విశాఖ

పెథాయ్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 17: పెథాయ్ తుపానును సమర్థంగా ఎదుర్కొంనేందుకు అన్ని శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెథాయ్ తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, గ్రామాల సంబవించే ఎటువంటి నష్ట వివరాల సమాచారాన్నైనా సేకరించి సహాయ చర్యలు చేపట్టాలని చెప్పారు. గిరిజన ప్రాంతంలో ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఆయన అన్నారు. అధికారులంతా గిరిజనులకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలను అందించాలని ఆయన చెప్పారు. విద్యుత్, తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన ఆదేశించారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు డయోరియా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామాలలో మంచినీటి బావులు, నీటి వనరులలో క్లోరోనేషన్ చేయించాలని, గిరిజనులు వాగులు గెడ్డలు దాటి ప్రయాణాలు చేయకుండా చూడాలని ఆయన చెప్పారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పెధాయ్ తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఏజెన్సీలోని అన్ని మండలాల్లో అధికారులను అప్రమ్తతం చేసి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వారికి పలు సూచనలు, సలహాలు చేసినట్టు ఆయన చెప్పారు. ఆర్.టి.జి.ఎస్. అధికారులతో మాట్లాడి తుపాను ప్రభావ పరిస్థితులను తెలుసుకుంటున్నామని ఆయన అన్నారు. తుపాను కారణంగా నిత్యావసర వస్తువులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏజెన్సీలోని అన్ని డి.ఆర్.డిపోలకు ముందుగానే పూర్తి స్థాయిలో సరుకులు పంపిణీ చేసినట్టు ఆయన చెప్పారు. మారుమూల ప్రాంతాలలోని కొండ శిఖర గ్రామాల్లో నివాసం ఉండే గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వి.ఆర్.ఒ.లకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రమాదకరంగా ఉండే గ్రామాల వారిని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచుకోవాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. మంచినీటి ఇబ్బందులు ఉన్న గ్రామాలకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. విద్తుత్ సమస్యను అధిగమించేందుకు ఎ.పి.ఈ.పి.డి.సి.ఎల్. అధికారులను అందుబాటులో ఉంచామని ఆయన అన్నారు. పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించామని, విద్యార్థులను బైటకు పంపకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్టు బాలాజి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ.ఇ. రాంప్రసాద్, ప్రాజెక్టు ఉద్యానవన అధికారి జి.ప్రభాకరరావు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంకరరెడ్డి, కాఫీ ఎ.డి. రాధాక్రిష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

తుపానును సమర్థంగా ఎదుర్కొవాలి
పాడేరు, డిసెంబర్ 17: పెథాయ్ తుపానును సమర్థంగా ఎదుర్గొని గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. రాజదాని అమరావతి నుంచి సోమవారం టెలిఫోన్‌లో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజితో మాట్లాడి తుపాను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీలో అన్ని మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉండవచ్చునని, అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తుపానుతో దెబ్బతినే వ్యవస్థలను సత్వరమే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ఆశ్రమ విద్యార్థులకు వేడి నీటిని మాత్రమే సరఫరా చేయాలని శ్రావణ్‌కుమార్ అధికారులకు సూచించారు.
ఈదురుగాలులతో ఏడతెరపిని భారీ వర్షాలు
సముద్రంలో పెరిగిన అలలు ఉధృతి
తీరప్రాంతాల్లో అత్యంత అప్రమత్తత
సహాయక చర్యల్లో అధికార బృందాలు
క్షణక్షణం మత్స్యకారుల్లో ఆందోళన
అచ్యుతాపురం, డిసెంబర్ 17: బంగాళఖాతంలో ఏర్పడ్డ పెధాయ్ తుఫాన్ కారణంగా పూడిమడక సముద్రతీరంలో అలలు పోటు ఉధృతంగా పెరిగాయి. సముద్ర కెరటాలు ఏగిసిపడుతూ తీరం అంతా భయంకరంగా మారింది. అలలు తాకిడికి తీరం కోతకు గురికావడంతో పాటు బోట్లు గల్లంతుయ్యాయి. ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. అచ్యుతాపురం జంక్షన్‌లో వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ మూసివేశారు. చల్లని గాలులతో పాటు ఈదురు గాలుల వలన వాహనరాకపోకలు నిలిచిపోవడంతో పాటు ప్రజలు తీవ్ర ఇక్కట్లుకు గురివుతున్నారు. అధికార బృందాలు పూడిమడకలో ఉండి తుపాన్‌పై చర్యలు సమీక్షిస్తున్నారు. అధికారులు మత్స్యకారులను తుఫాన్ షెల్టర్లకు తరలించడానికి చర్యలు మమ్మురం చేశారు. వర్షపు నీరుతో రోడ్లున్నీ జలమయంగా మారాయి. ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులు తుఫాన్‌పై తీసుకోవల్సిన జాగ్రత్తలపై అధికారులు వివరిస్తున్నారు. జెసీ సృజన అధికారులతో మత్స్యకార గ్రామాల్లో పర్యిటిస్తూ సహాయక చర్యలపై ఆరాతీశారు. వ్యవసా. సంయుక్త సంచాలకులు ఆదరణ కుమార్ తుఫాన్ భ్రావిత వరిక్షేత్రాల్లో పర్యటించారు. హరిపాలెం, మడుతూరు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. సుమారు 30 ఏకరాల వరి పంటకు తీవ్ర నష్టం జరిగినట్టు తెలిపారు. 32 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదుయిందని వ్యవసాయాధికారి రంగాచారి తెలిపారు.

తుఫాన్ తీరం దాటే ప్రమాదం వుంది
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
తీర ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ సృజన సుడిగాలి పర్యటన
అచ్యుతాపురం, డిసెంబర్ 17: కాకినాడ విశాఖపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే ప్రమాదం వుందని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జెసీ అధికారులకు సూచించారు. పూడిమడక, తంతడి, వాడపాలెం తీరప్రాంతాల్లో అధికారులతో కలసి సుడిగాలి పర్యటన చేశారు. తుఫాన్‌పై అధికారులకు తగిన సూచనలు సలహాలు చేశారు. పంచాయితీ కార్యదర్శితో పాటు రెవెన్యూసిబ్బంది అందుబాటులో ఉండాలని, తహసీల్థార్ హెడ్‌క్వాటర్‌లో ఉండాలన్నారు. ప్రతి పంచాయితీలో ఆహారంతో పాటు, మంచినీరు, గ్యాస్, నిత్యవసర వస్తువులు ఆందుబాటులో ఉండేట్టు చర్యలు చేపట్టాలన్నారు. లోకేషన్ ఫోటోలు తీసి ఎప్పటికి అప్పటికి సమాచారాన్ని అందజేయాలన్నారు. విద్యుత్ శాఖాధికారులు అత్యవసర సమయంలో పంచాయితీ సైక్లోన్ షెల్టర్ వద్ద జనరేటర్, కిరోసిన్ ద్వీపాలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు తుఫాన్‌పై సమాచారం ఇవ్వాలన్నారు. వర్షం సైతం లెక్కచేయకుండా జెసీ తీరంలో పర్యటించారు. అధికారులంతా అందుబాటులో ఉండాలన్నారు. ఆమె వెంట ఆర్డీవో సూర్యకళ, తహసీల్థార్ క్రిష్టమూర్తి, ఎంపీడీవో బలరాముడు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మన్యంలో విస్తారంగా వర్షాలు
పాడేరు, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాను ప్రభావంతో విశాఖ మన్యంలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిసాయి. ఆదివారం నుంచి ప్రారంభమైన వర్షం సోమవారం నాటికి ఉదృతరూపం దాల్చి గిరిజన ప్రాంతమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పాటు చలి తీవ్రత అధికం కావడంతో జనం రోడ్లపైకి రావాలంటేనే హడలిపోతూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఏజెన్సీలోని ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఏజెన్సీలో సోమవారం సాయంత్రం నాటికి దాదాపు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికార సమాచారం బట్టి తెలుస్తోంది. గిరిజన ప్రాంతంలో అత్యధికంగా అనంతగిరి మండలంలో 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. డుంబ్రిగుడ మండలంలో 55 మిల్లీమీటర్లు, అరకులోయలో 46.4, పాడేరులో 19.7, హుకుంపేటలో 19,4, పెదబయలులో 9.8, ముంచంగిపుట్టులో 8.6, చింతపల్లిలో 6, జి.మాడుగులలో 17.6, గూడెంకొత్తవీధిలో 36, కొయ్యూరు మండలంలో 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపి లేకుండా ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో గిరిజన గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. పొంగి పోర్లుతున్న గెడ్డలతో గ్రామాలలోని గిరిజనులు ఇతర ప్రాంతానికి ఎక్కడకూ వెళ్లేందుకు వీలులేక ఇళ్లకే పరిమితం కావలసి వచ్చింది. కాగా వర్షాల కారణంగా మన్యంలో వరి పంటకు కొంతమేర నష్టం సంబవించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గిరిజన రైతులు పంటను కోసి కుప్పలుగా వేసుకున్నారని, దీంతో వర్షం దాటికి పంట నష్టపోకుండా కుప్పలకు రక్షణ ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. పంట పొలాల్లో కోసి ఉంచిన పంటతో పాటు ఇంకా కోత కోయకుండా ఉన్న పంట మాత్రం కొంతవరకు దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. వర్షాల కారణంగా పంట నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలాఉండగా ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్నట్టు సమాచారం. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి ప్రధాన రహదారి మార్గాన్ని కోతకు గురిచేసినట్టు తెలుస్తోంది. తుపాను కారణంగా సంబవించిన నష్టం వివరాలను అధికారులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సమాచార సేకరణలో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.
గజగజలాడిస్తున్న పెథాయ్ తుఫాన్
కోటవురట్ల, డిసెంబర్ 17: ఫెథాయ్ తుపాన్ గజగజలాడిస్తోంది. చలిగాలుల తీవ్రతకు ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. సోమవారం వర్షంతో పాటు పెనుగాలుల తీవ్రతకు జనజీవనం పూర్తిగా స్థంభించింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు పలు ఇక్కట్లు పడ్డారు. కూలీలు కొరత వలన తంగేడు, కైలాసపట్నం, వెంకటాపురం,జల్లూరు, అన్నవరం, సుంకపూర్ తదితర గ్రామాల్లో పొలాలపై ఆరబెట్టిన వరి పంట పూర్తిగా తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెథాయ్ తుఫాన్ వరి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. విద్యుత్ సరఫరా ఉదయం నుంచి నిలిచిపోయింది. తుఫాన్ తీరం దాటిన తరువాత వర్షం ఉదృతంగా పడుతుంది. తుఫాన్ ప్రాంతాల్లో పశువులను కట్టకుండా విడిగా వదిలివేయాలని కె.వెంకటాపురం పశువైద్యాధికారి డాక్టర్‌పెట్ల నరేష్ సూచించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మూగజీవాలు తడవకుండా ఆశ్రయం కల్పించాలన్నారు. ప్రమాదశాత్తు పశువులు మరణిస్తే పూర్తి వివరాలను తెలియజేయాలన్నారు.

అంధకారంలో కొయ్యూరు
కొయ్యూరు, డిసెంబర్ 17: ఆదివారం రాత్రి నుండి కాకరపాడు సబ్ స్టేషన్ పరిధి గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేకపోవడంతో అంధకారంలో మగ్గుతున్నాయి. సబ్ స్టేషన్‌కు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుండి విద్యుత్ సరఫరా జరుగుతుంది. రంపచోడవరం , గంగవరం, అడ్డతీగల ,రాజవొమ్మంగి మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడం, ఈప్రాంతం గుండా విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ప్రస్తుతం పెథాయ్ తుఫాన్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాకు అధికంగా ఉండడంతో ఆదివారం రాత్రి నుండే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటవీ ప్రాంతంలో చెట్ల కొమ్మలు విరిగి పడడం, తదితర సాంకేతిక కారణాలు వలన విద్యుత్ సరఫరా నిలిపివేసారు. ప్రస్తుతం డీ ఆర్ డీపోల్లో అందించే రాయితీ కిరోసిన్ సైతం సరఫరా కాకపోతుండడంతో విద్యుత్ సరఫరా లేక సబ్ స్టేషన్ పరిధి సుమారు తొమ్మిది పంచాయతీలు రెండు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నాయి.

అన్నదాతల ఆందోళన
కొయ్యూరు, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి జన జీవనం స్థంభించింది. ప్రస్తుతం మన్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. తుఫాన్ సూచన ఉన్నప్పటికీ గత వారం రోజులుగా మబ్బులు మినహా వర్షం సూచనలు లేకపోవడంతో పండిన వరి చేలను కోసేందుకు రైతాంగం సన్నద్ధమయ్యారు. పలు చోట్ల కోసిన వరి చేలను యంత్రాల సహాయంతో హడావుడిగా నూర్పులు చేసారు పలువురు రైతాంగం గురు, శుక్రవారాల్లో కోసిన వరిచేలను ఎత్తేందుకు వీలు లేకపోవడంతో పొలాల్లోనే వదిలేసారు. ఆదివారం ఉదయం నుండి వర్షప్రభావం మండలంలో చూపిస్తూ చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం ఆదివారం రాత్రి నుండి అధికం కావడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో కోసిన చేను నీట మునిగి ధాన్యం ముక్కి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధికంగా నష్టపోయిన తమను ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే ఆదుకోవాలని పలువురు రైతాంగం కోరుతున్నారు.

రైతులను నట్టేట ముంచుతున్న పెథాయ్
గొలుగొండ, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ కారణంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గతమూడు రోజుల నుండి తుఫాన్ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ చేతికి అందిన పంట నేలపాలు అవుతుందని రైతులు వాపోతున్నారు. కోతలు కోసి పనలు వేసిన సమయంలో ఫెథాయ్ రూపంలో భారీ వర్షాలు కురియడంతో చేతికి అందిన పంట పూర్తిగా నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో పంటలను పరిశీలించేందుకు తహశీల్దార్ అంబేద్కర్, వ్యవసాయాధికారి మధుసూధనరావు, విద్యాశాఖాధికారి జీవీ ఎస్ నాగేంద్ర, మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను అంచనా వేసారు. గాదంపాలెం, విప్పలపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రైతులు తమ గోడును వెళ్ళబుచ్చారు.

పెథాయ్ తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు
*నీటమునిగిన పంటలు - నిలిచిపోయిన బెల్లం తయారీ
*ఇంటిలో నుండి పైకి రావలంటేనే బెంబేలెత్తిపోయిన ప్రజలు
*నిర్మానుష్యంగా ప్రధాన కూడళ్లు
అనకాపల్లి, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాను ప్రభావంతో అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు ఇంటిలోనుండి పైకి వచ్చేందుకే బెంబేలెత్తిపోతున్నారు. తెల్లవారునుండి ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. 36మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారులు తెలిపారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆదివారాన్ని తలపించే రీతిలో దుకాణాలు ఇతరత్రా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు సైతం బోసిపోయాయి. ముందుగానే సెలవు ప్రకటించడంతో స్కూల్స్, ఇతర ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది. బస్సుల రాకపోకలు సైతం అంతంతమాత్రంగానే సాగాయి. ఆర్టీసి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో సైతం నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో హతియా - యశ్వంత్‌పూర్, బొకారో ఎక్స్‌ప్రెస్ అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌లను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసారు. దీంతో ఆయా రైళ్లలోని ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఎడతెరిపి లేని వర్షాల వలన ప్రధాన రహదారులు, లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రైతులు కోసిన వరిపంటను ముందుగానే వరికుప్పలు వేయగా మరికొన్ని చోట్ల కూలీల కొరత వలన కోసిన పంట పంటభూమిలోనే ఉండిపోయింది. ఆ విధంగా అనకాపల్లి మండలంలోని కూండ్రం, సీతానగరం, మునగపాక మండలంలోని వాడ్రాపల్లి, పాటిపల్లి తదితర ప్రాంతాల్లో దాదాపుగా పది ఎకరాల్లోని వరిపంట నీటమునిగిపోయింది. పెథాయ్ తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్తవ్రేత్తల బృందం పర్యటించి పంటలకు వాటిల్లిన నష్టంపై అంచనా వేసారు. పరిశోధనా కేంద్రం ఎడిఆర్ జమున ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు చిత్కళాదేవి, కిషోర్‌వర్మ, శ్రీలత తదితరులు పంటల క్షేత్ర పర్యటన జరిపారు. నీట మునిగిన వరిపంటపై ఉప్పుద్రావణాన్ని వేస్తే మొలకెత్తకుండా కాపాడుకోవచ్చునని రైతులకు సూచించారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంగా బెల్లం తయారీ నిలిచిపోయింది. క్రషింగ్‌కు సిద్ధం చేసిన చెరకు క్రషర్ల వద్దే ఉండిపోయింది. స్థానిక మార్కెట్‌కు 200 దిమ్మలకు మించి బెల్లం రాలేదు. మార్కెట్‌లో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది.

హుదూద్‌ను గుర్తుకు తెచ్చిన ఫెథాన్ తుపాను
* సబ్బవరంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం
* 8 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిపివేతతో ఇబ్బందులు*
* అప్రమత్తమైన అధికార యంత్రాంగం-తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ *
* గ్రామాల్లో కింది స్థాయి అధికారులు మొహరింపు*
సబ్బవరం, డిసెంబర్ 17 : బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెథాన్ తుపాను ప్రభావంతో సోమవారం మండలంలో హుదూద్ తుపానును గుర్తుకు తెచ్చింది. దీంతో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తుపాను సమాచారానికి సంబంధించిన కంట్రోలు రూం ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడి మండల పరిషత్‌లో సమావేశమయిన మండల ప్రత్యేక అధికారి భూగర్భవనరుల శాఖ డిఇ కెఎస్ శాస్ర్తీ ఆధ్వర్యంలోని అధికారులు బృందం తహశీల్దార్ పైల రామారావు, ఎంపీడీవో బి.రమేష్‌నాయుడు,ఈవోపీఆర్డీ కె.సూర్యనారాయణలు ఎప్పటి కప్పుడు మండల నలుమూలల నుంచి తుపాను ప్రభావంపై పరిస్థితిన సమీక్షిస్తూవచ్చారు. అంతేకాకుండా తుపానుపై కూడా కొంత అనుభవం ఉన్న శాస్ర్తీ తన వద్దగల ల్యాప్ ట్యాప్ సహాయంతో తుపాను గమనాన్ని పరిశీలిస్తూ ఇతర అధికారులకు దాని తాకిడి గురించి వివరిస్తూ వచ్చారు. కాకినాడకు 500 కిలోమీటర్ల దూరంలో తుపాను పొంచి ఉన్న సమయం నుంచి 50 కిలోమీటర్ల దూరానికి చేరటం తర్వాత అది తీరం చేరే వరకు ఆయన పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. అయితే తుపాను ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వాతావరణ శాస్తవ్రేత్తలు చెప్పినట్లుగా తుపాను తీరం దాటిన తర్వాత భారీ వర్షాల వల్ల రైతులకు ఉపయోగం లేకపోయినప్పటికీ భూ గర్భజలాలా సాంద్రత పెరుగుతుందని ఆయన స్థానిక విలేఖర్లకు తెలిపారు. ఇప్పటికే భూగర్భజలాల సాంద్రత బాగాపడిపోయిందని, మే నెలలో భూగర్భజలాలు పడిపోయే స్థితికి డిసెంబరులోనే ఆ పరిస్థితి దాపురించిందని శాస్ర్తీ వివరించారు. ప్రస్తుతం 10-20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయితే మళ్ళీ భూగర్భజలాల మట్టం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మండలంలో ఎలాంటి విపత్కర పరిస్థితులపై సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.