సాహితి

కవితా వాణి... ఆకాశవాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు ఎనిమిది దశాబ్దాలుగా తెలుగు ఆకాశవాణి వివిధ రంగాలకు తన వెలుగు పుంజాలను పంచుతోంది. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే రేడియో ప్రసారాలు భారతదేశంలో ఏమాత్రం ఆలస్యం కాకుండా మొదలయ్యాయి. రేడియో ప్రసారాలలో భాషాపరమైన వైవిధ్యం తొలిదశ నుంచే రేడియోలో ప్రతిఫలించడం మరో పోకడ! 1938 జూన్ 6న మద్రాసు ఆకాశవాణి మొదలైంది. అప్పటికి దేశంలో ఎన్నో రేడియో కేంద్రాలు లేవు. 1947 దేశ విభజన జరిగే సమయానికి ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో, మద్రాసు, తిరుచ్చిరాపల్లి - విడిపోయిన పాకిస్తాన్ ప్రాంతంలో పెషావర్, లాహోర్, ఢాకాలలో అనగా మొత్తం తొమ్మిది కేంద్రాలు ఉన్నాయి. తిరుచ్చిరాపల్లిలో 1939లో మొదలైంది. అనగా మద్రాసు దక్షిణ భారతదేశంలో తొలి ఆకాశవాణి కేంద్రం. అప్పటికి నైజాం రేడియో(1935), మైసూర్ సంస్థానం రేడియో (1935), తిరుణక్కూరు సంస్థానం రేడియో(1937) మాత్రమే ఉన్నాయి. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం రేడియో వ్యాప్తిని అధ్యయనం చేసి, తెలుగు ప్రసారాలను విజయవాడ నుంచి లేదా రాజమండ్రి నుంచి చేయాలని నిర్ణయించారు. చివరికి 1938లో మదరాసు నుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు ప్రారంభించారు. మదరాసు ఆకాశవాణి కేంద్రంలో తమిళం కన్నా తెలుగు ప్రసారాలే ఎక్కువనే విమర్శ మొదట్లో ఉండేదట. బహుశా ఈ రకమైన విమర్శల కారణంగానే కేవలం సంవత్సరంలోపు మరో రేడియో కేంద్రం తిరుచ్చిరాపల్లిలో ప్రారంభమైందేమో! మదరాసు ఆకాశవాణి తొలి రోజుల గురించి తెలుగు ప్రసారాల గురించి ఆచంట జానకిరాం గారి ‘‘సాగుతున్న యాత్ర’’ను సంప్రదిస్తే చాలా వివరాలు లభిస్తాయి. తెలుగు ఆకాశవాణి తొలి మాటలు (పరీక్ష ప్రసారంతోసహా) జానకిరాం గారివే! వారు తొలి తెలుగు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, తెలుగు రేడియో కార్యక్రమాలకు పునాదులు వేసిన శిల్పి! కర్నూల్ ప్రాంతపు భాగ్యనగర్ రేడియోకి సంబంధించిన వివరాలు కావాలంటే గడియారం రామకృష్ణ శర్మ ‘శతపత్రము’ - ఆత్మకథలో పొందవచ్చు. నైజాం రేడియో కానీ భాగ్యనగర్ రేడియోలో కానీ తెలుగు ప్రసారాలకు పరిమితులు ఉన్నాయి, సమాచార లోపం అధికంగా ఉంది. మదరాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోయినపుడు తెలుగు వారు మదరాసును కోల్పోయి ఉండవచ్చు. కాని మదరాసు నిజమైన తెలుగు నగరం. ప్రకాశం పంతులు అదే పేరుతో అప్పట్లో ఒక పుస్తకం రాశారు కూడా! తెలుగు పత్రికలూ, తెలుగు సినిమాలు మదరాసు నుంచే మొదలయ్యాయి. చివరికి 1995లో తెలుగు ప్రైవేటు టెలివిజన్ ప్రసారాలు మదరాసు నుంచే శ్రీకారం చుట్టుకున్నాయి. అందువల్ల మదరాసు నుంచే తెలుగు రేడియో ప్రసారాలు 1938లో ప్రారంభం కావడంలో ఔచిత్యం ఉంది.
విస్తరించిన తెలుగు రేఖలు
1938 జూన్ 16న మదరాసు తెలుగు ప్రసారాలు మొదలుకాగా 1948 డిసెంబర్ 1న విజయవాడ కేంద్రం మొదలైంది. 1950 ఏప్రిల్ 1నుంచి నైజాం రేడియో ఆకాశవాణిగా మారి పూర్తిస్థాయి తెలుగు ప్రసారాలతో సిద్ధమైంది. 1963లో కడప, విశాఖపట్నం కేంద్రాలు శ్రీకారం చుట్టుకున్నాయి. 1990 నుంచి అనంతపురం, కర్నూలు, తిరుపతి, మార్కాపురం, కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్ కేంద్రాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్ అంతకు ముందే ప్రారంభమైంది.
పనిచేసిన ప్రముఖులు... పాల్గొన్న పండితులు
ఆకాశవాణిలో పనిచేసిన ప్రముఖులైనా, పాల్గొన్న పండితులయినా మహనీయులే, సాహితీవేత్తలే! ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, కురుగంటి సీతారామయ్య, గోపిచంద్, కృష్ణశాస్ర్తీ, జాషువా, దాశరధి, జి.వి. కృష్ణారావు, లత, రావూరి భరద్వాజ, ఉషశ్రీ... ఇలా ఎంతోమంది ఆకాశవాణిలో ఉద్యోగులుగా పనిచేశారు. రేడియో కార్యక్రమాలలో పాల్గొన్న వారు ఎంతమందని చెప్పడం? రేడియోలో పాల్గొనని పండితులు లేరంటే అతిశయోక్తి కాదు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ గారి వచన రచనలు, రూపకాలు అన్నీ రేడియో కోసం రాసినవే! గోరాశాస్ర్తీ నాటికలు అన్నీ ఆకాశవాణి కోసం సృజించినవే! సాహిత్య శిల్పులంతా ఆకాశవాణిలో అంతర్భాగం కావడంతో - రేడియో కార్యక్రమాలు వస్తు విషయంలో గాని, వ్యక్తీకరణ విషయంలోగాని గొప్పగా భావించాయి.
నిజానికి రేడియో ప్రసారాలకు సంబంధించి సమస్య ఏమిటంటే - సాంకేతికపరమైన అవరోధాల కారణంగా, (దాసుకోవడానికి గానీ, మరలా వినియోగించడానికి గానీ) ఎక్కువ మంది మళ్ళీ పొందలేరు. స్పందించిన అంశంలోని తీరు, లోతు బోధపడితే కానీ - పరిశీలంచే వారిలో తీక్షణత పెరగదు. బోధపడి పరిశీలించాలంటే అది అసలు లభ్యం కాదు. ఈ కారణంగా రేడియో కార్యక్రమాలపై అధ్యయనం, పరిశీలన దాదాపు శూన్యం. దేవులపల్లితోపాటు ఆయన సమకాలీన కవులందరూ సినిమా రచన చేశారు. అయితే రాణించిన వారు బాగా తక్కువ. సినిమా గీత రచనలోని మర్మం ఎరిగిన చతురుడు కృష్ణశాస్ర్తీ. దీనికి పునాది ఆయన అప్పటికే రేడియో లలిత సంగీతం, రూపకం, నాటిక వంటి ప్రక్రియలను ఔపోసన పట్టడమే కాదు - వాటిపై విశేష అధికారం సాధించడం. దువ్వూరి వెంకటరమణ శాస్ర్తీ, ‘జానకితో జనాంతికం’ అనే వాక్చిత్రంలో రేడియో మాటకుండే విశ్వరూపం చూపిస్తారు. ఇంత గొప్పగా ఒక మాధ్యమాన్ని ఉపయోగించుకుని కొత్త సాహితీ ప్రక్రియను మలచవచ్చునా అనే సందేహం కలిగిస్తారు.
మహానుభావులు అలవోకగా కలం కదిపినా సాహితీ శిల్పాలుగా మిగిలిపోతాయి. బుచ్చిబాబుగారి నవల ‘చివరకు మిగిలేది’ని నాటకంగా పాలగుమ్మి పద్మరాజు ఒక గంటకు కుదించి అద్భుతమైన రేడియో అనుసరణగా సృజించారు. నగ్నమునికి ఎంతో పేరు తెచ్చిన ‘కొయ్యగుర్రం’ దీర్ఘ కవితను హైదరాబాద్ ఆకాశవాణి కోసం రాయించారు రావూరి భరద్వాజ. నగ్నముని కొయ్యగుర్రం ఆకాశవాణిలో ప్రసారమై, తర్వాతనే అచ్చురూపం ధరించింది. బహు సంతానంగల గృహస్తు బస్సు నుంచి పిల్లలను దింపుకోవడంలోని కష్టాలను మాటల బొమ్మల ద్వారా చిత్రించిన మధురాంతకం రాజారాం కథ కుటుంబ నియంత్రణా సందేశపు పరమార్థాన్ని మహా చక్కగా శిల్పించింది. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవలను రేడియో నాటకంగా మలచింది నగ్నముని! వారు రేడియో నాటక కళాకారుడిగా కూడా గ్రేడు పొందిన రచయిత. కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ నవలను విశాఖపట్నం కేంద్రం నాటకంగా మలచి అవార్డు పొందితే, హైదరాబాద్ ఆకాశవాణి (పాపినేని శివశంకర్) ‘చివరి పిచ్చుక’ కథను రూపకంగా మలచి బహుమతి పొందింది. గురజాడ వారి ‘కన్యాశుల్కం’, చిలకమర్తి వారి ‘గణపతి’ చలం సృజించిన ‘పురూరవ’ ముద్దుకృష్ణ ‘అనార్కలి’ ఇలా ఎన్నో ఆకాశవాణి ద్వారా వాయుతరంగాల నెక్కి చదువలేని వారిని సైతం చేరిన సాహితీ సృజనలు కోకొల్లలు. ఎస్వీ భుజంగరాయ శర్మ రూపకాలు, ప్రసంగాలు; ఉషశ్రీ ధర్మసందేహాలు; దేవులపల్లి వారి లలితగీతాలు, రూపకాలు; గోరా శాస్ర్తీగారి నాటకాలు - ఇలా వీరంతా ఆకాశవాణి కోసమే ఈ సాహితీ సృజన చేశారు. కరుణశ్రీ పద్యాలు ఘంటసాల మనోహరంగా పాడగా ఆకాశవాణి ద్వారా ఎంతప్రాచుర్యం పొందాయో తెలియనిది కాదు. విజయవాడ ఆకాశవాణి చర్చా కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయం భాషా సంబంధమైన విషయం మీద పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక అప్పటి సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు విశ్వనాథ వారి వాదను విభేదిస్తూ మరుసటి రోజు ప్రధాన సంపాదకీయం రాశారు. గుంటూరు రఘురాం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రసంగాల విభాగం పర్యవేక్షిస్తున్న కాలంలో ఉగాది కవి సమ్మేళనంలో చదివిన కవితలను పండుగ రోజున ప్రతి దినపత్రికా ఒక్కోటి ప్రచురించేది. ఇప్పటికీ ఆకాశవాణి కవి సమ్మేళనాలకు ప్రాచుర్యం ఉంది.
ఎన్ని ప్రక్రియలు? ఎంత వైవిధ్యం?
రేడియోలో బొమ్మలుండవు. కనుక అవి కదిలేవా, కదలనివా - అనే సందేహం రాదు. కేవలం మాట (శబ్దం) లేదా వౌనం. శబ్దాలను ఆకర్షణీయంగా మేళవిస్తే సంగీతం. కనుక ఈ పరిధిలోనే మాటల నృత్యం సాగాలి. అయితే ఈ నేర్పరితనం అనేది అక్షరాస్యత, నిరక్షరాస్యత అనే విభజన, అవరోధం దాటి మరింత సార్వత్రికతను సాధించే రేడియో సందర్భమిది - అందువల్లనే రేడియో ప్రక్రియలో విజయం సాధించినా సాహితీవేత్తా, కళాకారుడూ ఎక్కడైనా నెగ్గుకొస్తాడని పేర్కొనడం. రేడియోలో ప్రసంగం అనే ప్రక్రియ బహుళంగా తారసపడుతుంది. ఎందుకంటే ఇది చాలా సరళమైందీ, అందరూ కొద్దో గొప్పో ఎరిగినదీ కావడం! అంతే అలవోకగా ప్రవేశించింది కవిత్వం. ఆకాశవాణి కవికి కవితా శ్రోతలు అపురూపంగా ఉంటారు! రేడియో నాటకం ప్రయోగం రంగస్థలం నుంచి స్వీకరించింది, అయితే భావనాపరమైన స్థాయిలోనే కొంత సర్దుబాటు, తత్ఫలితంగా ఒక్కోసారి అద్భుతంగా సాధ్యమయ్యే సృజన తప్పవు. ఇదే విషయం అన్ని రకాల సంగీతాలకూ వర్తిస్తుంది. వార్తలు, సమీక్షలు, ప్రత్యక్ష వ్యాఖ్యానాలు కూడా మనకు బాగా తెలిసిన ప్రక్రియలే; రేడియోలో ఇవి మరింత ప్రొఫెషనల్‌గా, ప్రభావవంతంగా మారుతాయి. ఎంతమంది కవులు, గాయనీ గాయకులు సర్వకర్తలకు ఆకాశవాణి లలిత సంగీతం ప్రాణం పోసింది? ఒక దశలో లలిత సంగీతం సినిమా పాటను ఢీకొంది, స్ఫూర్తి అయ్యింది. ఒక దశలో సినిమా పాటలను ఆకాశవాణిలో నిషేధించారు.
కవిత్వం... కవి సమ్మేళనం
ప్రతి రెండో వ్యక్తి తెలుగునాట కవిత్వం రాస్తారంటారు. ఇది ఎంత నిజమో - కవిత్వం రాయగలనని భావించే ప్రతి వ్యక్తి రేడియోలో కనీసం ఒకసారయినా కవిత చదివి ఉండకపోడు. విజయవాడలో, హైదరాబాద్‌లో పత్రికల కార్యాలయాలు ఉండటంతో ఆ నగరాల వ్యక్తులకే ప్రాబల్యం (పత్రికలలో) ఉంటుందనే అభిప్రాయం ఎంతో కాలంగా ఉంది. పనె్నండు ఊళ్లలో - మార్కారం, ఆదిలాబాద్ సహా - రేడియో కేంద్రాలున్నప్పుడూ, అవి అన్నీ కవిత్వం ప్రసారం చేస్తున్నపుడు అవకాశం అందరికీ వస్తుంది. ఎనిమిది దశాబ్దాల తెలుగు రేడియో ప్రస్థానంలో లెక్కకుమించి కవితలు ప్రసారమై ఉంటాయి. అయితే కవి ఆకారం, దుస్తులు, చేతులు తిప్పడాలు వంటివి రేడియోలో కనబడవు. ఈ వైవిధ్యం అంతా గొంతులోనే మేళవించిన కవి రేడియోలో ఖచ్చితంగా విజయుడే! ఉగాది, సంక్రాంతి, దీపావళి, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే సందర్భాలకు ఆకాశవాణిలో కవి సమ్మేళనం తప్పనిసరి అనే రీతిలో అలవాటైపోయింది. లెక్కకు మించిన సంఖ్యలో కవులు తమ కవితలను రేడియోలో చదివి తరువాత తమ సంకలనాలలో చేర్చారు.
కొన్ని రాష్ట్రాలలో రేడియో కవిత్వం అని వేరుగా ఉందా అనే చర్చ సీరియస్‌గానే జరిగింది. వౌలికంగా రేడియో మాధ్యమానికి ఉండే పరిమితులు కవిత్వానికి కూడా వర్తిస్తాయి. ఈ విషయం తెలుగు సాహితీ మేధావుల దృష్టిలో పడలేదు. 1956 జనవరి నుంచి ఆరు దశాబ్దాలు మించి నిరంతరాయంగా జరుగుతున్న విలక్షణమైన చరిత్ర గలది జాతీయ కవి సమ్మేళనం. రాజ్యాంగంలో గుర్తించబడిన ప్రతి భాష నుంచి ఒక్కో కవి ఎంపికై తన కవితను రిపబ్లిక్ డే ముందు రోజు రాత్రి కవి సమ్మేళనంలో చదువుతారు. ఇలా ఎంపికైన ప్రతీ కవీ అదేరోజు అనువదింపబడి, ఆయా భాషల ప్రజలను చేరుతుంది. ప్రస్తుతం ఇరవై రెండు భాషలు (హిందీలో ఇద్దరు కనుక) ఇరవై ముగ్గురు కవులు. లక్ష్యభాష చేరాలంటే మధ్యలో హిందీ, ఇంగ్లీషు మజిలీలుంటాయి. కనుక జాతీయ కవి సమ్మేళనానికి ఎంపిక కావడం కానీ, ప్రతి ఏటా జరిగే కవిత్వ అనువాద కార్యక్రమంలో అవకాశం దొరకడం కానీ నేటికీ ఆకర్షణగా ఉంది. అలా పాల్గొన్న కవి తనకు తాను ‘జాతీయ కవి’ అని రాసుకోవడం కూడా ఇటీవలి కాలంలో పెరిగింది. దీన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రకాశం జిల్లాకు చెందిన నాగభైరవ కోటేశ్వరరావు. ఇలా సంగీతం, ఇతర కళారూపాలు, వ్యవసాయం, నాటకం వంటి ఇతర రంగాలకు ఆకాశవాణి చేసిన దోహదం విశేషమైంది, విలక్షణమైంది!!

- డా. నాగసూరి వేణుగోపాల్ 09440732392