సాహితి

కనిపించని కలవరం - సమకూడిన కూజితం(శ్రీవిరించీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైలు కంపార్ట్‌మెంట్‌లో ఒక బెర్త్ అంతా ఆక్రమించుకుని కూర్చున్నాడు డాక్టర్ రాజారావు. అయితే పక్క స్టేషన్‌లో ఎక్కిన ‘రాత్రంతా నిద్రలేక ఎర్రబారిన కళ్ళలో కనిపిస్తున్న దీనత్వం, అసహాయత్వం, తోటి ప్రయాణికుల రాతి గుండెలూ’ చూచి సత్యవతికి చోటు ఇచ్చాడు తన పక్క చుట్ట కొంచెం జరిపి. ఆమె మదనపల్లి క్షయ ఆస్పత్రినుంచి వస్తోందనీ, ఇంకా రోగం పూర్తిగా నయం కాలేదని తెలుసుకుంటాడు. తీరా అతను దిగవలసిన మదరాసు స్టేషన్ రాగానే, ఆమెను చూస్తే తీవ్రమైన జ్వరంతో తెలివి తప్పి నిద్రపోతూ వుంది. ఆమెను అలా వదిలేయడం ధర్మం కాదని తన నర్సింగ్ హోమ్‌కు తీసుకువెళ్లి వైద్యం మొదలుపెడతాడు. ఆమెతో మాట్లాడిన తరువాత పూర్తి వివరాలన్నీ తెలుసుకుని, అసిస్టెంట్ డాక్టర్ సంజీవరావు లేడు గనుక తనే స్వయంగా అన్ని వైద్య సదుపాయాలు చేసి, ఆమెకి ‘బతుకు’ మీద ధైర్యం చెబుతూ ఊరడిస్తాడు. ఆమెపట్ల అతనికి మక్కువ, ప్రేమలాంటి భావం కలిగాయని అతనికి స్పష్టంగా తెలియదు. ‘ఆమె మాటల్లో, కళ్లల్లో ఎందుకో అంత విరక్తి ఆమెకు జీవితంమీద’’ అని ఆశ్చర్యపోతాడు.
‘సౌరీస్’ వ్రాసిన ‘నీతిగల మనిషి’ కథలో పాత్రలు యివన్నీ. 1940-50 సంవత్సరాల మధ్య చాల కథలు, నవలలు రాసిన సౌరీస్ దైహిక ప్రేమజ్వాలల నుంచి దైనిక భక్తి సీమలకు ప్రయాణం చేయడం, సాక్షాత్తు ఈశ్వర సాక్షాత్కారం పొందానని ప్రకటించడం- చరిత్రలో లిఖితమయిన విషయాలు. ఆమె రచనలలో మానవత విలువలు, మనుషుల మధ్య తప్పనిసరిగా వుండవలసిన అనురాగ ఆత్మీయతలు, జీవితాన్ని సార్థకం చేసుకుందుకు అవసరం అయిన సామాగ్రిని సంతరించుకునే పద్ధతులు అంతర్లీనంగా అవతరిస్తూ వుంటాయి.
డాక్టర్ రాజారావు రక్షణలో ఆమె ఆరోగ్యాన్ని పొంది, అతనికి - అతని భార్యకు మరింత దగ్గర అవుతుంది. అతని కూతురు వివాహానికి ఆమెను ఆహ్వానించినప్పుడు, ఆమె చెప్పిన మాటలలో మరిన్ని విషయాలు తెలుసుకుంటాడు. ‘కుల భేదం లేకపోవచ్చు. కానీ నీతి అవినీతి అనే భేదం వుందనుకుంటాను. లోకం ముందు నేను నీతి లేనిదాన్ని.. నీతిని వదులుకున్న మనుషులంటే మాలవాడికన్నా నీచం ప్రజల దృష్టిలో. అధమాధములకి కూడా లోకువే!’ అంటుంది ఆమె. అతను ఈ మాటలకు దెబ్బతిని, ఆమెతో చొరవగా వుండడం తగ్గించివేస్తాడు. పైగా అసిస్టెంట్ సంజీవరావు ఆమెకు ఎక్కువగా దగ్గర అవుతున్నాడని గ్రహించి అతన్ని మందలిస్తాడు. ఆమె- పూర్తిగా నయం అయింది గనుక, ఆస్పత్రి నుంచి వెళ్లిపోతానన్నపుడు మళ్లీ రాజారావులో కలవరం బయలుదేరుతుంది. సంజీవరావు కారణంగా ఆమె వెళ్లిపోతున్నదేమోనని సందేహించి ఆమెతో సూటిగా మాట్లాడుతాడు. రాజారావు, సంజీవరావుతో ఆమెను గురించి చెప్పిన ‘చెడ్డ’ మాటలన్నీ ఆమె నోటి మీదుగా తెలుసుకుని కించపడతాడు. ‘నా దేహాన్ని మీరు బతికించారు. నా ఆత్మకి, హృదయానికి, రోగంతో కానీ మీ రక్షణతో కానీ ఏం సంబంధం?’ అని ఆమె ప్రశ్నిస్తుంది. అతని వ్యక్తిత్వాన్ని కదిలించే మాటలు కూడా చెబుతుంది. ‘మీ మడికట్టుకున్న మనసు ఎంత ఇరుకో? చదువుకున్నవారు, స్ర్తి- పురుషుడితో చనువుగా వుందనగానే, మీ నీతికి ఎక్కడ అపచారం జరుగుతుందోనని మీరు పడ్డపాట్లు తలుచుకుంటే నవ్వొస్తుంది నాకు’ అంటుంది. తనను గురించి ఆమె యింకా యిలా స్పష్టపరుస్తుంది. ‘నీతి లేకపోవచ్చు కాని అభిమానం, ఉన్నత సంస్కారం, విజ్ఞానం, అనుభవం లేవనుకున్నారా నాకు? మగాడితో మాట్లాడగానే అతన్ని వరించినట్లేనా? ఇదేనన్నమాట జీవితం మీకు నేర్పింది? భర్త అదుపాజ్ఞల్లో వుండే పతివ్రతలు, లోకం ఎరగని అమాయకమయిన కన్యలు, అట్లా ప్రవర్తించేది. నాలాంటి స్ర్తిలు కాదు’.
‘నీతిని మించిన ప్రేమబలంతో- మిమ్మల్ని ఆస్పత్రినుంచి వెళ్లనివ్వను అంటాడు రాజారావు. నా విద్యనీ, నా చాతుర్యాన్ని ఉపయోగించి, మృత్యువునుంచి రక్షించుకున్నాను మిమ్మల్ని. మీరు వెళ్లిపోతే నా జీవితం శూన్యమయిపోతుంది’ అంటాడు దీనంగా. ఆ మాటలతో ‘నవ్వుతున్న ఆమె కళ్లు నీళ్లతో నిండాయి’. అతన్ని దగ్గరగా తీసుకుంటుంది సత్యవతి. నీతి-ప్రేమ- హృదయం అనే వాడుక మాటలకు అసలయిన అర్థాలను ప్రతిపాదిస్తూ, చదువరులలో కొత్త జీవిత సరళిని ప్రవేశపెట్టే రుూ కథానిక, ఒక నవ్య వీణానాదం.

- శ్రీవిరించి, 9444963584