ఉత్తరాయణం

రైళ్లలో భద్రత ప్రశ్నార్థకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం జిల్లా కూనేరు వద్ద హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో నలభై ఒక్క మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది గాయాలపాలు కావడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా, అలసత్వమా, విద్రోహచర్యా అన్నది పక్కనపెడితే - రైల్వే భద్రత రానురానూ తీసికట్టుగా తయారౌతుందన్నది కాదనలేని సత్యం. జనసామాన్యానికి ప్రధాన ప్రయాణ సాధనంగా, సరకు రవాణాకి ప్రధానమార్గంగా ఉన్న భారతీయ రైల్వే ఆధునీకరణ సంతరించుకోవడం లేదు. పాత బోగీల స్థానే ఆధునిక ఎల్.హెచ్. బోగీల్ని ప్రవేశపెడితే ప్రమాద పరిస్థితుల్లో నష్ట తీవ్రత తగ్గుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు నత్తనడకన సాగుతున్నాయి. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు, కాలపరిమితి ప్రకారం పట్టాల్ని సరిదిద్దే పనులు, ట్రాఫిక్ పరంగా పర్యవేక్షక సిబ్బందిని పెంచడం, బలహీనమైన వంతెనల స్థానంలో కొత్తవాటిని నిర్మించడం ఇత్యాది కార్యాచరణలు నిధులలేమి పేరుతో ఆలస్యంగా, అరకొరగా రూపుదాలుస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాల్ని గాలిలో దీపాలుగా మార్చే ఈ ధోరణినుండి రైల్వేశాఖ బయటపడాలి. ఇపుడు సాధారణ బడ్జెట్‌లో భాగమైపోయిన రైల్వేశాఖ పద్దులో ప్రయాణీకుల రక్షణకు, భద్రతకు ఏస్థాయిలో నిధులు కేటాయిస్తరన్నది అనుమానమే.
-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

హామీలు మరచారా?
ఉద్యోగులపైనే ప్రభుత్వ భవిత ఉంది. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన సాగుతుందని ఎన్నికల ముందు వల్లెవేసి అధికారం చేపట్టిన పిదప ఎపి సిఎం చంద్రబాబు రిటైర్మెంట్ వయసును పెంచడం తప్ప చేసిందేమీ లేదు. వేతన సవరణ సంఘం సూచించిన సర్వీసు వెయిటేజి ఐదునుండి ఎనిమిదేళ్లకు పెంపు, జూన్ 14నుండి మార్చి 2015వరకు గల సవరణ బకాయిలు చెల్లించకపోవటం, ఖాళీల భర్తీ హామీ కాగితాలకే పరిమితమైంది. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించని ఎన్నో పనులకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తుండగా, పథకాలను చిత్తశుద్ధితో అమలుచేసే ప్రభుత్వోద్యోగుల సమస్యలను పక్కనపెట్టడం సరైనది కాదు. ఉద్యోగులు, పింఛనుదారులు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఎన్నికల ముందు వారికి ఇచ్చిన హామీలు అమలుచేయాలి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

విగ్రహాలకు ముసుగులేల..
ఎన్నికల సంఘం ఆదేశాలు కొన్ని ఒక్కోసారి భలే వినోదాలు పంచుతాయి. ఫలానా నేతల ఫొటోలు, విగ్రహాలు, పార్టీ గుర్తులు రోడ్లపై ఎక్కడా కనిపించరాదని ఎన్నికల సంఘం వోట్ల జాతర జరిగే ప్రతిసారీ ఆదేశిస్తుంది. భారీ హోర్డింగ్‌లు, విగ్రహాలు తొలగించలేక వాటికి కాగితాలు అంటించడమో, ముసుగు వేయడమో చేస్తారు. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే ప్రజలు తెలివి మీరారు. బొమ్మలు, విగ్రహాలను చూసి వారి మనసులు మారిపోవు. ఓటువేయాలనుకున్న వారికే వేస్తారు. పైగా ముసుగులు, అంటింపులు వారి దృష్టిని మరీ ఆకర్షిస్తాయి. వాటి వెనుక ఏ నేతలు, ఏ గుర్తులున్నాయో మననం చేసుకుంటారు. అలాంటప్పుడు ఎన్నికల సంఘం లక్ష్యం దెబ్బతిన్నట్టే కదా!
- హితీక్ష, రమణయ్యపేట