ఉత్తరాయణం

లేటైనా.. దీటైన తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు అవినీతికి శిక్ష పడింది. న్యాయం రావడం లేటేమో కానీ రావడం మాత్రం పక్కా అన్న భరోసాను ప్రజల్లో నింపింది. సరైన సందర్భంలో రావడంతో జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పు చారిత్రకమై నిలుస్తుంది. జయ మరణానంతరం ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవడానికి సకల ప్రయత్నాలూ చేస్తున్న ఆమె నెచ్చెలి, సహ నిందితురాలు శశికళని దోషిగా నిర్థారించి, పదేళ్లపాటు ప్రత్యక్ష రాజకీయాలకు అనర్హురాలిని చేసిన సుప్రీం తీర్పు న్యాయవ్యవస్థ గౌరవాన్ని పెంచింది. చట్టానికి దొరికినా ఏళ్లకు ఏళ్లుసాగే దర్యాప్తు, న్యాయ విచారణ ప్రక్రియల్లో కాలం దొర్లించేయొచ్చన్న ధీమావల్ల అవినీతి పెరగడానికి అనువైన వాతావరణం అంతటా నెలకొని ఉంది. ప్రతి అవినీతి కలాపాన్ని న్యాయస్థానం బోనెక్కించే పరిస్థితి అసాధ్యం. న్యాయస్థానం వరకూ తీసుకెళ్లగలిగినా, చట్టాల లొసుగుల్ని సమర్థవంతంగా వాడుకొనే బలమూ, శక్తీ, అవినీతిపరులకే సహజంగా ఎక్కువ. కేసు తుది దశకి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టడం ఖాయం. ఏదిఏమైనా జయలలిత, శశికళ మిగతావారి బంధువులు అక్రమార్జన కేసులో దోషులుగా తేలడం, శిక్షకు పాత్రలు కావడం సమాజానికి శుభసూచకం. ప్రజాజీవితంలో అవినీతి తగ్గేలా అప్రమత్తంగా వ్యవహరించడానికి పౌర సమాజాన్ని, కట్టుదిట్టమైన చట్టాల్ని, శీఘ్రగతిన న్యాయాన్ని, శిక్షల్ని ఖరారు చేసే వ్యవస్థల్ని తీర్చిదిద్దేలా ప్రభుత్వాన్ని ఈ తీర్పు మేల్కొల్పితే అంతే చాలు.
-డా.డివిజి శంకరరావు, పార్వతీపురం

ఆలోచించి హామీలివ్వండి..
విజయవాడలో విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి దేశాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తాడో’ అని చెప్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని ఉదహరించారు. సాధ్యాసాధ్యాలు, రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా ఎన్నికల ముందు చెప్పిన వాటిని అమలు చేస్తూ అభాసుపాలయ్యాడు ట్రంప్. మరి.. చంద్రబాబు చేసిందేమిటి? సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా కాపుల్ని బిసిల్లో చేరుస్తానని ఎలక్షన్ మానిఫెస్టోలో చెప్పలేదా? అందువల్ల ఇరకాటంలో పడి అభాసుపాలవలేదా? అన్ని విషయాలూ బాగా ఆలోచించాకే ఎలక్షన్ మానిఫెస్టో తయారుచేసుకోవాలి.
-చైతన్య, వాకలపూడి (తూ.గో.జిల్లా)

జనం ఆకాంక్షలు తీర్చరా?
విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ హామీ ఈసారి కూడా తుంగలోకి తొక్కి రాష్ట్రప్రజలను కేంద్ర పాలకులు మరొకసారి నిరాశ పరిచారు. ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన రైలు మార్గాలు తప్ప ఆంధ్రలో స్వాతంత్య్రం తర్వాత ఒక్క రైలు మార్గం కాని, రైల్వే పరంగా ఓ కర్మాగారం గాని నిర్మించలేదు. రాజకీయ లబ్ధి కోసం అత్యధిక ఆదాయం వస్తున్న విశాఖను కాదని, రైల్వే పరంగా ఒడిశాకు మేలు జరుగుతున్నా పాలకులు, రాజకీయ పార్టీలు నోరుమెదపడం లేదు. ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో అత్యధిక ఆదాయం తెచ్చే విశాఖ డివిజన్‌లో రైల్వేశాఖ పరంగా అభివృద్ధి శూన్యం. ఉన్న రైళ్ళను భువనేశ్వర్‌కు తరలించుకుపోయారు. కొత్త రైళ్లను దువ్వాడ మీదుగా ప్రవేశపెట్టారు. విశాఖ డివిజన్‌లో రైల్వేస్టేషన్ల ఆధునీకరణ ఎండమావిగా మిగిలింది. కొత్త రైల్వే జోన్ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, సౌకర్యాలు విస్తరిస్తాయన్న విశాఖ వాసుల ఆకాంక్షలను రైల్వేమంత్రి సురేష్ ప్రభు నీరుగార్చడం ఆంధ్రుల దౌర్భాగ్యం.

-సి.ప్రతాప్, శ్రీకాకుళం
ట్రంప్ నిర్ణయం మంచిదే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం దేశాల వారు తమ దేశంలోకి రాకూడదని నిర్ణయించడం ప్రపంచ శాంతికేనన్నది యధార్థం. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని రూపుమాపాలనే లక్ష్యంతోనే ముస్లిం దేశాలపై ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ నిర్ణయం మతోన్మాద ఉగ్రవాదాన్ని అణచివేస్తుందని ప్రపంచం గుర్తించాలి. తీవ్రవాదులు ఏ దేశం నుండి వచ్చినా అడ్డుకోవలసిందే. పాకిస్తాన్ ప్రేరణతో తీవ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించకుండా నిరోధించవలసిందే! పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ తదితర దేశాలకు ట్రంప్ నిర్ణయం వర్తించాల్సిందే. ప్రపంచశాంతి ప్రధానమని అన్ని దేశాలు గుర్తించాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురం