సాహితి

శబ్దమే కావ్యాత్మకు ప్రతిరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలకక్షరాలే అదృశ్యమైపోతున్న నేటి కాలానికి ప్రామాణికమైన నిఘంటువులూ క్రమక్రమంగా కనుమరుగౌతూ సరికొత్త సంక్షిప్త రూపంలో సాక్షాత్కరిస్తున్నాయి. తదనుగుణంగానే పదాలు తగ్గిపోతూ వున్నాయి. వ్యవహారంలో సైతం అర్థరహిత పదాలు, పదబంధాలు వచ్చి వాలుతున్నాయి. వ్యాకరణమొప్పని మాటల దాడికి దేహభాగాలు అస్తవ్యస్తవౌతున్నాయి. ఎప్పటికప్పుడు ఉన్న మాటలతోనే పని కానిచ్చుకుందామనే కొంచెతనానికి అలవాటుపడిపోతున్నాం. ఆభిజాత్య భావమునంటరాని దానిని జేసి తేలిక వనరులను తెగగుచ్చుకుంటున్నాం. భాషాశీలాన్ని భగపరచుకుంటు వెలిచవి వాగుడ్ని ఇష్టపడుతున్నాం. జీవన విధానమెంత పలుచబారినదో జీవభాషయు అంతేయైనది. కారణం జీవన విధానం భాషనుచ్చరించును. ఉచ్చరించిన భాష ఊరేగును. అంతియే! ఆపైన ‘కెవ్వు కేక’.
ఒక శబ్దం పుట్టు పూర్వోత్తరాలను పరిశీలిస్తే దాన్ని పరిభాషించటానికి విజ్ఞులు భయపడతారు. భయపడటమంటే ప్రయోగౌచితిని గురించిన ప్రతిపత్తి. ‘‘వా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితమ్; మానం వ్యాకరణం కృత్స్నమ్ అనేక బహుధా శ్రుతం.. నముఖే నేత్ర యోర్వాసి.. అదిస్తరమ్ అసందిగ్ధం.. సంస్కార క్రమ సంపన్నాం’’.. ఇత్యాది వచస్సంస్కారంగా ఎదుటివాడితో ఎలా మాట్లాడాలో - అందున్న శబ్ద ప్రాముఖ్యమెంతో; సంస్కార ప్రతిపాదిత ఔచిత్యమెంతో తెలియజేస్తుంది. ఇంత తెలిసి శబ్దప్రయోగం జరగాలన్నది మెడమీద తల- తలలో మెదడు మెదడులో వివేచన- వివేచనలో పరేంగితజ్ఞానం గలవారి హృదయఘోష- మనోభిలాష. శబ్దానికి వేదోద్భవకాలం నుండి పరమోద్దిష్ట స్థానం ఇవ్వబడింది. ఒక్కొక్కసారి అది పరమాత్మకు పర్యాయంగా వాడబడింది.
పూర్వం ఈ శబ్దాన్ని చూచి వివేకవంతులు అనుశీలనాత్మకులయ్యారు. మహితాత్ముడయిన వాల్మీకి సైతం ఆ పదాన్ని తాను వాడుకోలేదు. కాళిదాసు ఈ శబ్ద తత్త్వం తెలిసినవాడు కనుకనే ‘‘మందః కవి యశః ప్రార్థీగమిష్యామ్యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలేలోభాత్ ఉద్యాహురివ వామనః’’ అన్నాడు. కవి అనిపించుకుంటానికి ప్రతివాడు ఎగబడటం పొడుగువాడు అందదగిన పండును పొట్టివాడు ప్రలోభానికి లొంగి చేతులు చాచినట్లు అని దీనర్థం. ఐతే మన నాగరికత విలిసిల్లి విస్తరిల్లి వ్యక్తి ఉపాధి కేవల సమీరాశ్రీతమై ప్రజాస్వామ్యమనే అవకాశపు అంగవస్త్రాన్ని ధరించి మాట్లాడే నాలుకున్న ప్రతిగోడమీద పిల్లి కవియై సుకవితాలలామ సూక్ష్మ దేహాన్ని తూట్లు పొడుస్తుంటే చదువొచ్చినందుకు ఆ అచ్చుపోతల్లో పడి కొట్టుకుపోవడం మనకు పట్టిన దుర్విపాక యోగం.
శబ్దం బ్రహ్మమే. వేదాల్లో చాలావరకు ధాతుజాలైన శబ్దాలే వున్నాయి. వాటిని ఎవడో కొంపల్లె కొండముచ్చుగాడు వ్యాఖ్యానించలేదు. యాస్కుడు ప్రపంచించాడు. కారణం యాస్కుడు ఋషి కనుక. ‘ఋషి’ శబ్దాన్ని కూడా యాస్కుడే నిర్వచించాడు. ‘ఋషిర్దర్శనాత్’ అన్నది ఆ నిర్వచనము. ‘ఋషీగీతౌ’ ఈ శబ్దాన్ని చూసినపుడు దర్శనము చేతన ధర్మమని స్ఫురిస్తుంది. ఆ ఋషిత్వమును ఒనగూర్చుకొన్న తరువాతనే వాల్మీకి రామాయణాన్ని రచించినాడు.
అసలు కవిత్వమే ఒక విచిత్ర భాష. శబ్ద సమ్మేళనం. సామాన్య భాషకంటే భిన్నంగా వుంటుంది, ఉండాలి. ఉద్రేక సంబంధమైన ఉత్తర్వులు కవిత్వం పట్ల చెల్లవు. అవి కేవలం క్రీగాడ్పులు. ఇక్కడ దాగిన పరమ రహస్యమొక్కటే. ముఖ్యంగా గుర్తించాల్సిన విలువైన సూక్ష్మాంశమూ ఒక్కటే. అనుభూతి. అనుభూతి ఆత్మచైతన్యాన్ని జాగ్రత్తపరుస్తుంది. వికసితం చేస్తుంది. విస్తృతం చేస్తుంది. మనిషిని మారుస్తుంది. దృగ్విశేషాన్ని ఇస్తుంది. ఆత్మ అనే చైతన్య సాగరంలో క్రియాత్మక చర్యలే (అలలు లేవటం- ఆవిరి కావటం- అకసానికెగరటం- చినుకురాలటం) యావన్మానవీయ నిర్మాణము. కవిత్వం అందులో పరాకాష్ఠ. ఈ అంతర్గత చైతన్య సాగర ఘోషను వినడమే కవి క్రాంత దర్శణభిజాతము. ఈ అనుభూతి కళాభ్యాసంలో ఆత్మ జగత్తు రెండూ ఏకమైపోతాయి. దీనే్న ‘విగళిత వేద్యాంతర స్థితి’ అంటారు. తన్మరుూభావం అన్నారు. తాదాత్మ్యం అన్నారు. భారతీయ రససిద్ధాంతం ప్రకారం కవి బహిర్జగుత్తును ఆత్మీకృతం చేసుకోవటం చేతనే తద్రూపక ఆత్మకళను సిద్ధింపజేసుకోవటం చేతనే అతడికి కవిత్వం సిద్ధిస్తోంది. అంతేకానీ అక్షరాలు అల్లటం వాక్యాలు పేనడంతో కవిత్వ రాదుగాక రాదు.
శబ్దం నవ్యాంశగా కనిపించటము, పాఠకుడ్ని తన చట్రంలో ఇరికించుకుని, తనలోనే అతడు భావనా చంక్రమణం చేస్తూ విస్తృత పరిధిలోకి ప్రవేశింపజెయ్యాలి. ఇది పాఠకునిలో ఒక అనుల్లంఘనీయ లోలత కల్పించే శక్తి అన్నమాట. ఈ శక్తి మామూలుగా వున్న శబ్దాలకు ఎలా వచ్చింది? అంటే ఈ సాధారణ శబ్దాలు కవి చేతుల్లో పడి అసాధరణత్వాన్ని సంతరించుకుంటున్నాయన్నమాట.
ఈ పోహళింపు తరువాత కాలానికి వచ్చిన ఆనందవర్ధనాచార్యుల పూర్వులలో వామనాచార్యుడొక్కడే ప్రప్రథమంగా కావ్య స్వరూపాన్ని కావ్యతత్త్వాన్ని విలక్షణంగా విమర్శించినవాడు. ఎందుకంటే వామనుని పూర్వాచార్యులందరూ విశేషంగా కావ్య శరీర సౌందర్యమునకే (అట్టరంగులు అచ్చు సోకులు అనువాద భాషల పట్టికలు ఈ వివరాలు కాదు) ప్రయత్నించగా వామనుడు ‘గుణాలంకార సంస్కృతములైన శబ్దార్థముల’కే కావ్య శబ్దము వర్తించునుని రీతియే కావ్యాత్మయనయు స్పష్టముగా ప్రథమాధికరణంలోనే చెప్పాడు. నాగరిక సమాజం కనుక మనకిప్పుడే శాస్త్ర దృష్టి ఉదయించాలి. వాస్తవం తద్భిన్నంగా వుంది. నిజానికి శాస్త్ర వాతావరణ కక్ష్యలోకి ప్రవేశించినవారికి దొరికినవే అలంకారాలు. ఇది తెలుసుకుని మానవ జాతికి లభించిన విజయాన్ని అనుభవించిన పరాజయాన్ని తద్వారా మానవ మహాస్వరూపాన్ని కవి నిర్మించుకోవాలనే తాత్పర్యం. కవిత్వానుగ్రహం కలగాలంటే అది లోకైక దీపాంకురం కావాలంటే కవికి శబ్ద రహస్యం తెలియడం తప్పనిసరి. చమత్కార వాక్కు మాత్రం అతి విశిష్టమైన వారికే చిక్కుతుంది. కవుల వాక్కుల్లో వున్న చమత్కార శిల్పాన్ని ఒడిసిపట్టుకున్నవాటికి నామకరణం చేసిన ఆదిమ ఋషుల్లో ఒకడైన భామహుడు ఇప్పుడు మనమనుకుంటున్న అలంకార కావ్య వాక్కుల తత్త్వ స్వరూపాన్ని సన్నిహితంగా తెలుసుకుని వాటినన్నిటిని సుష్ఠు శబ్ద ప్రయోగం ద్వారా సాధించి ‘వక్రోక్తి’ అని నామకరణం చేశారు. ఒక శబ్దానికింత సౌష్ఠవాన్ని కల్పించుకుంటేనే కావ్యపరమైన ప్రయోగానికుపయోగించుకొని వట్టి శబ్దాలు, వాటి అర్థాలు కవిత్వం కాదన్నది నిర్వివాదమైన అంశమేనని తెలుసుకోవాలి. అదేవిధంగా కవిత్వాన్ని ఆస్వాదించటానికి కేవలం శబ్దార్థ జ్ఞానం ఒక్కటే చాలదు. ఇదీ నిర్వివాదమే. కవిత్వం శబ్ద విశేషమే. ఎప్పుడైతే అది శబ్ద విశేషం అనబడిందో కవికి శబ్ద శక్తిని గురించి బాగా తెలుసుకోవలసిన భారం నెత్తినపడింది. అనాదికాలంనాడే సాహిత్య శాస్తజ్ఞ్రులందరూ పరా పశ్యంతి మధ్యమా వైఖరీ నామక చతుర్విధ రూపాత్మక వాక్కును అభిధా-లక్షణా- వ్యంజనా అనే త్రివిధ శబ్ద శక్తుల్ని సమ్యగ్విచారం చేసినవారే. చేయమని కవులకు కవితా రసాస్వాదకులకు ఉపదేశించినవారే. ప్రతి అలంకార శాస్త్ర గ్రంథంలోనూ ఇదొక ప్రకరణం. జీవితం మనిషి (కవి)ని కుదిపివేసిన ఏ క్షణం శబ్దంగా వ్యక్తమైందో అప్పుడే అవ్యక్తానుభూతుల దండయాత్రతో కవి గాయపడినాడు. అప్పుడు రహస్యాంశాలన్నీ కనుగోళాల సూక్ష్మ నాళాల్లోకి వ్యాపిస్తాయి. లోకమే కొత్త దృశ్యంగా మారిపోతుంది. జలపాతం నగమోహిని తలపాపిట చేరువవుతుంది. మబ్బు చినుకుల పూల బుట్ట అవుతుంది.
అట్టి దృగ్విశేషం యిచ్చే వాగ్విశేషంలో వుంది కవిత్వ పిండోత్పత్త్యాది జన్మక్రమం. ఈ తపోధర్మాన్నంతా వదిలేసి నేను వ్రాసిందే కవిత్వమనేవాడికి- చదువుకున్నవాడు తల పగులకొట్టుకు చచ్చిపోయిన దోషం చుట్టుకుంటుంది. పైగా కవిత్వం వ్రాయటమన్నది ఇప్పుడొక భయంకరమైన అంటువ్యాధిగా ప్రబలింది. ‘‘మానస సరోవరమంటున్నావ్- రత్నాలు - ముత్యాలు అంటున్నావ్- ఇక్కడ కొల్లలుగా దొరికే గుడ్డి గవ్వలు- నత్తగుల్లలు దొరుకుతాయా అక్కడ?’’ అని అడిగే కవులు (నీటికాకులు)న్నట్టి దేశమిది.
‘‘సమార్ద్ర విమలీకృత సంతత భావ వాహినీ సంగత చిత్తవృత్తి’’, ‘‘తొల్లినాటిది స్వరూప జగత్తున చేతనత్వ మోడకయ.. చేసి పెట్టవే’’- ‘‘నిను మదిలోన నెంచుతఱి నేనొక యోగిని’’, ‘‘కదలగదాని కన్మొగుడు కాలమునందున గుండెలో పొరన్ కదలెదుగాని’’- ‘‘నా యెద నీతో రాచెద’’ ఈ శబ్ద సంచయమంతయు మనన - నిధి- ధ్యాసల రూపంగా ప్రతీయమానమవటం- కవి ప్రతిభతో పొదిగిన శబ్దగుణ ప్రభావమే. శబ్దమునకు వాచ్యార్థ లక్ష్యార్థములతోపాటు వ్యంజనా శక్తి ఉన్నదని ధ్వనివాదం. వ్యంజనా శక్తి అర్థాంతరాన్ని తెలియజేస్తుంది. అర్థాంతరానే్న వ్యంగ్యమంటారు. వ్యంజననే ధ్వనియని ఆలంకారికులంటారు. ఇది చాలా విధాలు. శబ్ద - అర్థ - రీతి- వర్ణాల్లో దేనినైనా ఆశ్రయించి వుంటుంది. అలంకార రసభావ వస్తు రూపాల్లో ఏదైనా అయి భాసిస్తుంది.
అభివ్యక్తికి భాష అనివార్యమైతే శబ్దాలు పునాదిగత నిర్మాణ వస్తువులు. వస్తువుల్ని ఉపయోగించుకోవటంలో రూపాల్ని మోస్తున్న శబ్దాలు కళాత్మక స్థాయినందుకోవాలంటే కవికి క్రాంత దర్శనం తప్ప మరో అవకాశం లేదు. కానీ కవిత్వం మాత్రం భాష కాదు అనే పరమ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు భాషను భ్రాంతిలోనే వదిలేయడు. కవిగా సత్యాన్ని శబ్దాన్వయం చేస్తాడు. అంధకారముచే కనపడని పదార్థము యొక్క స్వరూపాల్లోకి జ్ఞానాన్ని ప్రసరింపజేస్తాడు కవి. ఆ విధంగా కవి ఆదిత్యుడే. ఆకాశము శబ్ద గుణ సంభూత. కవియున్ను అంతియే.
ఒక జాతి నుండి ఒక వ్యక్తినుండి భిన్న కాలాల్లో ఆ శబ్దమే వెలువడుతోంది. శబ్దానె్నవరు సృష్టించారు? సృష్టించటం ఎలా? శబ్దమెక్కడ్నించి వస్తోంది? ఎందుకు వస్తోంది? పరమార్సిష్ఠమైన మానవ శరీర నిర్మాణము పరమ బృంహిష్ఠమైన మహాశరీరము యొక్క చిహ్నమే కదా! ఏ మహా జన్యజనక భావమును బట్టి అక్కడ శబ్దముత్పన్నమైనదో ఆ లక్షణం ఇక్కడ కూడా కన్పిస్తుంది. మనుజుల్లో ఆకాశముంది. నాభి నుండి వాయువు సహస్రారం వరకు మెలికలు తిరిగినట్టిది. శబ్దం ఇట్లా ఉత్పన్నవౌతుంది. ముఖావయవములు దానికి ఆకారాన్ని ఇస్తాయి. ఆ అక్షరాల సంఖ్య అంతటితో ఆగడమేమిటి? ప్రతి పదంలోను ఈ మహాశ్చర్యం వున్నపుడు శబ్దరూప సందర్శన మనసు గమనిస్తూనే ఉంటుంది కదా. మళ్లీ ఈ గమనం రెండు రకాలు. ఒకటి అంతరం. రెండు బాహిరం. ఈ బాహిరం మాయాసంబంధి. మాయాజనితులైన మానవులు దీనియందు బ్రతుకుతున్నారు.
ఆకాశమునందలి శబ్దమును మనము వినలేము. వస్తు సంఘర్షణ జనిత శబ్దానే్న వినగలము. మానవ ముఖము నుండి వచ్చిన శబ్దమును భాషగా అంగీకరించి సంగీతముగా అన్వయించి విభజించుకొని దానియందు రమించుచున్నాము. ప్రతివాడు గాయకుడగుట లేదు. ప్రతివాడు భాషావేత్తయగుటలేదు. ఎందుచేత? ఈ దేశము తత్తర్పూర్వజన్మ సంస్కార విశేషమని సమాధానము చెప్పుచున్నది.

- సాంధ్యశ్రీ, 8106897404