ఉత్తరాయణం

హార్బర్ పనులు ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్ల క్రితం హుద్‌హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న విశాఖ షిప్పింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఈ హార్బర్‌లో దాదాపు 700 మెకనైజ్డ్ బోట్లపై ఆధారపడి వేలాదిమంది మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తుపాను కారణంగా జెట్టీ,గిడ్డంగులు, యాంకరింగ్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి. 40 కోట్ల రూపాయలతో హార్బర్‌ను ఆధునీకరిస్తామన్న అధికారుల హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పారిశుద్ధ్య లోపం, టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, చేపలు ఎండబెట్టేందుకు ప్లాట్ ఫారాలు ఇప్పటికీ లేవు. దీంతో సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే పలు సంస్థలు తమ వ్యాపారాన్ని మూసివేశాయి. ఫలితంగా వేలాది మత్స్యకారులు రోడ్డున పడ్డారు.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం

బస్సుల్లో ఆకతాయిలు
విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు ఎపిఎస్ ఆర్టీసీ పల్లెలు, పట్టణ ప్రాంతాలకు బస్సులను బాగానే నడుపుతోంది. సీజన్ టిక్కెట్లు తీసుకునే విద్యార్థులు ఈ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది. పాఠశాల విద్యార్థులతో సమస్య ఏమీ లేదు. కానీ, చాలామంది కళాశాల విద్యార్థులు బస్సుల్లో మితిమీరి అల్లరిచేస్తూ తమ ఆకతాయితనంతో మిగతా ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీరు చేసే వెకిలిచేష్టలు ఒక్కోసారి ఇతర ప్రయాణీకులకు రోత పుట్టిస్తున్నాయి. వీరిని బస్సు కండక్టర్, డ్రైవర్లు ఏమీ అనరు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి ఈ ఆకతాయిలను అదుపుచేయాలి.
-గంధం శేషేంద్రరావు, అత్తిలి

నిబంధనలు పాటించరా?
రైల్వేశాఖ వారు నిబంధనలు పాటించక ప్రయాణీకులను ఇబ్బంది పెడుతున్నారు. పెద్ద పెద్ద రైల్వేస్టేషన్లు, జంక్షన్ల వద్ద రైలు ఆగేందుకు 5నుండి 15 నిముషాల సమయం కేటాయిస్తారు. కొన్ని జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలల్లో మాత్రం రైళ్లకు రెండు నిముషాలు కేటాయించారు. ఇది కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. రెండు నిముషాలు ఆగాల్సిన స్టేషన్ల వద్ద నిబంధనలను పాటించనందున ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. ఒక నిమిషం కూడా ఆపకపోవడంతో రైలు ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైలు కదిలిపోతుండగా అందరూ ఎక్కలేరు, దిగలేరు కూడా. పిల్లలు, మహిళలు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని కచ్చితంగా రెండు నిమిషాల సేపు రైళ్లు ఆగితే ఎలాంటి సమస్యా ఉండదు.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

‘అదనపు’ దోపిడీ!
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతూ అదనపుచార్జీలను వసూలు చేయడం, ముఖ్యమైన స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను పదినుండి ఇరవై రూపాయలకు పెంచడం దారుణం. ఇది నిజంగా రైలు ప్రయాణీకులను నిలువుదోపిడీ చేయడమే. సాధారణ ప్రయాణ చార్జీలు శ్లాబ్ విధానంలో 1 కిమీ నుండి 20 కిమీ వరకు 5 రూపాయలు చొప్పున, 21 కిమీ నుండి 45 కిమీ వరకు రు.10 చొప్పున వసూలు చేస్తున్నారు.
ప్లాట్ ఫాం టికెట్ ధర 10 రూపాయలు అంటే- 45 కిమీ సాధారణ ప్రయాణ ఛార్జీతో సమానం అవుతోంది. ప్లాట్ ఫాం టికెట్ ధర భారం కావడంతో సామాన్య ప్రజలు వాటిని కొనడానికి ఇష్టపడడం లేదు. దీని ధరను 5 రూపాయలకు తగ్గిస్తే అన్ని వర్గాలవారూ కొంటారు. ఫలితంగా రైల్వేశాఖకు ఆదాయం పెరుగుతుంది. సాధారణ రైలు చార్జీ కనిష్ట ధరతో ప్లాట్‌ఫాం టికెట్ ధరను సమన్వయపరిచి సగటు ప్రయాణీకులకు భారం కాకుండా చర్యలు తీసుకోవాలి.
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి

‘బెజవాడ’ బెటర్..
విజయవాడకు ప్రాచీనమైన పేరు ‘బెజవాడ’. తెలుగు సాహిత్యంలోనూ, అలనాటి రాజుల కాలంలోని శాసనాల్లో కూడా బెజవాడ పేరే వుంది. క్రీ.శ. 10వ శతాబ్దం నాటి యుద్ధమల్లుడి శాసనం ఇందుకు తార్కాణం. 6,7 శతాబ్దాల నాటి శాసనాల్లో ‘బెజయిత్త భటరళదత్తి’ అని వుంది. యుద్ధమల్లుడి శాసనంలో ‘కందుకూర్ బెజవాడ గావించె మెచ్చి’ అని వుంది. అయితే, బెజవాడ అనే పేరు బ్రిటిష్ వారు పెట్టినదని నేడు చాలామంది భావిస్తున్నారు. నిజానికి ‘విజయవాడ’ అనే పదం భాషాపరంగా దుష్ట సమాసం. ‘విజయ’ సంస్కృత పదం. ‘వాడ’ తెలుగు పదం. ఈ పదాలను కలపకూడదు. పూర్తిగా సంస్కృతంలో వ్యవహరించదలిస్తే ‘విజయవాటిక’గా పేర్కొనాలి తప్ప విజయవాడగా వుండడానికి తెలుగులో వీలులేదు. బెజవాడ అచ్చమైన తెలుగు పదం. గనుక విజయవాడను బెజవాడగా సరిచేయడం సర్వోత్తమం.
-కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్