సాహితి

ఆణిముత్యం ‘అల్లాకే ఫకీర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవులు, రచయితలు నిరంకుశులు. వారు తాము సత్యమని నమ్మినదాన్ని ఎవరికెంత ఆగ్రహం వచ్చినా పట్టించుకోకుండా తమ రచనల ద్వారా ప్రకటిస్తారు. ఎవరి మెప్పుకోలో, ఎవరి పొగడ్తలందుతాయనో, ఇలా రాస్తేనే ఉత్తమ కథగా ఎంపికవుతుందనో, అవార్డులువస్తాయనో రాసేవారు గాలి ఎటువీస్తే అటు కొట్టుకుపోయే వ్యక్తిత్వం లేని వుట్టి రచయితలు. అసలైన రచయితలు గాలి దిశను నిర్దేశిస్తారు, విశ్వనాధ సత్యనారాయణ రచించిన ‘అల్లాకే ఫకీర్’ ఇలాంటి నిక్కచ్చి నిర్మొహమాటమైన వ్యంగ్యాత్మకమైన కథ.
సాధారణంగా మన చరిత్ర పుస్తకాలలోను, వాటి ఆధారంగా సృజించిన నవలలు, కథలు, నాటికలు, సినిమాలలోను సుల్తానులు పరమత సహనం కల గొప్పవారిలా, ప్రేమికుల్లా చూపించడం ఆనవాయితీ. సుల్తానులలోని ఇలాటి ఒకటో రెండో లక్షణాలను పెద్దవి చేసి చూపి ఆయా సుల్తానుల దుశ్చర్యలు, పైశాచిక కృత్యాలను కప్పిపుచ్చటం పరిపాటి. అందుకే మన ప్రజల దృష్టిలో అక్బర్ సలీమ్ అనార్కలి, బాబరు ప్రేమకథ, తాజ్‌మహల్ కథ, జోధా అక్బర్‌ల ప్రేమకథవంటి కథలకే పరిమితమైంది తప్ప ఆయా సుల్తానుల పరమత సహనపు ఇమేజీ ప్రేమ గాథల ఇమేజీ వెనుక దాగిన పైశాచికత్వం వైపుకుపోదు. ‘అల్లాకే ఫకీర్’ కథ ద్వారా విశ్వనాథ, సుల్తానులకు మన చరిత్రకారులు ఆపాదించిన ఇమేజీపై వ్యంగ్యాత్మకమైన విసురు విసిరారు.
మనుషులు ఎలా చచ్చినా పట్టించుకోని నవాబుల నడుమ తన బండికింద పడ్డ కుక్కను చూసి జాలిపడి వైద్యం చేయిం చి అది చస్తే సమాధి కట్టించి దయార్ద్ర హృదయుడు జైనూల్ వహిద్దీన్. ఆయన కవులను గౌరవించేవాడు. దాంతో అతడిని అందరూ పొగిడేవారు. మహమ్మద్ అవతారం అని పొగిడేవారు దాంతో ఎవరైనా అతనిలో క్రౌర్యం ఉందన్నా ప్రజలు పట్టించుకునేవారు కాదు. అలా అన్నవారికి శాస్తి చేసేవారు. అలాంటి సుల్తాన్, రామ్‌సింగ్ అనే జాగీర్దార్‌ను రాజధానికి పిలిపిస్తాడు. కొన్నాళ్లకి రామ్‌సింగ్‌కి తన జాగీరును సుల్తాన్ లాక్కున్నాడని తెలుస్తుంది. ‘అదేమిటంటే’? వినేవాడు ఉండడు. ఇంకొన్నాళ్లకి అతడి భార్య సుల్తాన్ జమానాలో చేరిందని తెలుస్తుంది. రామ్‌సింగ్ అరచి గీపెడతాడు. నిండు సభలో సుల్తాన్‌ను తిడతాడు. ‘నమక్ హరామ్’ (నమ్మక ద్రోహి), ఔరత్‌కా డాకూ (స్ర్తిలను అపహరించే దొంగ) అంటు దూషిస్తాడు. అప్పుడు షాహి కన్నుల్లో నిప్పులు కక్కాడు అని వర్ణిస్తాడు రచయిత. అతని ఎర్రబడ్డ కళ్లను కవులు ఎలా వర్ణిస్తారంటే ‘అతని కనులు ఇంద్ర నీలపు మణులవడం చేత కొరివిగా వున్న రామ్‌సింగు ఆ కన్నులలో ప్రతిఫలిచి ఆ కళ్లు అట్లా కనిపించాయే కానీ, హిమానీ బిందు తిరస్కారులైన ఆ కళ్లల్లో అసలు నిప్పులెట్లా వుంటాయని’ అన్నారు. ఆ తరువాత రామ్‌సింగు షాహీని తిట్టుకుంటూ పిచ్చివాడిలా వీధుల్లో తిరుగుతున్నాడన్న వార్తలు వ్యాపిస్తుంటాయి. నిజానికి రామ్‌సింగు కోటలో చీకటి కొట్టంలో బంధితుడై ఉంటాడు. ప్రతి సోమవారం సుల్తాన్ వెళ్లి ‘నీకేం అపకారం చేశాను?’ అని అడుగుతాడు. రామ్‌సింగు తిడతాడు. షాహి కోపం పట్టలేక కొరడాతో కొడతాడు ఇలా కొన్ని సోమవారాలైన తరువాత షాహి ‘సోమవారమన్నా తుడుచుకుపోవాలి, రామ్‌సింగన్నా పోవాలి’ అని నిర్ణయిస్తాడు. సోమవారాన్ని నిషేధించి ఆదివారం, సోమవారాలను కలిపేస్తాడు. సోమవారాన్ని చిన్న ఆదివారం అంటారు. కానీ సోమవారం ఎటూ పోదు. దాంతో రామ్‌సింగే పోవాలని నిర్ణయిస్తాడు. కొరడాతో కొట్టి చంపేస్తాడు. రామ్‌సింగు మరణం తరువాత మళ్లీ సోమవారం సోమవారం అవుతుంధి. షాహి ఢిల్లీనుండి మక్కాకు, రామేశ్వరంనుండి కాశీకి రోడ్లు వేయించి, పక్కన చెట్లు వేయిస్తాడు. అందరూ షాహిని పొగుడుతారు. ‘లోక బంధువు జగదుద్ధారకుడు! మహా దైవభక్త పరాయణుడు!! అల్లాకే ఫకీరు!!!
ఇదీ ‘అల్లాకే ఫకీరు’ కథ. ఈ కథ పరమాద్భుతమైన వ్యంగ్యాన్ని అణువణువునా పొదుగుకున్న కథ. కథ ఆరంభమే ‘షాహి’ గొప్పదనం, సద్గుణాలు ప్రజలు అతడిని దైవ సమానుడని పొగడడం వంటి విషయలను చెప్పిన రచయిత, షాహి రామ్‌సింగు జాగీర్దారును కాజేసిన విషయాన్ని ఎంత సున్నితంగా, పరోక్షంగా చెప్తాడంటే కథను ‘మూడోవ్యక్తి’ చెప్తున్నా అది సుల్తాను పక్షంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ రామ్‌సింగుకు జరుగుతున్న అన్యాయం పాఠకుడికి తెలుస్తుంటుంది. కానీ ఆ అన్యాయం వల్ల రామ్‌సింగు ఎంత బాధపడుతున్నాడో అన్న విషయం గురించిన కన్నీళ్లు కార్చేట్టు వర్ణనలు వుండవు. ఎందుకంటే రచయిత లక్ష్యం నిజాన్ని స్పష్టంగా చెప్పకుండా నిజాన్ని చూపిస్తూ ఆ నిజాన్ని ఎలాగ చరిత్రకారులు కళాకారులు రంగుటద్దాల విమర్శకులు వక్రీకరించి సమాజంలో ఒక అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తున్నారో ప్రదర్శించడం. కానీ తాను చెప్పదలుచుకున్న దాన్ని పాఠకుల హృదయాల్లో స్థిరపడేలా వ్యంగ్య ప్రదర్శన ఉంటుంది. కథలో రచయిత ఎక్కడా షాహి చెడ్డవాడని అనడు. షాహిని దూషించేది రామ్‌సింగ్ మాత్రమే. కానీ రామ్‌సింగ్ కథ చెప్పడం వల్ల షాహి ఎంత క్రూరుడో, ఎంత నీచుడో పాఠకుడికి అర్ధమవుతుంది. కథలో రామ్‌సింగ్ షాహిని తిడతాడు. రచయిత మాత్రం వాళ్లింత పొగిడారు, వీళ్లింత పొగిడారు అని పొగడ్తలు చెప్తాడు. చివరకు అందరూ పొగిడే పొగడ్తలతో కథ పూర్తవుతుంది. కానీ పాఠకుడికి ఆ పొగడ్తల వెనుక వున్న అబద్ధం అర్ధమవుతుంది. అత్యద్భుతమైన రచన సంవిధానం ఇది. ఈ కథ మన చరిత్రలో దుష్టరాజుల క్రూర చర్యలు, నైచ్చులను వదిలి కేవలం వారు ఓ పన్నును తొలగించారనో, హిందూ మహిళలను వివాహమాడి వారిని కృష్ణ పూజ చేసుకోనిచ్చారనో, వారిని పరమత సహనం కల గొప్పరాజులుగా చిత్రించడం ప్రచారం చేయడం పట్ల అతి భయంకరమైన విసురు! తమను వ్యతిరేకించినవారి చర్మం వొలిపించడం, వేడినీళ్లలో ఉడికించి చంపడం, వారి భార్యలను, కూతుళ్లను ఎత్తుకొనిరావడం వంటి దుశ్చర్యలను ప్రస్తావించకుండా కేవలం మంచినే ప్రస్తావించి రాక్షసుల్లాంటి రాజులను గొప్పవారుగా ప్రచారం చేయడంపట్ల విమర్శ ఇది.
ఇదే కథను విశ్వనాధ సుల్తాను బదులు ఏ జమిందారో, తన దగ్గర పనిచేసేవాడి భార్యను ఎత్తుకుపోయినట్టు రచిస్తే ఇది గొప్ప అణచివేతను ప్రదర్శించిన అతి గొప్ప కథ అయి ఉండేది. రామ్‌సింగు రహీము అయివుంటే మైనారిటీల అణచివేతను ప్రదర్శించిన అభ్యుదయ కథ అయివుండేది. అయితే విశ్వనాధ పొలిటికల్లీ కరెక్టు కథ రాయలేదు. నిజాన్ని నిక్కచ్చిగా చూపే కథ రచించాడు. ఎందుకంటే ధనవంతులు, పేదలను అణచినట్టు చూపితే వారి సిద్ధాంతం నిలుస్తుంది. గొప్ప సామాజిక స్పృహ అది. ఈ దేశంలో మైనారిటీలను మెజారిటీ అణచివేస్తున్నారని, మైనారిటీలు భయభ్రాంతులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని చూపిస్తే అది పొలిటికల్లీ కరెక్టు మైనార్టీ కథ. అంతేకానీ సుల్తానుల అకృత్యాలు, వారి మత ఛాందసం, నీచ ప్రవర్తన చూపితే లౌకిక సాహిత్య, లౌక్య ప్రపంచం ఎలా భరిస్తుంది? అలాకాక విశ్వనాధ తాను రాయాలనుకున్నది రాశాడు. అందుకే ఈ ఆణిముత్యం లాంటి కథను ఎవ్వరూ ప్రస్తావించరు!

- కస్తూరి మురళీకృష్ణ