ఉత్తరాయణం

అరాచకవాదానికి కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సామాజిక అశాంతిని కలుగజేయడానికి అరాచకవాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. ఆ అవకాశం కోసం విచ్ఛిన్నకరవాదులు సిద్ధంగానే ఉంటారు. ఈ పెడధోరణులకు సమాజంలో స్థానం లేదని స్పష్ట పరచడంలో ప్రభుత్వం ముందుండాలి. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం, సోదరభావం ధ్యేయంగా రాజ్యాంగం రూపుదిద్దుకొంది. ఆ స్ఫూర్తిని కాపాడేందుకు అవసరమైన వ్యవస్థని స్వతంత్ర భారతం ఏర్పాటు చేసుకుంది. చట్టాల రూపంలో అందుకు తగ్గ ఆయుధాలు పాలకులకు అందుబాటులోనే ఉన్నాయి. అయితే విస్తృత సామాజిక లబ్ది స్థానే, సంకుచిత రాజకీయ లబ్దిని వివిధ పక్షాలు ముఖ్యమైనదిగా భావిస్తున్న కారణంగానే సామాజిక సమస్యలకు పరిష్కారాలు దొరకడంలేదు సరికదా సమస్యలు సంక్లిష్ట రూపాన్ని సంతరించుకొంటున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం దళితులపై జరుగుతున్న దాడులు. వాటిపై విభిన్నమైన స్పందనలు. దళితులపై దాడులు నాగరిక దేశానికి సిగ్గుచేటు. వాటిపై కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నీళ్లు నమలడం బాధ్యతారాహిత్యం. ఉత్తరప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన మాయావతిపై ఆ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు చేసిన నీచ వ్యాఖ్యలు రాజకీయ కాలుష్యానికి అద్దంపడుతున్నాయి. కొంతమంది వ్యాపింపజేస్తున్న ఈ రకమైన విషపూరిత కాలుష్యం సమాజాన్ని తీవ్రంగా నష్టపరుస్తోంది. కాబట్టి ప్రభుత్వం సమర్ధవంతంగా సామాజిక కాలుష్య నివారణా చర్యలు చేపట్టాలి. రాజ్యాంగ రక్షణల్ని అర్హులకు అందించడంతో పాటు నేరస్తుల్ని నియంత్రించాలి. అన్ని పక్షాలూ తమ స్వలాభాలకు అతీతంగా ఆలోచించి దేశాన్ని కాపాడుకోవాలి. కుల,మతాలపై రాజకీయ భవిష్యత్ నిర్మించుకునే కౌటిల్యాన్ని వీడాలి.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం
‘కంటితుడుపు’ పాలన
ప్రజలు అనేక విధాలైన సమస్యలు ఎదుర్కొంటుంటే, ‘‘ఇంటిముందుకు పాలన’’ కేవలం అక్షరాలకే పరిమితం. ఆధార్ కార్డు, రేషన్‌కార్డుల్లో పేర్ల తప్పులు కొల్లలుగా ఉన్నాయి. రెవెన్యూ విధానంలో పెండింగ్ కేసులు కుప్పలు తెప్పలుగా పడి వున్నాయి. ఇక విద్యార్థుల సర్ట్ఫికెట్లు, వృద్ధాప్య పింఛలను మీసేవా కేంద్రాలకు అనుసంధానం చేయడంతో ప్రజల అగచాట్లు చెప్పనలవికాకుండా ఉన్నాయి. గ్రామసభలు, పల్స్ సర్వేలు కేవలం కంటితుడుపు చర్యలుగానే ఉంటున్నాయి.
-కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
ఆన్‌లైన్ పరీక్షలతో నష్టం
ఎపిపిఎస్‌సి నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలను, రాష్ట్ర నిరుద్యోగులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ ఆన్‌లైన్ పరీక్షలు, ఒకే ప్రశ్నాపత్రంతో జరగవు. కొందరు అభ్యర్థులకు సులభమైన ప్రశ్నలు, మరికొందరికి కఠినపైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన ఆన్‌లైన్ పరీక్షలు, లోపభూయిష్టమైనవి. నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులందరికీ, ఒకే ప్రశ్నాపత్రం ఉండాలి. ఇలాంటి ఆన్‌లైన్ పరీక్షలు, వివిధ దశల్లో, ఎన్నికల మాదిరి నిర్వహిస్తారు. కాబట్టి నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఆన్‌లైన్ పరీక్షలు వద్దు అని, రాష్ట్ర నిరుద్యోగులు, ఎపిపిఎస్‌సిని కోరాలి.
-కావలి సురేఖ, పత్తికొండ, కర్నూలు జిల్లా
పాఠ్యాంశంగా చేర్చాలి
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్దఎత్తున మొక్కలను నాటుతున్నది. అయితే వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉంది. ఈ మొక్కలు నాటడం, వాటి సంరక్షణ నిరంతరం క్రమం తప్పకుండా జరగాలి. తద్వారా కాలుష్యం తగ్గుతుంది. సకాలంలో మంచి వర్షాలు పడతాయి. అయితే చెట్ల పెంపకం ఆవశ్యకత, చెట్లు లేకపోతే కలిగే నష్టాలను, విద్యార్థి దశ నుండే అందరికి తెలియజేయాల్సి ఉంది. ఈ విషయాలను సవివరంగా తెలుపుతూ ఉన్నత పాఠశాలల సిలబస్‌లో పాఠ్యాంశంగా చేర్చాలి. ప్రతి ఒక్క విద్యార్థినీ ఉత్తేజపరిచేలా, తద్వారా సమాజాన్ని జాగృతం చేసే లా పాఠ్యాంశం ఉండాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
అదనపు చార్జీలు అహేతుకం
ఆగస్టు 12 నుంచి నిర్వహించే కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని రోజువారీ రైళ్లకు అదనంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనుంచి వేసే ప్రత్యేక రైళ్లలో అధిక చార్జీలు వసూలు చేస్తామని రైల్వేశాఖ ప్రకటించడం సహేతుకం కాదు. పనె్నండేళ్లకోమారు వచ్చే ఈ పుష్కరాల సమయంలో చార్జీల్లో రాయితీలు కల్పించాల్సింది పోయి అదనపు భారం మోపడం దారుణం. రైల్వేశాఖ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

‘బీపు’లు వద్దు
టివి కార్యక్రమాల్లో అభ్యంతరకరమైన పదాలు ఎవరైనా వాడితే, ధ్వని రాకుండా చేసి ‘బీప్’ అని వినిపిస్తున్నారు. ఇదే విధంగా సినిమాల ప్రసారాలలో కూడా ‘బీపు’లు వినిపిస్తున్నారు. సెన్సాన్ అయిన చిత్రాలను యథాతథంగా ప్రసారం చేయాలే తప్ప, ‘కట్’ చేయడం, ‘బీపు’లు వేయడం బాగాలేదు.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్