ఉత్తరాయణం

ప్రహసనం కారాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా సినీ థియేటర్లలో ‘జనగణమన’ జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరంగా ఉంది. పౌరులందరికీ దేశభక్తి ఉండాల్సిందే. అయితే, సినిమా హాళ్లలో జాతీయగీతాలాపన చేసినంత మాత్రాన దేశభక్తి సాధ్యమా? ఇది ఒక ప్రహసనంగా మారే ప్రమాదం ఉంది. గతంలో సినిమా ముగిసే ముందు జాతీయగీతాలాపన ఉంటే అంతా బయటకు వెళ్లిపోయేవారు. ఇపుడు సినిమా ప్రదర్శనకు ముందు వేసి, ఎవరూ బయటకు పోకుండా తలుపులు వేయాలనడం విడ్డూరంగా ఉంది. రెండున్నర గంటలసేపు సినిమా చూసే వాళ్లకు 52 సెకన్లపాటు జాతీయ గీతాలాపనకు ఉండలేరనుకోలేం. అయితే, ఇలాంటి మొక్కుబడి చర్యలతో దేశభక్తి సాధ్యమవుతుందా? బలవంతంగా దేశభక్తిని ప్రదర్శించాలని ఆదేశించడం విమర్శల పాలవుతుందేమో? దేశం పట్ల ఆరాధనా భావం అడుగంటిందని భావిస్తే ముందుగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, కార్యాలయాల్లో జాతీయగీతాలాపన అలవాటు చేయాలి.
- డా. జివిజి శంకరరావు, పార్వతీపురం

బస్సుల సంఖ్య పెంచండి
కర్నూలు నుంచి రాయచూర్‌కు పగటి పూట మాత్రమే ఓ మోస్తరుగా బస్సులు తిరుగుతున్నాయి. రాత్రి పూట బస్సులే లేనందున ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. కర్నాటకలోని రాయచూర్ మీదుగా సింధనూరు, గంగావతి, గుల్బర్గా వంటి ప్రాంతాలకు కర్నూలు జిల్లా వాసులు చాలామంది వెళుతుంటారు. రాత్రి పూట ప్రయాణం చేయాలనుకునే వారి కోసం బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చొరవ చూపాలి. గతంలో కర్నూలు రెండో ఆర్టీసీ డిపో నుంచి రాయచూర్ మీదుగా సోలాపూర్‌కు బస్సు నడిపేవారు. ఆ సర్వీసును రద్దు చేశారు. దాన్ని పునరుద్ధరిస్తే ప్రయాణీకులకు మేలు జరుగుతుంది. రాయచూర్‌కు బస్సులు పెంచితే ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్

రభస ఎందుకు..?
పెద్దనోట్లను రద్దు చేశాక తగినంత నగదు లభించక పేద, మధ్యతరగతి వారు ఇబ్బందులు పడుతున్నా దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలంతా మోదీ నిర్ణయానికి మద్దతు పలకాలి. కొన్ని తాత్కాలిక సమస్యలున్నా ప్రజలంతా సంతోషిస్తున్నారు. అయితే, నోట్లరద్దుపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల వారు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. నల్లకుబేరుల జాతకాలు బయటపడితే విపక్షాలకు అభ్యంతరం ఎందుకు? అవినీతి, అక్రమాలు, నల్లధనం, ఉగ్రవాదం నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వాన్ని అభినందించడానికి బదులు ప్రతిపక్ష పార్టీల నేతలు అక్రమార్కులకు కొమ్ముకాసేలా వ్యవహరించడం తగదు. ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలకు రాజకీయాలకు అతీతంగా సంఘీభావం ప్రకటించాలి.
- గర్నెపూడి వెంకట రత్నాకరరావు, హనుమకొండ
పేదలకూ ఆయుర్వేదం
నేడు ఆయుర్వేద వైద్యం కూడా ఖరీదైన వ్యవహారంలా మారింది. నిరుపేదలకు ఈ వైద్య విధానం అందుబాటులో లేదు. ప్రభుత్వం తక్కువ ధరలకు ఆయుర్వేద మందులను విక్రయించే ఏర్పాట్లు చెయ్యాలి. కొన్ని వ్యాధులను పూర్తిగా నయం చేసే శక్తి ఆయుర్వేదానికి ఉందని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ మందులు కొనలేనివారికి ఆయుర్వేదం అందుబాటులో ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద ఆస్పత్రులను ఏర్పాటు చేసి ఈ వైద్య విధానాన్ని పేదలకు అందించాలి.
- కె.వి.కుమార్, విశాఖపట్నం