మీ వ్యూస్

శ్రీరామాయణ గీతమంజరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామచరితమును - విని తరించుడు
రామనామమును - మది ధ్యానింపుడు
పురాణ పురుషుని - పురుషోత్తమునీ
కరుణాధాముని - కారణ జన్ముని రామ

మను సంభవమగు అయోధ్య పురమును
జనపతి దశరధ ప్రభు పాలించెను
కుల వర్థనులగు కొమరులు లేరని
తలపోయుచు తన మంత్రుల బిలచెను రామ

హితులు, పురోహితు - నానతిమేరకు
కులగురువగు వశిష్ఠుడు దెల్పగ
సతులు మువ్వురతో - దీక్షను బూనెను
సరయువుదరినీ యాగము చేసెను రామ

యాగము సలుపగ ఋష్యశృంగుని
చెలగుచు బిలిచెను సేవలు సలిపెను
తనయుల బడయగ పుత్రకామేష్ఠిని
మునిజనములు - వినుతింపగ జేసెను రామ

హోమకుండమున హేమ పాత్రమును
ప్రేమ కురియగా స్వాహా దేవుడు
పాయసపాత్రను ప్రభుకందించీ
ప్రియరాణులకిడి - పుత్రులగనుమనె రామ

2. శ్రీరామజననం
లోకపావనము రాముని జననం
శ్రీకరమైనది త్రేతాయుగము లోక

నవ వసంతమున పునర్వసు నవమిని
గురు సుధాకరులు కొమరుగ కూడగ
రాశి కర్కాటక లగ్నకాంతిలో
వాసిగ ‘కౌసల్య’- శ్రీరాముని గనె లోక

మీన లగ్నమున పుణ్య దశమిని
కనె ‘్భరతుని’- ‘కైకేయి’ వేడుకను
‘సుమిత్రా’సతి- సుందర రూపుల
అమిత ప్రతాపుల హరియంశములను లోక

హరియవతారము రామచంద్రుడు
వర లక్ష్మణుడే ఆదిశేషుడు
శంఖు, చక్రములు భరత, శత్రుఘు్నలు
ధీర యశులు ఆ దశరధ తనయులు లోక
3. లాలిపాట
లాలి దశరథ తనయ లాలి శ్రీరామా
లాలి పావన నామ లాలి రఘురామా జోజో జోజో

సాధుజన పోషణ సౌందర్య రామా
సకల జన రక్షకా - సరస గుణధామా లాలి

భాను కులశేఖరా బంగారు రామా
ఘన కౌస్త్భుభరణ గంభీర రామా లాలి

శ్రీహరీ అవతార - శ్రీరామచంద్రా
అహరహము కీర్తింతు ప్రకట గుణసాంద్రా లాలి
లలనలందరు జేరి లాలిపాడేరు
జోల విని నిదురించు పావననామా!
జోజో జోజో లాలి

4. గాథిసుతుని రాక
(విశ్వామిత్రుడు)
హరిలీలలు అనంతములనుచు
హరిరూపును మదిలోన దలచుచు
ముని కులతిలకుడు గాథి నందనుడు
సరగున జేరె నయోధ్యాపురికి హరి

మునిజన సేవలె ఘనమన తలచీ
పంక్తిరథుడు సుస్వాగ మొసగెను
ఘన గాధేయుని పూజలు సలిపీ
ముని రాకకు తగు కారణ మరసెను హరి

దండకాటవిని యాగ రక్షణకు కై
దండనొసగగా - తనయుల బంపుము
వనమున వెలిగే దనుజుల గూల్చును
తన యాగము కొనసాగును శుభముగ హరి

ఉగ్రరూపులూ కామరూపులూ
మహోగ్ర దానవుల వికృతలీలలు
ప్రియపుత్రుడు రామచంద్రుడెటు
నిగ్రహమున - సమయింపజాలుననె హరి
సంయమితోడుత - సుతుల బంపుట
సముచితమని కుల గురువునుడివెను
రామ లక్ష్మణుల ప్రేమ మీరగా
యాగ రక్షణకు పని చెను విభుడు హరి
5. యాగ సంరక్షణ
ముదమున జనపతి పనుపున జనిరి
సదమల మతులు రామ లక్ష్మణులు
పథగామి కౌశికుడు - పథమును జూపగ
ముని వెంటను ముదమున పొంగుచు ముద

భువి రాక్షస భయములు బాయునుపాయము
రవి కులపతి రయమున నేర్చెను
ఆకలిద్పులు పొలయకుండగను
మల అతిబల విద్యల బొందెను ముద

మునిపుంగవునితో గంగను దాటెను
ఒనరుగ వనిలో ద్వనులను వినెను
తరుణి తాటకీ చరితము దెలిసీ
రఘుపతి అఘమని ఎదలో దలచెను ముద

జనహంత్రుల దునుమాడు నిశాచుల
హననము జేసిన దోషము రాదనె
ఉరుశరముల కడు ఉగ్రరూపినీ
తరుణి తాటకిని తపసి జంపుమనె ముద

సిద్ధాశ్రమమున వివిధాస్త్ర శస్తమ్రుల
రక్కసి గూల్చెను సురలు నుతింపగ
మునిపతి కడు ముదమును పొందే
తన యాగము అవలీలగ ముగియగ ముద

6. శివధనుర్భంగము
గాధి సుతుడు పరమాత్మ రూపులతో
మిథిలానగరికి పయనమాయెను
కారణజన్ముని కౌసల్య సుతునికి
ధరణిజతో తగు పెండిలి సేయగ గాధి

రామలక్ష్మణుల రూపముగాంచీ
జనకవిభుడు ప్రమదంబున ఒలికే
ఏ వెరవున జనుదెంచితిరిటకని
విశ్వామిత్రుని వేడుక నడిగెను గాధి

ఘన మిథిలాపురి జననాధవినుమయా
వినుత బలిమి - హరివిల్లు వరువగా
చనుదెంచిరయా - దాశరధేయులు
అనువుగ ధనువును భంగము సేతురు గాధి
జనకుడు ముని పలుకులు విని మది
వినయము తోడుత సేవలు సలిపీ
ఆనతి నిడెనూ విల్లు విరువగా
గురు సైగలతో రామచంద్రుడూ
శివధనువుకు వందనమిడెనూ

విశ్వామిత్రునికంజలి జేసీ
పరమానందము నొందుచు రాముడు
హరుధనువుని అవలీలగ విరిచెను
సురలందరు విరివృష్టి గురియగా గాధి

7. సీతారామ కల్యాణం
సీతారాముల శుభ కల్యాణము
సకల జగతికే శోభావహము
ఎంతో సుదినము జనకుని సదనము
వింతగ వెలిగెను రాముని వదనము సీతా

నాసుత సీతను రామచంద్రునికి
ప్రేమతోడుత పెండ్లిచేతునని
అయోధ్యకు ఆహ్వానము బంపెను
మిథిలకు రండని మిథిలాధీశుడు సీతా

దశరథ రాజూ పిలుపునందుకొని
సుతులొనరించిన కార్యముదలచుచు
పురిజనములు సరిరాణులగైకొని
గురువు వశిష్ఠునిగొని చనెనా మిథిలకు సీతా

ఆ విధాత కైలాస గిరీశుడు
దివి దేవతలూ దీవెనలొసగగ
భువి జనకుడు తన సుత సీతను
రవికులపతి శ్రీరామున కొసగెను సీతా

చల్లని చూపుల మోహన రాముని
ఉల్లము రంజిల మోమును గాంచెను
ధరణిజ మది విరితూపులు విసరుచు
శ్రీరాముడు వర జానకి గైకొనె సీతా

శిరమున ముత్యాల సేసలు విరియగ
అరవిరిసిన విరిమాలలు అమరగ
త్రేతాయుగమే ధన్యత జెందగ
‘సీతారాముల’ పరిణయమాయెను సీతా

-పి.వి.సీతారామమూర్తి 9490386015