సబ్ ఫీచుర్
భారత స్వాతంత్య్ర సమరానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ గీతం ‘‘వందేమాతరం’. అది ఒక బీజ మంత్రం. ఆ స్ఫూర్తి గీతాన్ని మరీమరీ పాడుతూ లాఠీ దెబ్బలు తిని స్పృహ తప్పి పడిపోయిన దేశభక్తుడు వందేమాతరం రామచంద్రరావు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘‘20వ శతాబ్ది తెలుగు - వెలుగు - 2వ సంపుటిలో కృష్ణదేవరాయ గ్రంథమాల కార్యదర్శిగా పనిచేసిన ఎం.ఎల్.నరసింహారావు రాసిన వ్యాసంలోను విషయాలు యథాతథంగా ఇస్తున్నాను. ‘‘రామచంద్రరావు 1917 సంవత్సరంలో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో వావిలాల వారింట జన్మించారు. తండ్రి రామారావు - తల్లి రామలక్ష్మమ్మ. రామచంద్రరావు గద్వాలలో మాధ్యమిక పాఠశాల, ప్రాథమిక విద్య ముగించి కొంతకాలం కర్నూలులో చదివారు. ఉన్నత విద్యాభ్యాసానికి హైదరాబాదు చేరి సీతారాంబాగ్‌లో నివసించారు. అప్పట్లో ఆర్య సమాజనేత, రాంచందర్ దెహెల్వా ఉపన్యాసాలతో ప్రభావితులైన యువకులలో రామచంద్రరావు ఒకరు. రామచంద్రరావు, అతని సోదరుడు నరేంద్రరావు (వీరభద్రరావు) ఆర్య సమాజ సభ్యులుగా చేరారు. తర్వాత సీతారాంబాగ్‌లో ఆర్య సమాజ శాఖ ప్రారంభించారు. 1939లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హిందూ మహాసభ, ఆర్యసమాజ్ - మూడూ కలిసి నైజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ పౌరహక్కుల సాధనకోసం సత్యాగ్రహం ప్రారంభించారు. రామచంద్రరావు జైలుకెళ్ళారు. జైలులో జరిగిన ఒక సంఘటన అతని జీవితంలో మలుపు తెచ్చింది. జైలులో వున్న ఉప్పల సత్యాగ్రహులందరూ ప్రతిరోజు వందేమాతరం గీతాన్ని పాడుతుండేవారు. జైలు సూపరింటెండెంట్ వందేమాతరం గీతం జైల్లో పాడటాన్ని నిషేధించాడు.
జైలులో వున్న సత్యాగ్రహులు జైలు సూపరింటెండెంట్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ యథావిధిగా పాడేవారు. జైలు సూపరింటెండెంట్ రామచంద్రరావును పిలిపించి స్వయంగా రెండు చెంపలు వాయించి, 24 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. ప్రతి దెబ్బకు రామచంద్రరావు ‘‘వందేమాతరం’’ అంటూ నినాదం చేసేవారు. 24 లాఠీ దెబ్బలు తిన్న రామచంద్రరావు తుదకు స్పృహ తప్పిపడిపోయారు. అప్పటినుంచి ‘‘ప్రజలు’’ ‘వందేమాతరం రామచంద్రరావు’ అన్న బిరుదుతో గౌరవించారు. తర్వాత అతడు జీవితాంతం వందేమాతరం రామచంద్రరావుగా ప్రఖ్యాతిగాంచారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1947లో నిజాం స్టేట్‌లో ప్రారంభమైన ప్రజా ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. కొంతకాలం అజ్ఞాతంగా వుండి పోరాటం సాగించారు. నిజాం సైనిక రహస్యాలను సేకరించి, అప్పట్లో హైదరాబాద్‌లో వున్న భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కె.యం.మున్షీకి తెలియజేస్తూండేవారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత, ఆయన సహకారోద్యమంలో పనిచేశారు. నల్లగొండ జిల్లా మల్కాపూర్‌లో వ్యవసాయదారుల సహకార సంఘం స్థాపించి వారి అభివృద్ధికి కృషి చేశారు. మజ్దూర్ యూనియన్ స్థాపించి కార్మికుల హక్కుల కోసం పోరాడారు. 1957, 1962, 1967లలో జరిగిన సాధారణ ఎన్నికలలో రాష్ట్ర శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఇద్దరు మంత్రులు, వి.బి.రాజు, మర్రి చెన్నారెడ్డి ఎన్నికలలో అవినీతికి పాల్పడినట్లు కోర్టులో నిరూపించి వారి శాసనసభ, సభ్యత్వాన్ని రద్దు చేయించారు. 1967లో అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.వి.రంగారెడ్డిని ఓడించి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రత్యేక తెలంగాణ వాదనను బలపరచారు. రామఛంద్రరావు అనర్గళ వక్త. హిందీ, తెలుగు, ఉర్దు భాషలో గొప్ప పండితులు. ఆయన రచనలలో ముఖ్యమైనవి ‘‘హైదరాబాద్ పై పోలీస్ చర్య’’ ‘‘చైనా దురాక్రమణ’’, స్వామి దయానంద జీవితంలోని కొన్ని ఘట్టాలు, స్వాతంత్య్ర వీర సావర్కర్ మొదలైనవేకాక, హిందీ, తెలుగు పత్రికలలో వివిధ సాంఘిక, సాంస్కృతిక విషయాలపై వ్యాసాలు రాశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులుగా తెలుగును ప్రభుత్వ శాఖలలో అమలుపరచటానికి విశేష కృషి చేశారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత, అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులయ్యారు. ఆయన 2001 నవంబర్ 1వ తేదీన దివంగతులైనారు.
-జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ
Add new comment