వరంగల్

వీడని డైలమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 27: జిల్లా పునర్విభజన విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆలోచన ఏమిటో తెలియక ఇటు రాజకీయపక్షాలు, అటు అధికారులు సందిగ్ధత ఎదుర్కొంటున్నారు. పునర్విభజనలో భాగంగా ఏర్పడే ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా విషయంలో ఎటువంటి అనుమానాలు లేకపోగా వరంగల్ జిల్లా విషయంలోనే ఏమవుతుందోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లాల పునర్వినజన సందర్భంలో వరంగల్ జిల్లాను విభజించి వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటు చేస్తారని ప్రారంభంలో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా ఏర్పాటుకోసం మొదటినుంచి డిమాండ్ ఉన్నా పక్కనే ఉన్న భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా ఏర్పాటు చేస్తుండటంతో జనగామ జిల్లా డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. గతనెలలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీచేసిన సందర్భంలో ఎవరూ ఊహించని విధంగా హన్మకొండ జిల్లా పేరు నోటిఫికేషన్‌లో చోటు చేసుకుంది. వరంగల్ నగర పరిధిలోని హన్మకొండ నియోజకవర్గంతోపాటు స్టేషన్ ఘనపూర్, కరీంనగర్ జిల్లా నుంచి హుజురాబాద్ నియోజకవర్గంను కలుపుకుని హన్మకొండ జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం అధికార పార్టీతోపాటు అన్ని రాజకీయ పక్షాలను గందరగోళంలో పడేసింది. హైద్రాబాద్ నగరాన్ని విభజించడానికి అంగీకరించని ప్రభుత్వం వరంగల్ నగరాన్ని రెండుముక్కలుగా చేయటం ఏమిటనే విమర్శలు అన్ని పక్షాల నుంచి వచ్చాయి. అధికారపార్టీకి చెందిన మెజారిటీ నేతలు కూడా ఈ ప్రతిపాదనపై పెదవి విరిచారు. వరంగల్ నగరాన్ని విడదీసి హన్మకొండ జిల్లాగా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కూడా నిర్వహించారు. దాంతో ప్రభుత్వం హన్మకొండ జిల్లా ఏర్పాటు, అఖిలపక్షం ఆందోళనలపై ఇంటెలిజెన్స్ విభాగంతో సర్వే జరపించగా మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు నివేదిక ఇచ్చారని అధికారపార్టీ నాయకులే చెబుతున్నారు. దాంతో మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని మన్నించి ముఖ్యమంత్రి హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనకు ఫుల్‌స్టాప్ పెడతారని, దానికి బదులు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు ఏర్పాటు అవుతాయనే ప్రచారం జరిగింది. కానీ కెసిఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న కొందరు నాయకులు మాత్రం హన్మకొండ జిల్లా ఏర్పాటు తప్పదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కోణంలో ఆలోచించిన ముఖ్యమంత్రి హన్మకొండ జిల్లా ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నారని, అఖిలపక్షం ఆందోళనలు చేపట్టిన సమయంలో జిల్లా టిఆఎర్‌ఎస్ నాయకులు కెసిఆర్‌తో సమావేశమైనపుడు హన్మకొండ జిల్లాను ఎందుకు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారని పార్టీవర్గాల సమాచారం. దీనికితోడు వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటుచేస్తే జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటుచేయాలనే విషయంలో కూడా జిల్లా టిఆర్‌ఎస్ నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం కూడా ముఖ్యమంత్రి ఒక అవకాశంగా తీసుకుని హన్మకొండ జిల్లా ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నారని పార్టీవర్గాల సమాచారం. ముందుగా నిర్ణయించిన సమాచారం ప్రకారం జిల్లాల ఏర్పాటుపై స్పష్టమైన నిర్ణయం రాష్ట్ర మంత్రిమండలి తీసుకోవలసి ఉండగా భారీవర్షాల కారణంగా మంత్రివర్గ సమావేశం వాయిదాపడింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయంపైనే వరంగల్ రూరల్ జిల్లానా లేక హన్మకొండ జిల్లానా అనేది ఆధారపడి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.