ఉత్తరాయణం

ఈ ఉదయం.. నా హృదయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని మోదీ చెప్పిన ‘నోట్ల రద్దు యాగం’ మొత్తానికి ముగిసినట్టే. ఇక యాగఫలాలపై ఆయన ఏమంటారో యావత్ జాతి ఆశగా ఎదురుచూస్తోంది. అలనాడు తక్షకుడితో పాటు సర్ప సంతతిని రూపుమాపడానికి జనమేజయుడు సర్పయాగం చేసినట్టు- ‘నల్ల సర్పాల’ను నాశనం చేస్తానంటూ పెద్దనోట్ల రద్దు యాగం మోదీ మొదలుపెట్టారు. పురాణ కథలో తక్షకుడు తప్పించుకొన్నట్టే, ఇక్కడ కూడా ‘నల్ల’ త్రాచులు తప్పించుకున్నట్లు చాలామందిలో ఒకటే అనుమానం.
ప్రజలు:
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే
ఇన్నాళ్లూ చూసిన నరకం.. నగదు దొరికి మటుమాయవౌనంటే
ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి?
ప్రధాని:
నీతికి నిలబడువానికి.. ఏ నోటుకీ లోటు రాదని
అవినీతికి పాల్పడువానికి ఏనాటికీ పోటు తప్పదని
నే పన్నిన వ్యూహం సాంతం నీకు చెప్పాలని వస్తే.. ఇంకా..
ప్రజలు:
‘నల్ల’నాగులు తిరిగే కోనలో, నీ పంతం పనికిరానిదని
కట్టలు కట్టలు కొత్త నోట్లన్నీ వారి వాకిట్లోనే
చేరెననీ.. చిటికెలోనే చేరెననీ,
బ్యాంకు క్యూలో నిలబడు వానికి.. వట్టి థేంక్యూలైనా మిగలవని
నా అనుభవ సారం నీకే చెప్పాలని వస్తే.. ఇంకా ..
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

రాయితీపై ప్రచారం చేయరా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 16 నాటికి 60 ఏళ్లు నిండిన వారికి ఆర్టీసీ బస్సు చార్జీల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. ఈ విషయం చాలామంది వృద్ధులకు తెలియదు. అందుకు కారణం ఎక్కడా ప్రచారం చేయకపోవడమే. బస్టాండ్‌లలో, బస్‌లపై పెద్ద అక్షరాలతో ఈ రాయితీ గురించి రాయించాలి. దీని కోసం ఆధార్ కార్డు చూపించాలని కూడా ప్రచారం చేయాలి. ఎంతోమంది వృద్ధులు ఈ విషయం తెలియక, ఆధార్ కార్డులు తమవెంట తెచ్చుకోక రాయితీని వదులుకుని ప్రయాణిస్తున్నారు. ‘టిక్కెట్ లేని ప్రయాణం నేరం. అందుకు రూ. 500 జరిమానా, జైలుశిక్ష తప్పదు’ అని ప్రతి బస్సులో రాస్తారే. మరి ఈ 25 శాతం గురించి బస్సుల్లోకానీ, బస్‌స్టేషన్‌లో కానీ ఎందుకు రాయరు? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఉండదు. సంవత్సరం మాత్రమే ఉంటుంది. దాన్ని పరిగణనలోకి తీసుకొని వృద్ధులకు బస్సులో రాయితీని అమలు చేయాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

ఫీజుల మోత భరించలేం
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అంతే లేకుండాపోతుంది. పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి, డ్రెస్సులు వంటివన్నీ తమ వద్దనే కొనాలని ప్రైవేట్ విద్యాసంస్థలు అందినకాడికి డబ్బు గుంజుతున్నాయి. టాలెంట్ టెస్టుల పేరిట తరచూ అదనపు ఫీజులు వసూలు చేయడం, పిక్నిక్‌లు, విహారయాత్రలు, వార్షికోత్సవాలు అంటూ డబ్బు వసూలు చేయడం జరుగుతోంది. తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల జోరుకు కళ్లెం వేయాలి. విద్యాశాఖ అధికారులు ఇకనైనా బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రైవేటు విద్యాసంస్థలపై నిఘా పెంచాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ఉప్పుటేరుపై వంతెన ఎప్పుడు?
కాకినాడ సహా సమీప ప్రదేశాల నుండి వచ్చే వాహనాలు పాత వంతెన మీద నుండి అవతలి వైపువెళ్లడం చాలా కష్టంగా వుంటున్నది. ప్రయాణికులు నిత్యం నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లడం ఆలస్యం అవుతున్నది. వీటి మధ్య పాదచారులు తప్పుకోవడం చాలాకష్టంగా వుంటున్నది. వాహనాల ట్రాఫిక్ బాగా పెరిగింది. జనసాంద్రత ఎక్కువైంది. ఈ కారణంగా ఇక్కడి ఉప్పుటేరుపై మూడవ వంతెన నిర్మించడం చాలా అవసరం.
- మందపల్లి సత్యం, రామచంద్రపురం

ఫిరాయంపులను నిరోధించరా?
ఎపి, తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీల ఫిరాయింపులు చూస్తుంటే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందా? అనిపిస్తుంది. తమకు అవసరంలేకున్నా అధికార పక్షాలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండటం విడ్డూరం. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రలోభాలకు ఆశపడి పార్టీలను మారుస్తుంటే ప్రజస్వామ్యం ప్రశ్నార్థకమవుతుంది. ఎవరైనా పార్టీ మారే ఉద్దేశం ఉంటే పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలలో పోటీ చేయాలి. ఫిరాయింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి పాలనపై సిఎంలు దృష్టి పెడితే మంచిది. పార్టీ మారినవారి సభ్యత్వం తక్షణం రద్దు చేయడమే కాక మళ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా చట్టం చేసి, స్పీకర్ పరిధిలో కాకుండా ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకొని రావాలి. లేకపోతే ప్రతిపక్షంలో ఉండటానికి ఏ ఒక్కరూ ఇష్టపడకుండా ఎన్నికలు అయిన తక్షణం నియోజకవర్గం అభివృద్ధి పేరుతో అధికార పార్టీలోకి మారిపోవడం దుష్ట సంప్రదాయంగా మారిపోవడం ఖాయం.
- ఎం. రాజారావు, పలాస