విశాఖ

అన్నదాతలను ముంచిన పెథాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, డిసెంబర్ 18: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను అన్నదాతలను నిండా ముంచేసింది. కళ్లాల్లో నూర్పులకు సిద్ధం చేసిన వరి కుప్పలు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. తడిసిన ముద్దయిన వరి చేళ్లను చూసి గిరిజన రైతన్నలను బోరున విలపిస్తున్నారు. రెండు రోజులుగా కుండ పోతగా కురిసిన భారీ వర్షాలతో వరి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. మండలంలోని పద్నాలుగు పంచాయతీలలో ఎక్కడ చూసినా రైతుల కన్నీటి రోదనే కనిపిస్తుంది. ఇటీవల కోత కోసిన వరి పంట పోలాల్లో ఉండగా, కొన్ని గ్రామాలలో రైతులు కుప్పలు వేసారు. విస్తారంగా కురిసిన వర్షాలకు కుప్పలతో పాటు పొలాల్లోని వరి తడిసిపోయాయి. కుప్పలలోకి వర్షం నీరు చేరడంతో ధాన్యం గింజలు మెలకెత్తుతాయని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. తడిసిన వరి పొలాలను గట్లపైకి, కళ్లాలోకి చేర్చి ఆరబెడుతున్నారు. తడిసిన వరిని కాపాడుకునేందుకు రైతులు ఎంత ప్రయత్నిస్తున్నా మంగళవారం మళ్లీ వర్షం కురవడంతో వారి ప్రయత్నాలకు ఫలితం దక్కలేదు. మండలంలో సుమారు ఐదు వందల వరి కుప్పలలో నీరు చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సి.పి.ఎం. నాయకుడు పొద్దు బాలదేవ్ చినలబుడు పంచాయతీలోని 13 గ్రామాలలో పర్యటించి తడిసిన వరి కుప్పలను పరిశీలించారు. చేతికి అంది వచ్చే పంట తుపాను ప్రభావంతో నాశనమై రైతులు నష్టపోయారని, అధికారులు స్పందించి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.
సరిహద్దులో వణికిస్తున్న చలి
గూడెంకొత్తవీధి, డిసెంబర్ 18: సరిహద్దు ప్రాంతంలో చలి గజగజ వణికిస్తోంది. గత రెండు రోజులుగా చలి మరింత పెరిగిపోయింది. ఒక పక్క పెథాయ్ తుఫాన్ ప్రభావం, మరో పక్క చలి తీవ్రత గిరిజనులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆదివారం నుండి ఎడతెరిపి లేని వర్షం కారణంగా దారాలమ్మ అమ్మవారి ఘాట్ రోడ్డులో రాకపోకలకు చాలా ఇబ్బందులకు ప్రయాణీకులు గురయ్యారు. ఉదయం, రాత్రి అనే సమయం లేకుండా నిరంతరం మంచు తెరలు కమ్ముకోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టంగా పొగ మంచు కమ్ముకోవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. దారాలమ్మ అమ్మవారి గుడిపై మంచు తెరలు కమ్ముకున్నాయి. ఈ ప్రాంతం మీదుగా వాహనాల రాకపోకలు కూడా తగ్గుముఖం పట్టాయి.

పెథాయ్ దెబ్బకు నష్టపోయిన రైతాంగం
మునగపాక, డిసెంబర్ 18: గత మూడురోజులుగా రైతులను ఎంతో భయబ్రాంతులకు గురిచేసిన పెధాయ్‌తుపాన్ మునగపాక మండలంలో పలు గ్రామాల్లో చేతికి అందివచ్చిన పంటలను దెబ్బతీసింది. అసలే కరువుకోరల్లో చిక్కుకున్న వరి, చెరకు పంటలు కోతకు వచ్చే సమయంలో తీవ్రంగా రైతులను కుంగదీసింది. సోమవారం తీరం దాటే సమయంలో వీచిన గాలులకు వరిపంట, చెరకు పంటలు నేలకొరిగాయి. రైతులు తుపాన్ ముప్పునుండి తప్పించుకొనేందుకు వాతావరణశాఖ ఇచ్చిన సమచారంతో రైతులు ఆగమేగాలమీద కోతకోసిన వరిచేలు వ్యవసాయ క్షేత్రాల్లోనే కుప్పలుగా పెట్టారు. కుప్పలకింద వర్షంనీరు చేరడంతో రైతులు ఆంధోళన చెందుతున్నారు. అలాగే బెల్లం మార్కెట్‌లో రేటి పడిపోవడంతో రేటు పెరిగిన తర్వాత బెల్లం తయారికి సిద్దం అవుదామని సన్నద్దం అవుతున్న తరుణంలో గాలుల దాటికి తట్టుకోలేక నేలకొరిగాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా అసలే కరువుతో అల్లాడిన మండలం రైతాంగాన్ని తుపాన్ రూపంలో తీవ్రంగా దెబ్బతీసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
మునగపాక, డిసెంబర్ 18: మండలంలో అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు తుపాన్ వల్ల కురిసిన వర్షాలకు పెద్దపెద్ద గతుకులు పడి గతుకుల్లో నీరుచేరి చెరువుల్ని తలపిస్తున్నాయి. మునగపాక బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత దానివైపు దిక్కుచూసే నేతలు కరువైయ్యారు. పలితంగా చాలా కాలంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయకపోవడంతో అచ్యుతాపురం వెళ్లే మెయిన్‌రోడ్డు నుండి వాడ్రాపల్లి మార్గాన్ని కలిపే బైపాస్ రోడ్డు పూర్తిగా ద్వంసం అయ్యింది. ఇదే మార్గం ద్వారా వాడ్రాపల్లి, గొల్లలపాలెం, కుంచవానిపాలెం, మల్లవరం,నాగవరం , రాజుపేట, అలాగే పాటిపల్లి, మంగళవారపుపేట,మూలపేట, తోటాడ, టి సిరసపల్లి, నారాయడుపాలెం, తానాంకు వెళ్లె ఈ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, పాదచారు పడరానిపాట్లు పడుతున్నారు. ఈ రహదారిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలని ఇటీవల మూడు పర్యాయాలు విశాఖ పట్నంలోని ప్రజావాణిలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిర్యాదులు చేసిన ప్రభుత్వం నుండి నేటి వరకు స్పందన లేదని మొల్లేటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఉడా నిధులతో ఏర్పాటు చేసిన రోడ్డును ఉడా అధికారులుగాని, ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్, అదికారులంతా ఆరోడ్డు ఏర్పాటు మాది కాదంటే మాదికాదు అంటు తప్పించుకుంటున్నారు. స్థానిక శాసనసభ్యుడు కలుగజేసుకొని రోడ్డుకు మోక్షం కల్గించాలని ప్రజలు కోరుతున్నారు.

వెయ్యి ఎకరాల వరి పంట నీటమునక
సీలేరు, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులగా కురిసిన అకాల వర్షాలకు దారకొండ, గుమ్మిరేవులు, దుప్పిలవాడ పంచాయతీల్లో వెయ్యి ఎకరాలకు పైగా వరి పంట నీటమునిగి గిరి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. జీకేవీధి మండలం దారకొండ, దుప్పిలవాడ, కొంగపాకలు, పి.కొత్తూరు, పేట్రాయి, కుమ్మరాపల్లి తదితర గ్రామాల్లో గిరిజన రైతులు సాగు చేసిన వరి పంట నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. చేతికంది వచ్చిన పంట తుఫాన్ కారణంగా పూర్తి స్థాయిలో నాశమైందని గిరి రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించ పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని ఈప్రాంత గిరి రైతులు కోరుతున్నారు.

కూలేందుకు సిద్ధంగా ఉన్న భారీ చెట్టును తొలగించరూ
సీలేరు, డిసెంబర్ 18: జనావాసాలమధ్యలో ఉన్న భారీ వృక్షం ఎండిపోవడంతో ఎప్పుడు కూలిపోతుందోనని చుట్టుపక్కల గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. స్థానిక మేజర్ పంచాయతీలో ఉన్న కన్నబ్బాయి క్యాంప్‌లో ఇళ్ళ మధ్యలో ఉన్న భారీ వృక్షాన్ని సగభాగం వరకు నరికివేయడంతో ఏక్షణంలో కూలిపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణం పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని చెత్తను తొలగించాలని పలువురు కోరుతున్నారు.

30 హెక్టార్లలో వరి పంటకు నష్టం
కొయ్యూరు,డిసెంబర్ 18: తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి మండల వ్యాప్తంగా 30 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసారు. తుఫాన్‌కు ముందే కొద్ది మంది రైతాంగం పండిన చేలను కోసి కుప్పలు, నూర్చడం చేసారు. తుఫాన్ సూచనలతో కొందరు రైతాంగం పండిన చేలను సైతం కోయకుండా వదిలేసారు. గురు, శుక్రవారాల్లో కోసిన వరిచేలు ఎత్తే వీలు లేక మళ్ళలోనే వదిలేసారు. దీంతో సోమవారం కురిసిన వర్షానికి వరి పనలు నీట మునగగా పండిన చేలు నేలమట్టం అయ్యి నీట మునిగాయి. తుఫాన్ కారణంగా మంగళవారం నాటికి 30 హెక్టార్లలో వరి చేలకు నష్టం వాటిల్లినట్లు ఆశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మారుమూల గ్రామాల్లో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది. అపరాలైన మినుములు, పెసలు, బొబ్బరు చేలు సైతం నీట మునగగా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. పంటల ప్రారంభంలో వర్షాలు లేక ఇబ్బందులు పడిన రైతాంగం పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుగ్రామాల్లో పంట నష్టాలను అంచనా వేసేందుకు బుధవారం అనకాపల్లి నుండి శాస్తవ్రేత్తల బృందం మండలానికి వస్తున్నట్లు వ్యవసాయ సిబ్బంది తెలిపారు.
పెథాయ్ తుఫాన్‌కు వందలాది ఎకరాల అరటి, చెరకు తోటలు నేలమట్టం
మాకవరపాలెం, డిసెంబర్ 18: మండలంలో పెథాయ్ తుఫాన్ కారణంగా వీచిన పెనుగాలులకు అరటి, చెరకు పంటలకు అపారనష్టం వాటిల్లి భారీగా ఆర్ధిక నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆది, సోమవారాల్లో మండలంలో తుఫాన్ గాలులకు పైడిపాల సమీపంలో వై.రాజారావు అనే కౌలు రైతుకు చెందిన ఆరు ఎకరాల అరటి తోట పూర్తిగా నేలమట్టమై లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని రైతు ఆందోళన చెందుతున్నాడు. అదే విధంగా మండలంలో లచ్చన్నపాలెం, కొండల అగ్రహారం , గిడుతూరు, వజ్రగడ, , జంగాలపల్లి, తదితర గ్రామాల్లో వరితో పాటు అరటి, చెరకు, కూరగాయాల తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. తమకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మండలంలో జరిగిన వివిధ పంటలకు జరిగిన నష్టాన్ని రెవెన్యూ, ఉద్యానవన , వ్యవసాయాధికాధికారులు గ్రామాల్లో తిరిగి నష్టం వివరాలను రైతుల నుంచి సేకరిస్తున్నారు.

చలిగాలులకు వృద్ధురాలి మృతి
రావికమతం, డిసెంబర్ 18 : తుఫాన్‌కు వీచిన చలిగాలులకు తట్టుకోలేక పి . పార్వతమ్మ(63) సోమవారం రాత్రి మృతి చెందింది. మండలంలో గుమ్మళ్ళపాడు గ్రామానికి చెందిన పార్వతమ్మ చలి గాలులకు వణుకుతుండడం గమనించిన కుటుంబీకులు కుంపటి సహాయంతో ఒళ్ళంతా వేడి చేసారు. అయినప్పటికీ రాత్రి సమయంలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘాట్‌లో కూలిన చెట్టు
అరకులోయ, డిసెంబర్ 18: పెథాయ్ తుపానుతో అరకులోయ ఘాట్‌లో భారీ వృక్షం సోమవారం రాత్రి నేలకు ఒరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఈదురు గాలులకు డముకు సమీపంలో చెట్టు కూలిపోయింది. రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం కూలిపోవడంతో విశాఖపట్నం వైపు నుంచి అరకులోయ, అరకులోయ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం రాత్రి నుంచి ఘాట్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు, వాహన చోదకులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖపట్నం నుంచి పాల ప్యాకెట్లను తీసుకువచ్చే వాహనం కూడా ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో పాలు కోసం ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం కూలిన చెట్టును తొలగించడంతో ట్రాఫిక్ పునరుద్ధరణై ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ముంపుకు గురైన వరి పంట
జి.మాడుగుల, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ దాటికి మండంలోని పలు ప్రాంతాలలోని పంట పొలాలు నీటి ముంపుకు గురికాగా, మూగ జీవులు మృత్యుబారిన పడ్డాయి. సోమవారం రోజంతా వర్షం కురుస్తుండటంతో మండలంలోనష్టం ఎంత జరిగిందనేది తెలియలేదు. మంగళవారం వర్షం కాస్త ఉపసమనం ఇవ్వడంతో మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు మండల కేంద్రానికి చేరుకుని తహాశీల్ధార్ కార్యాలయానికి తమకు జరిగిన నష్టంపై పిర్యాదులు చేసారు. మండలంలోని జంగాలమెట్ట గ్రామానికి చెందన వంతాల చిలకమ్మ ఇళ్ళు కూలిపోగా, వంతాల పంచాయతీ గంట్రాయి గ్రామానికి చెందిన రీమలి కోమలమ్మకు చెందిన పశువులు సోమవరం మేతకోసం సమీప అడవికు వెళ్లి తుఫాన్ దాటికి ఒక ఆవు మృతి చెందింది. సొలభం పంచాయతీ కుడ్డంగి గ్రామంలో గంగపూజారి పద్దబాలంనాయుడుకి చెందన పెంకుటిల్లు, గంగపూజారి నీలకంఠంనాయుడు, అప్పలనాయుడు, లకే మత్స్య కొండబాబులకు చెందిన సుమారు నాలుగు ఎకరాలు పొలం నీట మునిగింది. సింగర్భ పంచాయతీ గొడ్డుబూసులు గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణమ్మకు చెందిన ఆవు, కుమ్మరి కొండంనాయుడుకు చెందిన ఒక ఎద్దుకొండ ప్రాంతంలో సోమవారం మేతకు వెళ్ళి మృత్యువాత పడ్డాయి. వంతాల పంచాయతీ గంట్రాయి గ్రామానికి చెందిన రీమలి నాగరాజుకు చెందిన వరి పంట కోసి కుప్పలు వేయడానికి సిద్ధం అవుతుండగా పంట మెత్తం వర్షపు నీటిలో మునిగిపోయింది నష్టం చేకూర్చింది. సంవత్సర కాలం పంట కోసం ఎదురు చూస్తున్న రైతులకు పెథాయి తుఫాన్ కన్నీలను మిగిల్చింది. దీంతో సంవత్సరమంతా తమ కుటుంభాలు పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదిలాఉండగా మండలంలో పెథాయ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సి.పి.యం. మండల నాయకులు సాగేని ధర్మన్నపడాల్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

బీభత్సం సృష్టించిన ఫెథాయ్ తుఫాన్
కోటవుటర్ల, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ భీభత్సం సృష్టించింది. మండలంలో వరి, చెరకు, పత్తి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. 200 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చెరకు తోటలు నేలకొరిగాయి. పత్తి తోటల్లో నీరు ఎక్కువ కావడంతోకుళ్ళిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీకేపల్లి వద్ద రహదారికి అడ్డంగా పడిన పెద్ద వృక్షాన్ని యుద్ధప్రాతిపదికన రెవెన్యూ సిబ్బంది తొలగించారు. పలు గ్రామాల్లో రహదారులపై వర్షపునీరు ప్రవహిస్తుంది. లింగాపురంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ వి.శ్రీ్ధర్ , ఎడీవో కళ్యాణి, ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. వర్షం తగ్గినా చలిగాలుల తీవ్రత తగ్గలేదు. దీంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. సోమ, మంగళవారాల్లో మండలంలో 8.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పంట పొలాలపై వరి పనలు నీటమునిగితే వెంటనే నీటిని తీసివేయాలని మండల వ్యవసాయాదికారి ఎంవీ సోమశేఖర్ సూచించారు. పనలను రెండువైపులా ఆరబెట్టాలన్నారు. ఐదు గ్రాముల ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. దీని వలన మొలకలు రాకుండా కాపాడవచ్చన్నారు. అలాగే గింజలు రంగు మారకుండా ఉంటాయన్నారు. కోత కోకుండా ఉన్న పంట నేలమీద పడితే నీటిని తీసివేసి దుబ్బులను నిలబెట్టుకోవాలని సూచించారు.
వరి పంటకు నష్టం
పెదబయలు, డిసెంబర్ 18: పెదబయలు మండలం గోమంగి పంచాయతీ కరికొండా, బొడ్డాపుట్టు, కుంతురుపుట్టు గ్రామాలలో పెథాయ్ తుఫాన్ వర్షానికి కొట్టుకొచ్చిన వరద నీటితో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంటతో పాటు రాజ్‌మా పంటకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. పండిన పంట నూర్పులకు సిద్ధం అవుతున్న సమయంలో కల్లాలలో ఉన్న పంట సైతం వర్షానికి తడిసి ముద్దయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కరికొండా గ్రామంలో పెథాయ్ తుఫాన్‌కు తట్టుకోలేక మూడు మూగ జీవులు మృతి చెందాయి. గ్రామాలలో రెవిన్యూ అధికారులు సర్వే నిర్వహించి రైతులకు జరిగిన నష్టంపై అధ్యయనం చేసి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.