విశాఖ

భూముల రికార్డులు మారిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 12: భూముల రికార్డులు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర శివార్లలో భూముల విలువ విపరీతంగా పెరిగిందని, దీంతో ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు మార్చేందుకు రెవెన్యూ యంత్రాంగం వెనుకాడట్లేదన్నారు. మధురవాడ, కొమ్మాది తదితర ప్రాంతాల్లో విలువైన భూముల రికార్డులకు తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. భూముల రికార్డుల మార్పిడికి సంబంధించి ఇప్పటి వరకూ 22 కేసులు గుర్తించామని, వీటిలో 10 కేసులు మధురవాడ ప్రాంతంలోనే ఉన్నాయన్నారు. రికార్డులు మార్చడం ద్వారా రూ.493 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైందని పేర్కొన్నారు. కొమ్మాదిలో మరో 10 కేసులు గుర్తించామని, ఈ వ్యవహారంలో రూ.1628 కోట్ల విలువైన 186.92 ఎకరాల భూమి వివాదాల్లో చిక్కుకుందన్నారు. ఈ మండలంలో 1బి రికార్డుల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. అలాగే చిప్పాడ గ్రామంలో 184/7 సర్వే నెంబర్‌లో భూమి అసలు హక్కుదారుగా పివిజి రాజు పేరిట ఉండగా, ఎన్‌ఓసి తీసుకుని సూర్యచంద్ర ఎస్టేట్స్ పేరిట రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయిందని తెలిపారు. ఈ భూములకు సంబంధించి అధికారులు పట్టాదార్ పాసుపుస్తకాలు సైతం జారీ చేయడం చూస్తే రెవెన్యూ అధికారులు ఎంతగా ప్రభావితమయ్యారో అర్ధం అవుతోందన్నారు. ఇటువంటి తప్పులకు పాల్పడిన వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. రెవెన్యూ రికార్డులు మార్చడం వల్ల సివిల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఇందుకు కారణమైన రెవెన్యూ అధికారులపై సత్వరమే చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఎవరూ తప్పిదాలకు పాల్పడకుండా గుణపాఠం చెప్పాల్సి ఉందన్నారు. రికార్డుల మార్పుకు సంబందించి ప్రాధమిక సమాచారం లభించిందన్నారు. రికార్డుల్లో పేర్లు, ఫొటోల ఆధారంగా వీరిని గుర్తించి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధ చేస్తున్నామని, ఇప్పటికే, పోలీసు కమిషనర్‌తో చర్చించినట్టు కలెక్టర్ వెల్లడించారు. మార్పిడికి గురైన రికార్డులను గుర్తించి, గ్రామ సభలు నిర్వహించడం ద్వారా పూర్తి వివరాలు సేకరించి 1బి రికార్డు ప్రకారం ఒరిజినల్ హక్కు దార్లను నిర్ణయించనున్నట్టు తెలిపారు. తప్పిదాలకు పాల్పడిన వ్యక్తులకు నోటీసులు జారీ చేయడంతో పాటు పూర్తి విచారణ నిర్వహించి ఐదారు వారాల్లో చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన వైఖరి అవలంభిస్తామన్నారు.

దళిత,గిరిజనులపై కేసుల సత్వర పరిష్కారం
* సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలి

విశాఖపట్నం, మే 12: దళిత, గిరిజనులపై నమోదైన కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి పరిష్కరించాలని పోలీసు అధికారులను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 12 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వ న్యాయవాదులు చూడాలన్నారు. కేసుల పరిష్కారానికి అవసరమైన కుల ధృవీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులు సత్వరమే జారీ చేయాలన్నారు. అలాగే న్యాయ సలహాలు అందించే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కేసుల పరిష్కారం కూడా నెమ్మదిస్తోందని, నెలకు కేవలం 5 లేదా 6 కేసులు మాత్రమే పరిష్కారం అవుతున్నాయని, వేగంగా కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలకు శాసనసభ్యులు, పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరుకావట్లేదని, వారు కూడా హాజరయ్యేలా చూడాలని సభ్యులు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వచ్చే సమావేశాల నుంచి వారు కూడా హాజరయ్యేలా చూస్తామన్నారు. సమావేశ అజెండా కాపీలను సమావేశం జరుగుతున్నప్పుడే ఇస్తున్నారని, వారం రోజుల ముందుగా ఇస్తే కేసుల వారీగా సమీక్షించుకుని చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందన్నార. దీనిపై స్పందించిన కలెక్టర్ వారం రోజుల ముందుగానే సమావేశ అజెండాను సిద్ధం చేసి సభ్యులకు పంపాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణమూర్తిని ఆదేశించారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు టిఎ,డిఎతో పాటు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరగా ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

మహానాడు ప్రాంగణంలో పనులు ప్రారంభం
* భూమి పూజ చేసిన పార్టీ అధ్యక్షుడు కళా

విశాఖపట్నం, మే 12: ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న టిడిపి మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె కళా వెంకటరావు, మంత్రి చినరాజప్ప, పార్టీ సీనియర్ నేత ఎంవివిఎస్ మూర్తి తదితరులు శుక్రవారం నాడిక్కడ ఎయు గ్రౌండ్స్‌లో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కళా వెంకటరావు తదితరులు మీడియాతో మాట్లాడుతూ పార్టీ పరంగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహానాడు టిడిపి పండుగ వంటిదన్నారు. పార్టీ జాతీయ, రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక కూడా మహానాడు వేదికగానే జరుగుతుందన్నారు. మహానాడు నిర్వహణకు సంబంధించి వేదికగా ఎయును ఎంపిక చేయడంపై చెలరేగుతున్న వివాదాలను విలేఖరులు ప్రస్తావించగా, అన్ని అనుమతులు తీసుకున్నామని, ఈ విషయంలో వివాదమేమీ లేదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో అధ్యక్షుడు కళా వెంకటరావు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమయం తక్కువగా ఉన్నందున ఏర్పాట్లకు సంబంధించి పనులు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. కమిటీల వారీగా ఎవరికి అప్పగించిన పనులు వారు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ నాయకులు చోడే పట్ట్భా, తదితరులు పాల్గొన్నారు.