వీరాజీయం

చైనాతో యుద్ధమా? వాగ్యుద్ధమా? ఏది మేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న పదహారో తేదీ నాటికి భారత్- చైనాల మధ్య డోక్లాం ప్రతిష్ఠంభన మూడో నెలలో ప్రవేశించింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు పదిహేను నాడు భారత ప్రధాన మంత్రి ఎర్రకోట బురుజుపైనుంచి పర్జన్య గంభీర స్వరంతో ‘మన సరిహద్దుల పరిరక్షణ శక్తి మనకున్నది. ఎటువంటి దాడినైనా తిప్పికొట్టగలం’ అని పేరెత్తకుండా చైనాని హెచ్చరిస్తున్నప్పుడు-బీజింగ్ పదాతిదళాలు జమ్ము కశ్మీర్‌లోని లడఖ్ రంగంలో రెండుచోట్ల పోంగ్లోంగ్ సరస్సు ప్రాంతంలో -(గడ్డ కట్టుకుపోయి కొన్నాళ్లు హిమనీ ప్రవాహంగా కొన్ని రోజులు ఉంటుంది అది)-ఇందులో కొంత ముక్క మనది మిగతాది చైనాది అక్కడ వాస్తవిక నియంత్రణ రేఖను దాటి పోంగ్లోంగ్ సరస్సు ప్రదేశంలో మన జగాలోకి చొరబడ్డారు కొందరు. వాళ్ల చేతుల్లో ఇనుపరాడ్లు, రాళ్లు ఉన్నాయి. మామూలుగా అయితే స్వీట్లు ఒకరి ఒకరు ఇచ్చే రోజు ఇది. మన సైనికులు ‘మీరు గీత దాటారహో’ అంటూ బ్యానర్లు ఎత్తి చూపించినా వాళ్లు లక్ష్యపెట్టలేదు. వాగ్యుద్ధం ముందు ఆనక బాహా బాహీ-వాళ్లు వెనక్కిపోతూ రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. దెబ్బలాటలో ఇరువైపుల వాళ్లకి గాయాలైనాయి. 1987 తరువాత మన సోదరులు ఇలా చొరబడడం ఇదే. ఈ ప్రాంతంలోనే 1962లో భీకర యుద్ధం జరిగింది. ఇప్పుడు కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న డోక్లాంలో రోడ్డు వేస్తున్నట్టే ఇక్కడ లడఖ్‌లో ఒక వంతెన కడుతున్నారన్న అనుమానం రాగా ఇండియా నియంత్రణ రేఖ వెంబడి పారా హుషార్‌గా వుండమని ఆదేశాలు పంపించారు.
చైనాకి మనుషుల మధ్య మమతల వంతెన కట్టడం రాదుగానీ, ఇలా కీలక ప్రాంతాల్లో యుద్ధ సౌకర్యం కోసం రోడ్లు వంతెనలు నిర్మించాలంటే గొప్ప హుషారు. వాస్తవాధీన రేఖ వెంబడి మంచుగడ్డల మధ్య నిఘా కేంద్రాలని ఫింగరులు (వేళ్లు) అంటారు. ఇవి కొద్ది ఎడం ఎడంగా ఉంటాయి. నాలుగు అయిదు ఫింగర్స్‌లో పిఎల్‌ఏ సైనికులు చొరబాటు చొరవ ప్రదర్శించారు. ఖబడ్దార్ అన్నారు మనవాళ్లు. కానీ ఇటువంటి చొచ్చు‘బాట్లు’ మనకి చైనా సరిహద్దు రేఖ సాగుతున్న ఐదు రాష్ట్రాలలోను ఇక తప్పదు అంటున్నారు వేగులవాళ్లు.
డోక్లాం ఉన్నది భూటాన్లో. ఈ భూటాన్ ఏడున్నరలక్షల జనాభా వున్న అతి బుల్లి దేశం. మాల్దీవులంత వుంటుంది. కానీ ఇండియాకి చైనాకి మధ్యవర్తి రాజ్యం (బఫర్ స్టేట్) అంటారు. మన నేల, భూటాన్ నేల చైనా భూమి మూడు కూడలిగా కలిసే చోట వున్న దోంగ్లోంగ్ లేదా డొక్లామ్, డోకా కనుమ దగ్గర వుంది కనుక అందులోంచి ఓ రోడ్డు లాగిస్తే దండయాత్రలకి భేషుగ్గా వుంటుందని జూన్ 16న ముహుర్తం పెట్టుకుని చైనా సోదరులు దిగి సీరియస్సుగా రాదారి తయారుచేసుకుంటు వుంటే-మన రక్షణలో తాను వున్నట్టు (ఏదో సామెత చెబుతారు అలాగ) భూటాన్ ఆర్తనాదం కొట్టింది. మనవాళ్లు వెళ్లారు-రోడ్డుపని ఆగింది- ఎదురుబొదురుగా ఇండో టిబెట్ భద్రతా దళాలు కూడా ఉండగా ఇండియా చైనాలు-నువ్వు ముందు వెనక్కిపో అంటే నువ్వు ముందు వచ్చావ్ కనుక గో బ్యాక్ అనుకుంటూ- ఢిల్లీలోను బీజింగ్‌లోను టెన్షన్ తీసుకొచ్చారు. అసలు ఈ డోక్లాం మాది అంటారు చైనీయులు. కాదు మహాప్రభో మాది అంటారు భూటానీయులు. 1961 నుంచి ఈ తగాదా తేలలేదు. మనది కాకపోయినా-గోయోపాఖ్యానములో లాగ మనం ఇరుక్కున్నాం. మీరు అక్కడ రోడ్లు వంతెనలు గట్రా కట్టేసుకుంటే మా ఈశాన్యరాష్ట్రాల భద్రత దెబ్బ తింటుంది అన్నది మన గవర్నమెంటు.
ఇది ఇలా వుండగా దేశంలో జనాలకి వీరావేశం ప్రతీకారేచ్ఛ వగైరాలు ఎక్కువైపోయి చైనాకి బుద్ధి చెప్పాల్సిందేనంటూ పొయెట్రీ ప్రోజూ రెండూ ప్రయోగిస్తూ వీరంగం వేసేస్తున్నారు. ఇదేదో రాళ్లు రువ్వుకోవడం కాదు. ఈ రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలు. యుద్ధ నిపుణత గల విస్తార సైనిక బలగాలున్న దేశాలు. ఆసియాలో వీటిమధ్య చిచ్చు రాకుండా ఉండాలన్నదే ఎందరికో వున్న కోరిక. మన విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ రాజ్యసభలో చెప్పినట్టు చర్చల బల్ల కటూ ఇటూ వాగ్యుద్ధం ముందు సాగాలి. నిజమే, కుంటుకుంటూ లేస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ మనది. యుద్ధంవస్తే నడ్డి విరిగిపోతుంది. ఉండనే ఉన్నది కశ్మీర్ కాష్టం. అది యుద్ధం కాని యుద్ధం. మన సరిహద్దులోపలే రెండుప్రాంతాల మధ్య అడ్డుగీత గీసుకుని డెబ్బై ఏండ్లుగా జనాలకి నెత్తురు కూడు తినిపిస్తున్న స్థితి.
అట్టితరి, మళ్లీ వాళ్లదో వీళ్లదో తెలియని చోటుకోసం... ఎందుకు జనాల సొమ్ము సైనికుల ప్రాణాలు పణం పెట్టాలి? మన శౌర్య ప్రతాపాలకి సవాలుగా టెర్రరిస్టు బెడద ఉండనే ఉంది. నిజానికి దానిని మన బలగాలు అన్నిరకాల ఇతర శాఖలు కూడా నిభాయిస్తూ ఉన్నాయి. ఒక యువకుడు అన్నాడు-‘మన రక్షణ మంత్రి జైట్లీగారు చె ప్పాడు కదండీ...ఇది 1962 కాదు అనీ’-మనం డోక్లాం నుంచి చైనాని తిప్పి తిప్పి కొట్టాలి. దానికి ముందు చైనా వస్తువులు బాయ్కాట్ చెయ్యాలి అంటూ తన అరచేతిలో వున్న స్మార్ట్ఫోన్‌ని -పెంపుడు పిల్లికూనని నిమురుతున్నట్టు తన్మయంగా ప్రేమిస్తూ...
‘‘అబ్బీ అదే మీ మొబైల్-నీ లేనోవా, అహా! నీ అప్పో వయమ్మో నీ గ్జియామీ ఇవన్నీ చైనావే వాటిని ముందు ఒగ్గేయండి. దసరాకి దీపావళికి రేపు చవితికి మీకు దేవుడి బొమ్మలు దియాలు (జ్యోతులు) చీనావే వీటిని కొనకుండా దొంగరవాణాని అరికట్టండి. స్టార్ హోటల్‌నుంచి రోడ్డు మొనగన వున్న టిఫిన్ సెంటర్ దాకా చైనా ఫుడ్ మాకు ప్రాణం. చీనా ఫుడ్డే ప్రాణం అంటూ ఎగబడుతున్నారే ఆ జిహ్వ చాపల్యం వదలండి. అన్నీ చీనామేకులే -మననెత్తిన కొట్టుకుంటున్నాము. టేక్కేర్.. 19 సంస్థలు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ రంగంలో మన దేశంలో ఓహోమని బిజినెస్సు చేస్తున్నాయి. ఇకమీదట ఇండియన్ ఎగ్జిక్యుటివ్‌లని వేస్తేనే మీకు అనుమతి అంటున్నది ఇండియన్ గవర్నమెంటు. అది అలా వుంచండి. పోయిన నెల కాగ్ అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారు పార్లమెంటుకి సమర్పించిన నివేదిక మన బలం కన్నా చైనా వారి బలం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని, వారు ఇరవై రోజులు పోరాడగలిగితే మన సప్లయి పదిరోజులకే అయిపోతుందని నాలుగు రెట్లు బలం వాళ్లది అని వివరంగా పేర్కొన్నది. వాళ్ల రక్షణ బడ్జెట్ మన రక్షణ బడ్జెట్ కన్నా నాలుగు రెట్లు కన్నా ఎక్కువగా వున్నదని కాగ్ నివేదిక వివరించింది. అందుకనే ఎట్నుంచి చూసినా గుండెలమీద కాశ్మీర్ కుంపటి పెట్టుకుని చైనాతో యుద్ధం చెయ్యడానికి తప్పనిసరి అయితే తప్ప దిగరాదనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. పైగా మన బోర్డరు కాదది.
అమెరికా, జపాన్‌లు మాత్రమే ఇప్పటికి ఈ ప్రతిష్ఠంభన మీద స్పందించాయి. జపాన్ కూడా ఇదివరకటి స్థితిని పునరుద్ధరించి చర్చలకు దిగడమే ఉభయతారకమని వ్యాఖ్యానించింది. మన బలగాలు మొదట వెనక్కి వెళ్లిపోతే తిరిగి చైనా రోడ్డు నిర్మాణాన్ని కొనసాగిస్తే? అందుకనే ఇండియన్స్ ఉభయపక్షాలు ఒకేసారి వెనక్కి వెళ్లిపోతే చర్చలు పెట్టుకోవచ్చని అంటున్నారు. ఈ ప్రతిష్టంభనకి ముందు ఏ రోడ్డు లేని నిర్మాణం లేని స్థితి ఎలాగ వుందో అలాగే భూటాన్‌లోని త్రికోణ కూడలిని ఖాళీగా వదిలేస్తేనే ఉభయ తారకం అన్నది శాంతి కాముక ప్రపంచం కోరుతున్నది.
భూటాన్, చీనాలు ఇండియా ప్రమేయం లేకుండా డోక్లాం సమస్యని సర్దుకోగలిగితే కథ ఇంత దూరం రాకనేపోను. చైనా ఈ పీఠభూమి తనదే అంటున్నది. కాదు అనడానికి ఇండియా దగ్గర సాక్ష్యాధారాలు ఏమిటి? చిన్నదైన మిత్రదేశాన్ని బఫర్‌గా వున్నది కనుక ఆదుకోవడం సరేకానీ అందుకోసం నాలుగు వేల కిలోమీటర్లు పైచిలుకు నిడివిగల సరిహద్దు పొడవునా యుద్ధం కొని తెచ్చుకోవడం అవసరమా? ఇది కొందరి సందేహం. ఎందుకంటే అశాంతి ఐనా, పోరు ఐనా మొదలైతే కేవలం ఆ ‘సెక్టార్’కే పరిమితం కాదు. మన అయిదు రాష్ట్రాలలో నిత్యపోరుగా కాల్పుల పర్వంగా మారిపోతుంది. కాగా భూటాన్ చైనాకి డోక్లాం తనది కాదని చైనాలోని భాగమేనని లోగడ లిఖితపూర్వకంగా చెప్పినదని చీనా విదేశాంగ శాఖ అధికారిణి చెపుతున్నది. అటువంటప్పుడు ట్రై జంక్షన్‌లో మా రోడ్డు నిర్మాణాన్ని ఇండియా అడ్డుకోవడం మా సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమే అవుతుంది అని ఆమె (చైనా) వాదన. ఐతే ఆధారాలు చూపించమని అడిగాలి మనం. ఇదే చర్చలకు ఒక సాకుగా చేసుకోవచ్చును.
ఇండియన్ సైనికులు వెనక్కువెళ్లాలి. ఇండియాకి కూడా నేపాల్‌తో కాలాపానీ లాంటి ‘ముక్కూడలు’ల సమస్యలు ఉన్నాయి. మేము అక్కడికి ప్రవేశిస్తే ఎలా వుంటుంది? అని అన్నది దౌత్య అధికారిణి-చిక్కు ప్రశ్న వేసింది. సరే, ముందే నేపాల్ని మచ్చిక చేసుకుంది చీనా. అది వేరే ఒప్పందం. అంటే చైనా నేపాల్ రెండూ చైనాతో భాయి భాయి అయినాయి అన్న మాట.
చైనా ఇకముందు సరిహద్దుల వెంబడే అంతటా చొరబాట్ల ఆగడం కాల్పులు సాగిస్తుందేమో? దానికి ఆ కండకావరం అక్కసు వున్నాయి. ముక్కూడలి సమస్య ముదిరి మన దేశ సుఖ శాంతులను ముంచక మునుపే మోదీగారి గవర్నమెంటు భూటాన్ని అన్ని అంతర్జాతీయ ఆర్గనైజేషన్లలోను సభ్యత్వం ఉన్న దేశమే కనుక అటు రంగంలోకి నయం కోసం అంటూ తొయ్యాలి-్భటాన్‌కి ఇండియా ఆర్థిక సహాయం-కొంత ‘లోను’, కొంత విరాళంగా ఇస్తున్నది. ఈపాటికే చైనా డోక్లాం నాదే అన్నప్పుడు భూటాన్ ఖండించాల్సింది మరి. ప్రతిష్ఠకే పోవాలి అంటే చైనా లోగడ ఆక్రమించుకున్న మన జాగా చాలా ఉన్నది. దానిమీద ఆందోళన చేయడం బెటరు అన్నాడు యుద్ధమంటే ఇష్టంలేని స్కూలు టీచరు. సదరు ‘ముక్కూడలి’ రోడ్డులేకపోతే మాత్రం ఈశాన్య రాష్ట్రాలమీద చైనా కాల్పులు చెయ్యలేదా? హిమాలయాల ఒడిలో స్లో‘గన్’ల ధ్వనులే గాని ‘గన్’ చప్పుళ్లు వినబడరాదు.. అన్నదే సామాన్యుడి చవితి విన్నపం ఓ బొజ్జ గణపయ్యకి!
ట్రై టు డ్రాగ్ ది డ్రాగన్ టు ద టాక్-టేబుల్!

veeraji.columnist@gmail.com