వరంగల్

జనగామ వద్దు.. వరంగల్ ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 20: జనగామ వద్దు.. వరంగల్ ముద్దు... అంటూ స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్ మండలాల జాక్ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీస్తున్నాయి. రోజురోజుకు మిన్నంటుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాలలో జాతీయ రహాదారిపై జాక్ నాయకులు బైఠాయించారు. అలాగే చిల్పూర్‌ను వరంగల్ అర్బన్ జిల్లాలో కొనసాగించాలని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన పెండ్యాల ఉపేందర్‌రావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆమరణ దీక్షకు చిల్పూర్ మండల ప్రజలు పూర్తిగా మద్ధతు ప్రకటించారు. ఘన్‌పూర్, చిల్పూర్, జఫర్‌గడ్ మండలాల్లో 48 గంటల బంద్‌కు పిలుపునివ్వగా రెండవ రోజు ప్రశాంతంగా ముగిసింది. బంద్‌లో స్థానిక ప్రజలు స్వచ్చందంగా పాల్గొని పూర్తి స్థాయిలో మద్ధతు ప్రకటించారు. తమ వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా ధియేటర్లు, పెట్రోల్‌బంక్‌లు మూసివేశారు. అదేవిధంగా ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రహదారుల వెంట ర్యాలీలు నిర్వహించి తమదైన శైలిలో నిరసనలు తెలుపుతూ ప్రధానకూడళ్ళలో మానవహారం చేపట్టారు. గత కొన్నిరోజుల క్రితం వరకు వరంగల్ జిల్లాకే ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా జనగామ జిల్లాను తెరపైకి తేవడంతో అప్పటినుండి స్థానిక అఖిలపక్ష నాయకులు,ప్రజలు రోడ్డెక్కారు. జనగామను జిల్లాగా ప్రకటించినప్పటికి అందులో కలపాలనుకున్న ఘన్‌పూర్, నూతనంగా ఏర్పాటైన చిల్పూర్ మండలాలను వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని స్థానిక జాక్ నాయకులు డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. మండలంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి కడియం శ్రీహరి, హైపర్ కమిటీలకు సహితం వినతిపత్రాలను సమర్పించారు. అయినప్పటికి ఆగని నాయకులు, ప్రజలు నిరసన కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం శివునిపల్లి వివేకానంద విగ్రహం నుండి గాంధీ చౌరస్తా మీదుగా స్థానిక బస్టాండ్ వద్దకు జాతీయ రహాదారిపై భారీఎత్తున ర్యాలీ నిర్వహించిన నాయకులు హన్మకొండ-హైద్రాబాదు జాతీయ రహాదారిని దిగ్బంధించారు. ఈసందర్భంగా నిరసన కార్యక్రమాలకు హాజరైన మాజీమంత్రి విజయరామారావు, మాజీ ఎంపి రవీంద్రనాయక్, ఘన్‌పూర్ జాక్ చైర్మెన్ బెలిదె వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాలను పక్కతోవ పట్టిస్తూ కేవలం వారి రాజకీయ లబ్ది కోసమే జనగామ జిల్లాను తెరపైకి తెచ్చారని వారు ఆరోపించారు. దశాబ్దాల కాలం నుండి ఘన్‌పూర్ పాత తాలుకా నేటి వరకు వరంగల్ జిల్లాలోనే కొనసాగుతుందన్నారు. ఈ క్రమంలో ఈప్రాంతాన్ని వరంగల్ జిల్లానుండి వేరుచేసి నూతనంగా ఏర్పడుతున్న జనగామ జిల్లాలో కలపాలనే ఆలోచన ప్రజా వ్యతిరేఖమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజాప్రతినిధులు వెంటనే ఘన్‌పూర్, చిల్పూర్, జఫర్‌గడ్ మండలాలను వరంగల్ జిల్లాలోనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈప్రాంత ప్రజల అభీష్టాన్ని కాలరాస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఘన్‌పూర్ ప్రాంతాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని, లేని పక్షంలో ఇక్కడి ప్రజల ఆగ్రహాలకు ప్రజాప్రతినిధులు గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి భూక్య స్వామినాయక్, ఎంపిపి వంగాల జగన్మోహన్‌రెడ్డి, అఖిలపక్షం నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, చిగురువిజయ్, చిన్ని, కెసి జాన్‌బన్నీ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
జాక్ నాయకుల అరెస్టు..
మూడు మండలాలను వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహాదారిపై ఘన్‌పూర్ శివారులో ఉన్న బొంగుల మోరీపై బైఠాయించిన జాక్ నాయకులను స్థానిక సిఐ కిషన్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి పోలీసుస్టేషన్ తరలించారు. అనంతరం సొంతపూచికత్తుపై వారిని విడుదల చేసినట్లు జనగామ డిసిపి వెంకన్న తెలిపారు. అరెస్టయిన వారిలో ఘన్‌పూర్ జాక్ చైర్మెన్ బెలిదె వెంకన్న, నాయకులు నీల గట్టయ్య, కొలిపాక సతీష్, మారబోయిన ఎల్లయ్య, ఇషాక్, ఎంపిపి వంగాల జగన్మోహన్‌రెడ్డి, జడ్పిటిసి భూక్యా స్వామినాయక్, సానాది రాజు, రామకృష్ణలతో పాటు 20 మంది నాయకులు ఉన్నారు. జాక్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలను జనగామ డిసిపి వెంకన్న ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి సంఘటనలు జరుగకుండా స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఆయన వెంట ఖాజీపేట ఎసిపి జనార్ధన్, జనగామ ఎసిపి పద్మనాభరెడ్డితో పాటు ఘన్‌పూర్, మడికొండ, జనగామ, నర్సంపేట, ధర్మసాగర్ సిఐలు కాషన్, డేవిడ్‌రాజ్, శ్రీనివాస్, బోనాల కిషన్, రాజయ్య తదితరులున్నారు.