ఉత్తరాయణం

వౌనం ఉత్తమ సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ- ‘దరిద్ర బ్రాహ్మణులు’ అని విచక్షణ లేకుండా తన హోదాకు, సెక్యులర్ విధానానికి మచ్చతెచ్చేలా విమర్శలు చేయడం విచారకరం. దీనిని ఇతర కులాల వారు, ప్రభుత్వం, ప్రతిపక్షం అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. ఇదే ఇతర కులాలను విమర్శిస్తే అట్రాసిటీ కేసు వెంటనే నమోదయ్యేది. బ్రాహ్మణులు సహజంగా సాత్వికులు. గొడవల జోలికి పోరు. అవమానాలను మానసికంగా అనుభవించే విజ్ఞత కలవారు. ఈ సంఘటనను రాద్ధాంతం చేయవద్దు. ఈ విషయం ప్రభుత్వం చూసుకుంటుంది. వౌనమే ప్రతీకారం లాంటిది. ఇది వారి వినయ సంస్కారానికి నిదర్శనం లాంటిది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
‘నిషేధం’ వల్ల ఒరిగేదేమిటి?
నేరం రుజువైన పక్షంలో రాజకీయ నాయకులు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలన్న ఎలక్షన్ కమిషన్ సూచనను సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపి అభిప్రాయం అడిగింది. జీవితాంతం నిషేధిస్తే మాత్రం ప్రయోజనం ఉంటుందా? తమిళనాడులో శశికళపై నిషేధం ఏమైంది? తన భృత్యులకు అధికారం అప్పగించినట్టు కనిపిస్తూ జైలునుంచి ఆమె పాలిస్తున్నది. మంత్రులు తరచూ జైలుకి వెళ్లి ఆమె సూచనలు తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానే్నకాక సుప్రీం కోర్టునూ వెక్కిరించటమే. పార్టీ కేడర్ బానిస మనస్తత్వం వల్లనే నిషేధం పక్కదారి పట్టింది.
- శాండో ప్రచండ్, కాకినాడ
విదేశీ సంస్కృతి వెర్రితలలు
నైతిక విలువలు, సంప్రదాయాలకు అద్దం పట్టే భారతీయ జీవనానికి
పెనుముప్పు వాటిల్లే విధంగా పాశ్చాత్య సంస్కృతి వ్యాపిస్తోంది. విదేశీ పోకడలను వ్యాపింపజేయడంలో ప్రసార మాధ్యమాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. సినిమాల్లో అశ్లీలత, అసభ్యత, స్ర్తిపాత్రలను ‘వ్యాంప్’ స్థాయికి దిగజార్చడం, సహజీవనం వంటి అనైతిక కార్యకలాపాలను విశృంఖలంగా చూపిస్తున్నారు. నగరాలలో ర్యాంప్ వ్యాక్‌లు, ఫ్యాషన్ షోలు, రేవ్ పార్టీలతో స్ర్తిలను వికృతంగా, అంగడి సరుకుగా దిగజార్చేస్తున్నారు. టీవి సీరియల్స్‌లో స్ర్తిలను విలన్స్‌గా, అకృత్యాలు, దారుణాలకు కారకురాలిగా చిత్రీకరిస్తూ స్ర్తిలపట్ల చులకన భావం ఏర్పడేందుకు దోహదం చేస్తున్నారు. విదేశీ సంస్కృతిని ప్రోత్సహిస్తూ నైతిక విలువలను దిగజారుస్తున్న ప్రసార మాధ్యమాలపై నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
మేధావులతో మార్పు వస్తుందా?
రాజ్యసభలో, శాసనమండలిలో మేధావులకు చోటు ఇస్తే మంచి చట్టాలు వస్తాయనుకోవడం కేవలం భ్రమ. మన నోబెల్ గ్రహీతకు స్థానం యిస్తే భారత్‌కి వ్యతిరేకంగానే మాట్లాడతాడు. హక్కుల మేధావులకు సీటు యిస్తే మావోయిస్టుల తరఫునే మాట్లాడతారు. కొందరు రచయితలు, కవులు, మేధావులు ‘పెద్దల సభ’లో పదవులు అనుభవించినా వారు చేసిందేమీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. మేధావులకు పదవులిచ్చినంత మాత్రాన వారి మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేదు.
- హితీక్ష, రమణయ్యపేట