విశాఖ

కాఫీ మార్కెటింగ్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, నవంబర్ 19: విశాఖ మన్యంలో గిరిజనులు పండిస్తున్న కాఫీని మార్కెటింగ్ చేసేందుకు ప్రయివేట్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు పాలికి లక్కు మాట్లాడుతూ కాఫీని ఇంతవరకు గిరిజన సహకార సంస్థ మార్కెటింగ్ చేస్తుండగా ఈ సంస్థ నుంచి మార్కెటింగ్‌ను తప్పించి ఐ.సి.ఎస్.డి. అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. దీనివలన జి.సి.సి. నిర్వీర్యం కావడమే కాకుండా కాఫీని పండిస్తున్న గిరిజన రైతుల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. కాఫీ మార్కెటింగ్ కోసం ఐ.సి.ఎస్.డి సంస్థతో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే కాకుండా 15 కోట్ల రూపాయలను కేటాయించడంలో పలు అక్రమాలు దాగి ఉన్నట్టు ఆయన ఆరోపించారు. జి.సి.సి.ని ప్రయివేట్ పరం చేసే కుట్రలో భాగంగానే ఐ.సి.ఎస్.డి. సంస్థను తెరపైకి తీసుకువచ్చినట్టు తెలుస్తోందని ఆయన అన్నారు. జి.సి.సి.ని కాదని ప్రయివేట్ సంస్థతో కాఫీని మార్కెటింగ్ చేస్తే గిరిజనులతో ఉద్యమించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి కాఫీ మార్కెటింగ్‌ను జి.సి.సి.తో కొనసాగించాలని, పాడేరు మండలం వంజంగి నుంచి కొత్తవలస గ్రామం మీదుగావై.సంపలు గ్రామానికి రోడ్డు నిర్మించాలని లక్కు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎం.ఎం.శ్రీను, ఎల్.సుందరరావు, పలు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.

ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు
అరకులోయ, నవంబర్ 19: నిరు పేదలు ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా చూపకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ సూచించారు. స్థానిక వైద్య విధాన పరిషత్ ఏరియా ఆసుపత్రి, సుంకరమెట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవారం తనిఖీ చేసారు. ఏరియా ఆసుపత్రిలోని దంత విభాగం, ఐ.కేంద్రం, అత్యవసర విభాగం, నవజాతి శిశువుల సంరక్షణ కేంద్రాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీసారు. ఏరియా ఆసుపత్రితో పాటు సుంకరమెట్ట ఆరోగ్య కేంద్రం పనితీరును తెలుసుకున్న ఆయన గిరిజన రోగులను పరామర్శించి రొట్టెలు, పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు వ్యాధులకు గురైనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుని ఉచిత మందులతో చికిత్స పొందాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ప్రాధమిక చికిత్సతో పాటు అనేక రకాల పరీక్షలు ఉచితంగానే చేస్తారని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్ధేశ్యంతో పలు చోట్ల ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చి గిరిజన ప్రాంతాలలో వైద్య సౌకర్యాల మెరుగుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. టెలి మెడిసన్ విధానం ద్వారా ఆరోగ్య ఉప కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలు అందేలా చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. దంత వైద్య సేవలపై ప్రాంతీయ ఆసుపత్రుల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. దంత విభాగంలో ఒ.పి. పెంచాలని, వారపు సంతల్లో దంత వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. గత కొంతకాలంగా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యాధికారి పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సికిల్‌సెల్ ఏనీమియాతో బాధపడుతున్న రోగులందరికీ అన్ని ఆసుపుత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నామని, వీరిని ఆదుకునేందుకు ప్రతి నెల ఫించను అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ఎలక్ట్రానిక్ మెక్రోస్కోప్ పరికరాలు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ఏజెన్సీలోని పలు ఆసుపత్రులకు అదనపు అంబులెన్స్‌లను మంజూరు చేసే విషయమై సి.ఎం. దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు శ్రావణ్‌కుమార్ తెలిపారు. అంతకుముందు గిరిజనులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసారు. అనంతరం పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది, ఆఖిల భారత వినియోగదారుల రక్షణ సంస్థ, గిరిజన ప్రాంత వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘం ప్రతినిధులు మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి, విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతిరావు, వైద్య విధాన పరిషత్ కో-ఆర్డినేటర్ డి.కె.నాయక్, జిల్లా క్షయ నివారణ అధికారి రమేష్, పాడేరు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి మణి, పలువురు అధికారులు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రంధాలయంలో మహిళా దినోత్సవం
అరకులోయ, నవంబర్ 19: స్థానిక శాఖా గ్రంధాలయంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. 51వ జాతీయ గ్రందాలయ వారోత్సవాలను పురస్కరించుకుని స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాందీ 121వ జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గత వారం రోజులుగా నిర్వహించిన పలు పోటీల్లోని విజేతలకు ఈ నెల 20వ తేది మంగళవారం బహుమతులు ప్రధానం చేయనున్నట్టు గ్రంధాలయ అధికారి జి.మురళీక్రిష్ణ తెలిపారు.
కాఫీ ఒప్పందాన్ని రద్దు చేయాలని ధర్నా
అరకులోయ, నవంబర్ 19: కాఫీ మార్కెటింగ్‌కు ప్రయివేట్ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం, సి.పి.ఎం. కార్యకర్తలు సోమవారం స్థానిక మండల రెవిన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గిరిజన కాఫీ రైతులకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చని ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం స్థానిక తాహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, సి.పి.ఎం. నాయకులు పొద్దు బాలదేవ్, కె.రామారావు, బుజ్జిబాబు, చినబాబు, భగత్‌రాం, తదితరులు పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం ఎన్నిక
పాడేరు, నవంబర్ 19: గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా చిట్టపులి శ్రీనివాస్‌పడాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖపట్నంలోని గిరిజన భవనంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర శాఖ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కిల్లు గంగన్నపడాల్, అసోసియేషట్ అధ్యక్షుడిగా పలాసి క్రిష్ణారావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.గాంధీబాబు నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జి.శేషగిరిరావు నియమితులయ్యారు. సంఘం ఉపాధ్యక్షులుగా కె.నీలకంఠం, పి.్ధర్మారావు, పి.శ్రీనివాసరావు, సి.హెచ్.సత్యనారాయణ, పి.పోసయ్య, పి.బాలయ్య, ఇ.వెంకటేశ్వరబాబు, పి.పద్మ, కార్యదర్శులుగా కె.సుమిత్ర, జి.రామ్మోహనరావు, ఎస్.బాబురావు, ఎం.గంగరాజు, జి.వి.వి.ప్రసాద్, యు.అర్జున్, ఎన్.సతీష్, జి.టి.స్వామి, ఎం.సుబ్బారావు, మహిళా కార్యదర్శిగా కె.సుధారాణి, సంయుక్త కార్యదర్శులుగా కె.రాందాస్, ఎం.సూరిబాబు, ఎం.వాసుదేవరావు, బి.ఎస్.కుమార్, కె.వెంకటేశ్వర్లు, వై.వెంకటేశ్వరరావు, ఎం.సూర్యారావు,పి.మహేంద్ర, కోశాధికారిగా భావరాజు అప్పారావులతో పాటు పలువురు సంయుక్త కార్యదర్శులు, సలహాదారులు, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో పరిశీలకులుగా ఆర్.జాన్, రొబ్బ నాగభూషణరాజు, రేగం మత్స్యలింగం, కె.సుబ్బారావు, రాష్ట్రంలోని 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర
మంత్రి కిడారి
అరకులోయ, నవంబర్ 19: గిరిజనులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార సంస్థ (జి.సి.సి.) ద్వారా గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ చెప్పారు. మండలంలోని సుంకరమెట్ట గ్రామంలో జి.సి.సి. ఏర్పాటు చేసిన అటవీ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు తాము పండించిన ఫలసాయాలను, సేకరించిన అటవీ ఉత్పత్తులను జి.సి.సి. కొనుగోలు కేంద్రాలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. దళారీలను నమ్మి మోసపోవద్దని, జి.సి.సి. ద్వారా గిట్టుబాటు ధర లభిస్తున్న విషయాన్ని గిరిజనులు గుర్తించాలని ఆయన అన్నారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి జి.సి.సి. కృషి చేస్తుందని ఆయన చెప్పారు. అరకులోయ మండలంలో 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జి.సి.సి. మేనేజింగ్ డైరెక్టర్ టి.బాబురావునాయుడు మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. వారానికి మూడు రోజుల పాటు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి., ఎస్.టి కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి, జి.సి.సి. జనరల్ మేనేజర్ అశోక్, పాడేరు డివిజనల్ మేనేజర్ మోహనరావు, పలువురు అధికారులు, దేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లను నిర్మించుకోవాలి
జి.మాడుగుల, నవంబర్ 19: పారిశుధ్య నిర్వహణకు, సంపూర్ణ ఆరోగ్యానికి మరుగుదొడ్లను ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరావు కోరారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జి.మాడుగులలో సోమవారం ర్యాలీ నిర్వహించి మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు ఉచితంగా మరుగుదొడ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. గ్రామాలలోని ప్రతి గిరిజనుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు రావాలని ఆయన కోరారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వలన అపారిశుధ్యాన్ని పారద్రోలి, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చునని ఆయన అన్నారు. మరుగుదొడ్లను ఇప్పటికే నిర్మించుకున్న వారు తప్పనిసరిగా వినియోగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇంజనీర్ విజయకుమార్, గాంధీనగరం బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిర జయంతి వేడుకలు
మాడుగుల, నవంబర్ 19: స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మాడుగులలో సోమవారం నిర్వహించారు. మాడుగుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పి.సతీష్‌వర్మ ఆధ్వర్యంలో స్థానిక గవరవీదిలో ఇందిరగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొండా రాంబాబు, ఆవుగెడ్డ కోటిపిల్లినాయుడు, బి.శ్రీనివాసరావు, పి.కొండలరావు, బి.బంగారనాయుడు, వి.కోటేశ్వరరావు, క్రిష్ణారావు, ఎన్.దేముడునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
భూమి పట్టాలకు ఆన్‌లైన్ చేయాలి
మాడుగుల, నవంబర్ 19: పట్టాలు మంజూరు చేసిన భూములకు ఆన్‌లైన్ చేపట్టాలని సి.పి.ఎం. నాయకులు కె.గోవింధరావు, డి.వెంకన్న డిమాండ్ చేసారు. స్థానిక సి.ఐ.టి.యు. కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ స్థాయి పార్టీ సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలో ఒమ్మలి జగన్నాధపురం రెవిన్యూ పరిధిలో ఉన్న ఉరవలోవ కొండ సమీపాన 2013వ సంవత్సరంలో ఆరో విడత భూ పంపిణీలో సుమారు రెండు వందల మంది రైతులకు పట్టాలు మంజూరు చేసారని చెప్పారు. అయితే వీరికి ఇంతవరకు భూములకు ఆన్‌లైన్ చేయలేదని వారు అన్నారు. రైతులు అనేక సార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, దీంతో ప్రభుత్వం నుంచి రాయితీలు వీరికి అమలు కావడం లేదని వారు చెప్పారు. ఈ విషయమై అధికారులు దృష్టి సారించి గిరిజనుల భూములకు ఆన్‌లైన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో సి.పి.ఎం. నాయకులు యన్నంశెట్టి సీతారాం, సి.హెచ్.రాజు, కొర్రా దాసు, తదితరులు పాల్గొన్నారు.
రైతు సదస్సును విజయవంతం చేయాలి
మాడుగుల, నవంబర్ 19: విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదిన నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రైతు సదస్సును విజయవంతం చేయాలని రైతు సంఘం సహాయక కార్యదర్శి వేచలపు వెంకటరమణ, సి.పి.ఐ. నాయకుడు సీతా బెన్నంనాయుడు కోరారు. సోమవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ సదస్సులో చర్చించనున్నట్టు చెప్పారు. రైతుల సమస్యలపై కార్యాచరణ ఖరారు చేసి ఈ నెల 29,30వ తేదీలలో డిల్లీలో జరిగే మహాధర్నాలో చర్చించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ సదస్సుకు రైతులంతా హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
మాడుగుల, నవంబర్ 19: కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం మండలంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసంలో ప్రీతికరమైన రోజు కావడంతో అనేక ప్రాంతాల వారు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు పలు ప్రాంతాలలో ఉన్న శివాలయాలకు భక్తుల తాకిడి అధికమయ్యింది. ఆలయాలకు వేకువజాము నుంచే భక్తులు చేరుకుని పూజలు చేసారు. స్థానిక గవరవీదిలో నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వరి ఉత్సవాలలో భాగంగా నారాయణ సేవ (అన్నిదానం) చేపట్టారు. ఇదిలాఉండగా మండలంలోని కె.జె.పురంలో నిర్వహిస్తున్న వెంకన్న కల్యాణ మహోత్సవాలలో భాగంగా రెండో రోజు ప్రత్యేక పూజలు, అన్నసమారాధనం, పల్లకీ ఊరేగింపు, వెంకన్న కల్యాణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, క్రీడా పోటీలను నిర్వహించారు. కె.జె.పురంలోని వెంకటేశ్వరస్వామిని స్థానిక ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తదితరులు దర్శించుకున్నారు. కె.జె.పురంలో గోవింద నామస్మరణతో మారుమోగింది.