ఉత్తరాయణం

కుల పోరాటాలు ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలోగాని, దేశంలోగాని కుల పోరాటమనేది సమాజానికి కీడు. కులంకోసమే పోరాడే ఏ రాజకీయవేత్తనైనాసరే సమాజం నుండి వెలివేయాలి. తమ కులానికే ప్రభుత్వ ఫలాలు అందాలని కోరటం నీచాతినీచమైన సంస్కృతి. మిగతా కులాలు వీరి దృష్టిలో కనబడవా? వీరికి ఇతర కులాల బాగోగులు పట్టవా? కుల పోరాటగాళ్లను సమాజం క్షమించదు.
బీదలు అన్ని కులాల్లోను వున్నారు. రిజర్వేషన్లకు ప్రతి కులంవారు అర్హులే! ప్రతి కులం నిరాహార దీక్ష, ఆమరణ దీక్షలు చేస్తే ఏమవుతుందో ఆలోచించండి. రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా భావించే వ్యక్తే నిజమైన ప్రజాసేవకుడు. అంతేగాని ఏదో ఒక కులానికో, వర్గానికో నిలబడే వ్యక్తి రాజకీయవేత్తగాదు - సమాజ ద్రోహియని చెప్పక తప్పదు. ప్రతిరోజు ఏ పత్రిక చదివినా కుల పోరాటగాళ్ల వార్తలేనా? నిజంగా చెప్పాలంటే కుల రిజర్వేషన్లకు అంతిమకాలమాసన్నమైంది. సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘంగా ఆలోచించాలి. రిజర్వేషన్లవల్ల ప్రజల్లో ఐకమత్యం లోపించరాదు.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

కారుణ్య మరణానికి కరుణ
బ్రెయిన్‌డెడ్ అయినవారు ఇక బతుకరని, బతికున్నంత కాలంలో వారిని కడతేర్చలేక, వెంటిలేటర్ల మీదనే కొన ఊపిరితో నెలల తరబడి ప్రాణం నిలుస్తున్న వారికి వైద్యం చేయించలేక, ఉన్న ఆస్తులు అమ్మి, అప్పులు చేసి వీధినపడుతున్న కుటుంబాల వారి ఆవేదనను అర్థం చేసుకుని కేంద్రం కారుణ్య మరణానికి అనుమతినివ్వడానికి సమ్మతి తెలపడం నిజంగా ఓ మంచి పరిణామం. వైద్య శాస్త్రం ఒప్పుకోదని గతంలో అనేక మంది బాధితులు చేసుకున్న విన్నపాలను వినిపించుకోలేదు. రోగి నరకయాతనను, కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిని దృష్టిలోనుంచుకుని తీసుకున్న అనాయాస మరణానికి అనుమతినివ్వడం హర్షించదగినదే.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

సిద్దేశ్వరం అలుగు నిర్మించాలి
అనాది నుండి రాయలసీమకు అన్యాయమే జరుగుతోంది. 70 సంవత్సరాల వెనుకకు పోయినట్లయితే అప్పట్లో ప్రజలు చాలా కష్టపడేవారు. ‘కవిల’ సేద్యంతో రాగులు, కొర్రలు, జొన్నలు పండించేవారు. ఆంధ్రుల ముఖ్యమైన పండుగలలో కూడా సరైన భోజనం ఉండేది కాదు. సంక్రాంతి పండుగ రోజున మాత్రమే వరి అన్నం (ఆబువ్వ) తినేవారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్ళలో సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని పెద్దలందరు చెప్పారు. ఇంతలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సిద్దేశ్వరం ప్రాజెక్టును తుంగలో తొక్కి నాగార్జునసాగర్ వెలసింది. ఇది ఆనాటి చరిత్ర. ఎప్పటినుంచో ప్రతిపాదనలకే పరిమితమైన సిద్దేశ్వరం అలుగును ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై ప్రారంభించాలి.
- అందా వెంకటసుబ్బన్న, మైదుకూరు

ముందు జాగ్రత్తలు అవసరం
ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అధిక వర్షాలకు తోడు పలు వ్యాధులూ పొంచి ఉన్నాయి. ఫ్లూ, స్వైన్‌ఫ్లూ, చికెన్‌గున్యా ఇంకా అనేక వ్యాధులు విజృంభించనున్నాయి. ఆరోగ్యశాఖ అధికారులు ముందుగానే అప్రమత్తం కావాలి. వాటి నివారణకు తగిన మందులను ముందుగానే ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయాలి. ప్రజలకు అలాంటి వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు ప్రచార సాధనాల ద్వారా చెప్పాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

రాజకీయాల్లో చెప్పులు, చీపుర్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్పులు, చీపుర్ల ప్రస్తావన గత కొన్ని రోజులుగా ఎక్కువైంది. ఇటు విపక్షం, అటు అధికార పక్షం ఈ రెంటిని తమ ఉపన్యాసాలలో ప్రస్తావిస్తున్నారు. నిజం చెప్పాలంటే చెప్పులు, చీపుర్ల ప్రస్తావనను మొట్టమొదట తెచ్చింది విపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మాత్రమే. ఇందుకు ప్రతిగా అధికార పక్ష నాయకులు తామేమీ తక్కువ కాదంటూ వాటి ప్రస్తావనను తెస్తున్నారు. ఇటు విపక్షానికైనా, అటు అధికార పక్షానికైనా చెప్పులను, చీపుర్లను చులకన చేయడం తగదు. చెప్పులు మన పాదాలకు రక్షగా ఉంటూ సేవలందిస్తున్నాయి. ఇక చీపుర్లా! స్వచ్ఛ్భారత్‌కు ప్రధాన ఉపకరణం చీపురే. మన ఇంటిని పరిసరాలను శుభ్రంకు ఉపయోగపడే చీపురును చీపుగా చూడడం మంచిది కాదు.
- వి.కొండలరావు, పొందూరు

మానవ జన్మ ఉత్తమమైనది
మానవజన్మ అన్ని జన్మలకంటే ఉత్తమమైనది, దుర్గ్భమైనది. తాను బతుకుతూనే పది మందిని బతికించాలనేదే మానవుల జీవిత లక్ష్యంగా శాస్త్రాలలో ఉంది. మానవులకు మానవతా విలువలు, ప్రేమానురాగాలు, నైతిక ధర్మం పాటించడం తప్పనిసరి. సేవాభావం పెంపొందించుకొని న్యాయార్జితంలో కొంతభాగం సమాజంలోని అన్నార్తులకోసం వినియోగించాలి. తాను నేర్చిన విద్యను పది మందికీ పంచి యివ్వాలి. నేటి ఆధునిక మానవుడు ఇంద్రియ సుఖాలు, భోగభాగ్యాలలోనే అనునిత్యం మునిగి తేలుతున్నాడు. ప్రేమ, దయ, కరుణ, నిస్వార్థత వంటివి అనవసర విషయాలుగా, చేతకాని వారు పాటించేవిగా భావిస్తున్నారు. సనాతన భారతీయ జీవన విధానం, సత్సంప్రదాయాలకు తిలోదకాలు యిచ్చి పాశ్చాత్య జీవన సంస్కృతిని పాటించడం మంచి విధానం కాదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం