిర్లిప్త వైఖరి అవలంబించడం బాధాకరం. కాలం చెల్లిన భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 370, 1976నాటి వెట్టిచాకిరీ వ్యవస్థ (నిర్మూలన చట్టం), 1956నాటి అనైతిక తరలింపు (నిరోధక) చట్టం వంటి పసలేని చట్టాలను మనుషుల అక్రమ రవాణా కేసుల్లో నిందితులపై ఉపయోగిస్తున్నారు. పిల్లల అక్రమ రవాణాను ఐపిసీ సెక్షన్ 370లో నేరంగా పరిగణించాలని 2013లో నిర్ణయించారు. ఈ చట్టాలు ఆచరణలో అక్కరకు రానందునే సుప్రీంకోర్టు 2004లో సమగ్రమైన కఠినచట్టం తీసుకురావాలని ఆదేశించింది. అయితే గత 15 సంవత్సరాలలో ఈ అంశంలో ఒక కఠినమైన చట్టానికి రూపకల్పన చేసే తీరిక మన ప్రభుత్వాలకు లేకపోవడం అత్యంత శోచనీయం.

- సి.సాయిప్రతాప్, హైదరాబాద్