ఉత్తరాయణం

విద్యా ప్రమాణాలు పెరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం ప్రాథమిక ఉన్నత పాఠశాలలు మూడు పూవులు ఆరు కాయలుగా గతంలో వికసించాయి. కాని నేడు పేరుకు మాత్రం గ్రామాల్లో రెండుమూడు ప్రాథమిక పాఠశాలలు వెలిశాయి. కాని ఫలితం శూన్యం! ప్రభుత్వానికి విపరీత నష్టం. అలాగే ఉన్నత పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు కోకొల్లలు! కాలక్షేపానికి మాత్రం కనిపిస్తున్న వీటిని ఎవరు పట్టించుకొన్నట్లు? ఇక ఆంగ్లంలో టెక్నోస్కూల్ స్మార్ట్ స్కూల్, గ్లోబల్ స్కూల్, కానె్సప్ట్ స్కూల్ ఇంటర్ నేషనల్ స్కూల్ విచ్చలవిడిగా తాండవం చేస్తూ ధనార్జనకు ప్రాముఖ్యతనిచ్చేదని ప్రస్ఫుటంగా వున్నది. నేటి చదువులు వానాకాలం చదువులే కదా? మార్పురాగలదా?
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
సంప్రదాయాలు కనుమరుగు
పాశ్చాత్య నాగరికతా ప్రభావం వేగంగా చొచ్చుకు వచ్చి మన జీవితాలపై పెనుప్రభావం చూపుతోంది. సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చెదలు పట్టిపోయాయి. నైతిక విలువలు, ఆచార వ్యవహారాల గురించి పుస్తకాలలో, ప్రసంగాలలో విని తెలుసుకొనే దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి. పండుగ రోజులలో కుటుంబ సభ్యులందరూ కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకునే రోజులు పోయాయి. పండుగ అంటే మగవారు సుష్టుగా తిని, త్రాగి నిద్రపోవడం, ఫేస్‌బుక్‌లు, ఇంటర్నెట్‌లు, ఆడవాళ్లు టివిలో సినిమాలు, సీరియల్స్ వంట కార్యక్రమాలు చూడడం, పిల్లలకు పుస్తకాలు, వీడియోగేమ్స్, ఇంటర్నెట్, చదువులు షరామామూలు అయిపోయాయి. నిన్నటితరం నుంచి సనాతన సంప్రదాయాలు, పండుగ వైశిష్ట్య, ఆచార వ్యవహారాలను రేపటి తరానికి సురక్షితంగా అందించాలన్న తపన, బాధ్యతా ఎవ్వరిలోనూ కనిపించడం లేదు. ఇంట్లో పిండివంటలు చేసుకునే బదులు హోంఫుడ్స్ షాపులనుండి తెచ్చుకొని తినేస్తున్నారు. ఉద్యోగస్తులకు పండుగ ఇంకొక సెలవురోజుగా భావించే పరిస్థితులు వచ్చాయి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
బుద్ధిజీవులేనా?
హిందీలో మేధావిని ‘బుద్ధిజీవి’ అంటారు. అసలు మేధావి అని ఎవరిని అనాలన్నది పెద్ద ప్రశ్న! ‘పెద్దపెద్ద’ విద్యార్హతలు ఉండి, పరిశోధన గ్రంథాలు (ముఖ్యంగా రాజకీయ రంగానికి సంబంధించినవి) వాసి, ఉన్నత పదవులను నిర్వహించిన వారే మేధావులా? వీరికి వివిధ మాధ్యమాలలో (ముఖ్యంగా టివిలో) ప్రచారం లభిస్తూ, రాజకీయ రంగం వారి అండదండలు ఉంటే ఇక వారంతా మేధావులు ఉండరనిపించేస్తూంటారు. వివాదస్పదకరమైన ప్రకటనలు చేసి గగ్గోలు సృష్టిస్తూ (జమ్మూకాశ్మీర్‌ని పాకిస్థాన్‌కి ఇచ్చేస్తే శాంతి నెలకొంటుందని అనటం వంటివి) కోట్లు ఖర్చుచేసినా లభించనంత ప్రచారాన్ని ఉచితంగా పొందుతూంటారు. వారికి భారతీయతని, హిందూ మతాన్ని అడ్డగోలుగా, వక్రీకరిస్తూ విమర్శించటం అంటే మహా ఇష్టం! వారు అభ్యుదయవాదులు మానవతావాదులు! (ఇతరులు కారు!) బూటకపు మేధావులు ఖచ్చితంగా ‘బుద్ధిలేని’ జీవులే తప్ప బుద్ధి (ఉన్న) జీవులు మాత్రం కారు.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
నకిలీ ఇ.వి.ఎఫ్ కేంద్రాలు
ఉత్తరాంధ్ర ప్రాంతంలో నెలకొన్న పేదరికం ఆధారం చేసుకొని కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న బేబీ ఫ్యాక్టరీ గుట్టును రట్టుచేసిన పోలీసుశాఖ అభినందనీయులు. విశాఖ చుట్టుపక్కల సుమారుగా పదిహేను ఇ.వి.ఎఫ్ కేంద్రాలు వున్నాయి. పిల్లలు పుట్టని వారిలో సంపన్న వర్గాలను టార్గెట్ చేసుకొని వారికి పిల్లలను విక్రయించేందుకు దళారులతో ఒప్పందాలు చేసుకుంటూ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలనుండి పేద మహిళలను తీసుకువచ్చి సరొగేషన్, ఇ.వి.ఎఫ్. విధానాల ద్వారా పిల్లలను పుట్టించి, వారిని అమ్మివేస్తూ లక్షలు గడిస్తున్నారు. అంతేకాక పిల్లలను పుట్టించేందుకు దంపతుల నుండి లక్షలాది రూపాయలను గుంజుతున్నారు. ఇ.వి.ఎఫ్. ట్రీట్‌మెంట్ ద్వారా పిల్లలు కలిగే అవకాశం కేవలం పది శాతమే అయినా పిల్లలపై ఆశకొద్ది అమాయక దంపతులు వీటిపై ఆధారపడుతున్నారు. ఇ.వి.ఎఫ్. కేంద్రాలలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరపాలని సాక్షాత్తూ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించినా గత ప్రభుత్వం స్పందించలేదు. ఇటువంటి నకిలీ ఇ.వి.ఎఫ్. కేంద్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో డజన్లకొద్దీ వున్నాయని, కోట్లలో పిల్లల వ్యాపారాలు చేస్తున్నాయన్న మీడియా కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
కోచింగ్ సెంటర్ల మాయాజాలం
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నోటిఫికేషన్స్ వెలువడగానే పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. కో చింగ్ పేరిట దండుకుంటున్నాయి. కొన్ని కోచింగ్ సెం టర్లు మధ్యలోనే నిలిచిపోతున్నాయ. అభ్యుదయ వాదుల పేరిట కోచింగ్ సెంటర్లు తెరవవటం, వేరే జిల్లాలలో ఎక్కువగా డబ్బులు ఇవ్వటంతో అక్కడికి తరలిపోవటం. మొదట నెలకొల్పిన వాటిని నిర్లక్ష్యం చేయటం విద్యార్థులను అర్ధాంతరంగా అగమ్యగోచరంలోకి నెట్టడం జరుగుతున్నది. కోచింగ్‌కు వచ్చే నిరుద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పూర్తిస్థాయి కోచింగ్ కూడా ఇవ్వటం లేదు. ఇటువంటి కోచింగ్ సెంటర్లపై దృష్టిసారించి ప్రభుత్వం ఆదుకోవాలి. కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. నిర్వహకులపై నియంతృణ పెంచాలి. కొన్ని కోచింగ్ సెంటర్లపై వీటి ప్రభావం పడుతుంది. స్థాపించి, మధ్యలో వదిలేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..
- ఎ.ఆర్.రామారావుగౌడ్, ఖమ్మం