సాహితి

వెతుకులాట! (కవితలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెతుకుతున్నా
ఏదో పోయిందని కాదు
ఏదైనా దొరుకుతుందేమోనని!
అదేదైనా కావచ్చు
జారిపోయిన జ్ఞాపకమో
పైలా పచ్చీసు నాడు
ఒడిసి పట్టలేని వాల్చూపో!
పోతు పోతు ఎవరో ఒకరు
విసిరేసిన జ్ఞాన శకలమో
జీవన భాష నెరిగిన వారు
ధారబోసిన పిడికెడు ఆనుభవాలో
అంతా ఒకే దగ్గర దొరకడానికి
అనుభవాలకు బిగ్ బజార్లుండవ్
మనమేమైనా కదలని కొండలమా
దేనికీ కరగని బండలమా?
కదలాలి అవసరమైతే కరగాలి!
నేను వాక్యాన్ని కదా
నాకు విరామం తప్ప విరమణ ఉండదు!
ఈ అనే్వషణ నాతో మొదలా?
కొలంబస్ ప్రతి మనిషిలో ఉంటాడు!
సముద్రం తలవొంచాలంటే
శోధనా తెరచాపలెత్తాల్సిందే!
వెతకటమూ ఒక ప్రయాణమే
తెరచాప చినిగిందా
జీవన కావ్యానికి శుభం కార్డు పడ్డట్లే!
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి
9440233261

రంగులు
పంచుకునేందుకే..
మనసెందుకో ఇవ్వాళ
మాటల గారడీ చేస్తోంది
మనోఫలకంపై ఏర్పడిన
చిత్రానికి రంగులద్దుతోంది
నలుపు తెలుపు చిత్రాల్ని
అలవోకగా సప్తవర్ణాలుగా
మార్చి చూపి మురుస్తోంది
వర్షించే మేఘంలా కదం తొక్కుతోంది

ఒక కాపీ తీసుకోని
దాచుకుందామన్న నా కోరికకి
తూట్లు పొడుస్తూ
నవ్వులాటలాడుతూ చూస్తోంది
రంగు వెలసినట్లుగా అనిపించి
నన్ను అపహాస్యం చేస్తోంది
ఏమిటని ప్రశ్నించేలోపు
మాయమై మర్మంగా దాక్కొంటోంది

కనిపించే ఆ రంగులేవైనా
నీకే కాని లోకం కోసం కాదని
నీకు నీవుగా నిలబడమంది
పదుగురికి పంచటానికి
ఇంకేమీ మిగలనట్లు
పిచ్చిగీతల్ని ముద్రిస్తోంది
నీవెర్రిగాని నీకేం కావాలో
నీకే తెలియదని మందహాసంతో
ఇంద్రధనుస్సుగా మారి
ఆకాశాన్ని నింపేసింది

నలుగురితో పంచలేని
రంగులేవైనా నాకక్కరేదని
వెనక్కి పంపాను
నిర్మొహమాటంగా..
- జంధ్యాల రఘుబాబు