విశాఖ

రామగుడ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే నేతల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జి.మాడుగుల, సెప్టెంబర్ 24: ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన రామగుడ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే మావోయిస్టులు అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. హత్యకు గురైన కిడారి భౌతికకాయానికి ఆయన పాడేరులో సోమవారం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నాయకుల హత్యాకాండకు ఇంతకుమించిన కారణమేది కనిపించడం లేదని అన్నారు. ఎవరినైనా శిక్షించాలంటే బలమైన కారణం ఉండాలని, కిడారి, సోమల విషయంలో ఎటువంటి కారణాలు లేవని ఆయన చెప్పారు. తమ ఉనికిని చాటుకునేందుకు ఇద్దరు నేతలను మావోయిస్టులు బలి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఏదైనా సమస్యలు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలే గాని చంపే అధికారం మావోయిస్టులకు ఎవరిచ్చారని అయ్యన్న ప్రశ్నించారు. సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేయాలే గాని మనుషులను చంపి పోరాటం చేస్తామనడం దారుణం, నీచమైన పనిగా ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనుల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టులు అదే గిరిజనుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి పాటుపడుతున్న నేతలను చంపడం ఎంతవరకు న్యాయమని ఆయన నిలదీసారు. గిరిజన ప్రాంతంలో వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుండగా గిరిజన ఎమ్మెల్యేను చంపడం ద్వారా ప్రజలకు మావోయిస్టులు ఎటువంటి సమాచారం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారడం తప్ప వారు చేసిందేమి లేదని ఆయన అన్నారు. కిడారి, సోమల హత్యలతో ఏజెన్సీలో నాయకత్వం కోల్పోయిందని, అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడితే ప్రజలు ఏం కావాలని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నవారంతా ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండించాలని మంత్రి పిలుపునిచ్చారు. మవోయిస్టులు చేసిన ఈ ఘాతుకంతో ప్రజా నాయకులు భయపడే పరిస్థితికి వచ్చారని ఆయన అన్నారు. మావోల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన కిడారి, సోమ కుటుంభాలను రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. వీరి కుటుంభ సభ్యులకు ఏదీ కావాలంటే అది చేసేందుకు ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. నాయకులను కోల్పోయినపుడు ప్రజలు బాధపడడం సాధారణమేనని, అయితే ఇటువంటి సమయంలోనే సంయమనంతో వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని అయ్యన్నపాత్రుడు కోరారు.