ఉత్తరాయణం

సైనికుల సేవలు నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల పైశాచిక చర్యలకు ప్రాణాలను కోల్పోతూ తమ కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్న ప్రతి సైనికుడూ కోట్లాది భారతీయుల హృదయ మందిరాలలో కొలువుదీరిన దేవుడే. దేశ భద్రత కోసం జీవితాలను అంకితం చేస్తున్న సైనికులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అమర సైనికుల కుటుంబ సభ్యులకు ఏ లోటూ రాకుండా చూసుకోవడం మన ఏలికల కనీస బాధ్యత. కానీ, చాలా సందర్భాలలో అమర సైనికుని భార్యాపిల్లలు కడు దయనీయ పరిస్థితిలో జీవితాలను పెనుభారంగా వెళ్లదీయడం ఎంతో బాధాకరం. సైనికుల కుటుంబాలకు కనీస వసతులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపాలి.
-అల్లాడి వేణుగోపాల్, నెల్లూరు

పిల్లలను గమనిస్తున్నారా?
రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నందుకు అందరూ ప్రభుత్వాన్ని నిందిస్తూ విమర్శలు చేస్తుంటారు. నిజానికి ఈ ప్రమాదాల్లో ప్రజల నిర్లక్ష్యం తక్కువేమీ కాదు. మైనారిటీ తీరని పిల్లలకు తల్లిదండ్రులే బైక్‌లు కొని ఇస్తున్నారు. ప్యాకెట్ మనీ, స్మార్ట్ఫోన్, బైక్- ఏది కోరితే అది ఇచ్చేస్తూ పిల్లలకు ఇచ్చేస్తున్నారే తప్ప వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో చాలామంది పేరెంట్స్ గమనించడం లేదు. టీనేజీ యువత మద్యం, డ్రగ్స్‌కి అలవాటుపడటం కూడా తల్లిదండ్రులకు తెలియడం లేదు. మద్యం మత్తులో బైక్‌మీద దూసుకుపోతూ ఎంతోమంది యువకులు మృత్యువాత పడుతున్నారు. వీరు చేసే ప్రమాదాల వల్ల మరికొన్ని కుటుంబాలు కూడా విషాదానికి లోనవుతున్నాయి. పిల్లల మీద తల్లిదండ్రులకు అదుపు లేకుండా పోవడం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
-ఎ.చైతన్య, వాకలపూడి

నదీ జలాలు జాతీయ సంపద
తమిళనాడు, కర్నాటక మధ్య కావేరీ జలాల కలహాలు, ఆంధ్ర-తెలంగాణ మధ్య కృష్ణా-గోదావరి నదీ జలాల తగాదాలు, ఇతర రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు చూస్తుంటే నదీ జలాలను జాతీయం చేస్తేనే ఇవి తగ్గుతాయనిపిస్తుంది. నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం ఉంటే నికర జలాలు లేకుండా ఆనకట్టలు నిర్మించడం, తమకు ఇష్టం వచ్చిన ప్రాంతానికి నీరు ఇవ్వడం, అడ్డగోలుగా ప్రాజెక్టుల నిర్మాణాలు పెంచడం వంటివి జరుగుతున్నాయి. కాంట్రాక్టులను ఏకపక్షంగా ఇవ్వడం, ఓట్లు కోసం నీటి రాజకీయాలు చేయడం, కమీషన్ల కోసం ఆనకట్టలు బలహీనంగా కట్టడం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చే పార్టీలు డిజైన్లు, ప్రాధాన్యతలు మార్చేసి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడం లేదు. నదీ జలాలను కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని, ప్రాధాన్యతల మేరకు నిధులు, నీరు అందించగలిగితే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.
-బి.వి.కోటేశ్వరరావు, వౌలాలి

ఒంటరితనంతో బాల్యం..
ఒకప్పుడు చిన్న పిల్లలు పాఠశాల వదిలిన తరువాత, సెలవు రోజుల్లోనూ రకరకాల ఆటపాటలతో గడిపేవారు. గ్రామాలలోనైతే గోలీలాట, కోతికొమ్మచ్చి, దాగుడుమూతలు, అష్టాచెమ్మా, పచ్చీసు, పరమపద సోపాన పటం, కబడ్డీ.. ఇంకా చాలారకాల ఆటపాటలతో బాల్యం సరదాగా గడిచేది. ఇది పిల్లలకు మానసికోల్లాసాన్ని కలిగించడంతోపాటు స్నేహబంధాన్ని పటిష్టపరుస్తుంది. శారీరక వ్యాయామం, మానసికంగా తెలివితేటలను పెంపొందిస్తుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొద్దీ నేటి బాలల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. టీవీలు, మొబైల్ ఫోన్ గేమ్స్, సోషల్ మీడియాకే పూర్తిగా అంకితమై మానవ సంబంధాలను మరచిపోతున్నారు. కథలు, ఆటపాటలు కరవైనాయి. పెద్దలు టీవీ సీరియల్స్ అంటూ మరో లోకంలోనో మునిగిపోతున్నారు. ఇకనైనా పెద్దలు ఆలోచించాలి. వారు తమ బాల్యస్మృతులు నెమరువేసుకోవడం కాదు, పిల్లలకూ ఆ మాధుర్యాన్ని అందించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ధరాఘాతం ఎన్నాళ్లు?
ప్రధాని మోదీ దేశ ఆర్థికాభివృద్ధి బాగా పెరిగిందని చెపుతున్నారు. కానీ, అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు చేరటం లేదు. మోదీ రెండేళ్ల పాలనలో పేద, మధ్యతరగతి వారి తలసరి ఆదాయం అభివృద్ధి రేటులో పెరగలేదు. చమురు ఉత్పత్తి చేసే దేశాలలో ఆయిల్ ధరలు కనిష్ట స్థాయికి పడిపోయినా, కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను పదే పదే పెంచుతోంది. అలాగే, నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా పప్పుల ధరలు రెండు మూడు రెట్లు పెరిగాయి. సర్వీసు టాక్సు ప్రతి ఆరునెలలకు వివిధ కారణాలు చెపుతూ 13 శాతం నుంచి 15 శాతం పెరిగింది. ఈ పెరుగుదలను పేద, మధ్యతరగతి వినియోగదారులు భరించాలి. వరి, గోధుమల విషయంలో మద్దతు ధరను పెంచాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టి, రైతులకు లాభసాటి ధరలు, మధ్యతరగతి, పేదలు ఉపయోగించే వస్తువుల ధరలు కనిష్టంగా ఉన్నపుడే మోదీ పాలన విజయవంతమని ప్రజలు భావిస్తారు.
-ఈశ్వర్, ప్రొద్దుటూరు