సాహితి

కాలంతోనే కవితా ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వానికి ఒక తాత్విక భూమికను ఏర్పాటు చేసుకుని క్లుప్తత, గుప్తత పాటిస్తుంటే అనుభూతి గొప్ప సార్వజనీనకమై పోతుంది. ప్రాంతీయ స్పృహను, వర్గ స్పృహతో ఉద్యమింప చేసే వాళ్ల జాతీయ బూర్జువా స్థానిక బూర్జువా, పెటీ బూర్జువా ఉద్యమాలు కవి జీవనం మీద విశేష ప్రభావం చూపుతాయి. సంక్లిష్టమైన ఒక సామాజిక వాస్తవాన్ని తీసుకుని, అందునా ఎడతెగని వాదోపవాదాలకి కారణమైన సమస్యని స్పృశిస్తూ ఆ వాస్తవాన్ని కళాత్మక వాస్తవం చేస్తూ అద్భుతమైన కవితగా మలచడానికి కవికి చాలానైపుణ్యం కావాలి. కవితా నిర్మాణ ప్ధతుల మీద ఎంతో పట్టు ఉండాలి. ఈ నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకుని చాలా శక్తివంతమైన కవితో సాహితీలోకాన్ని విస్మయానికి గురి చేసినచో గొప్ప కవిగా రూపొందించబడతాడు. బాహ్య ప్రపంచంలో కంటికి కనిపించే సంఘటన కవి అంతరంగం మీద ఎక్కువ ప్రభావం కలిగిస్తుంది. ఈ కారణం వల్ల ఎడతెరిపి లేకుండా ఆలోచనలు ప్రవాహంలా వస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాహ్య ప్రపంచంలోని సంఘటనలకు ప్రతిస్పందించే లక్షణమే ఈ కవితా చైతన్య స్రవంతి శిల్పం చేపట్టడానికి ప్రేరణ. ఒక కవి తనదైన జీవితానే్వషణలో తారసిల్లిన అనుభవాలు, సత్యాసత్యాలు తను వేసుకున్న ప్రశ్నలు, వాటికి తను వెదుకుతున్న జవాబులు, చూసిన ప్రపంచాన్ని తాను అర్ధం చేసుకుని చేసుకున్న తాత్త్విక విశే్లషణలు, అన్నీ ఎదుటివారికి చెప్పిన రీతిలో కవితా రచన సాగుతుంది.
కవిత్వాన్ని విశ్వసించడం, కవిత్వమై బతకడం, అంత సులువు కాదు. అందుకు కవి నిరంతరం జాగరూకుడై ఉండాలి. ఈ మెలుకవ సాధనతో వచ్చేది కాదు. అది సహజంగా వుండాలి. వ్యక్తిత్వంలో కలగలిసిపోయి వుండాలి. కాలంతోపాటు గానే కవిత్వ ధోరణుల్లోను మార్పులు వస్తుంటాయి. దీన్ని గుర్తించలేక ఒక ధోరణి ఉధృతి తగ్గిందనగానే దానికి అనుకూల, ప్రతికూల వాదనలు లేవనెత్తుతుంటారు. అసలు ఏ ధోరణయినా శాశ్వతంగా వుండాలనుకునే స్వభావం ఈ రకమైన వితండ వాదనలకు దారి తీస్తుంది. కవిత్వ విధానం మారడం కాలానికి, సమాజానికి ఉన్న లక్షణం. నిర్దిష్టత కవిత్వానికి ప్రాణం. ఈ విషయాన్ని గుర్తించిన కవి సామాజిక జీవన స్రవంతికి ఎడంగా వున్న ప్రజల గురించి ప్రత్యేకంగా పట్టించుకుంటాడు. వారి సంవేదనలకు అక్షర రూపం ఇస్తాడు. ఉత్తమ కవి సరిగ్గా చేసేది ఇదే. సమాజంలోని అమూర్త పీడితుని గురించి కాకుండా నిర్దిష్టమైన పీడితుల జీవితాన్ని తమ కవితావస్తువుగా స్వీకరిస్తాడు. కవిత్వంలో స్థానికత ప్రాధాన్యం సంతరించుకుంది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో సామాజిక, సాంస్కృతిక జీవిత ప్రతిఫలాలు సాహిత్యంలో వ్యక్తం కావడం అని స్థానికీకరణ అన్న భావనా బలం చేకూరుతుంది. అంతర్జాతీయంగా, జాతీయంగా వచ్చిన వస్తున్న వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉపద్రవాలు పాలితులకు, పీడితులకు ఏవిధంగా ఉపయోగపడతాయో అక్షరీకరించబడుతుంది. కవిది-శాశ్వతమూ, అనంతమూ అయిన పాత్ర. కవిత్వం పుట్టడానికి ముందు అనుభవం కావాలి. అనుభూతులు కావాలి. కవిత్వమంటే నిర్మలమైన స్థితిలో స్ఫురణకు తెచ్చుకునే ఉద్వేగం. అందుకే కవిత్వం కొందరికి కిటికీ. ఇంకొందరికి ద్వారం. మనసు వెనువెంటనే తేలిక పరుచుకుంటారు. వీరికి కిటికీ చాలు. ఇంకొందరు భారాన్ని మోసీ మోసీ పరిపక్వానికి వచ్చాకే బట్వాడా చేస్తారు. వీరికి కిటికీ చాలదు. ద్వారం కావాలి.
కవిత్వం ఒక భావావేశం. మనిషిలో కలిగిన భావాలు ఒక లయాత్మక దశలో, అభివృద్ధి చెందడం కవిత్వం అవుతుంది. ప్రకృతి సాదృశ్యంగా కవి సమాజాన్ని, వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, ప్రేమని, స్నేహాన్ని, కరుణని ఒకటేమిటి...? మనిషి వెలిగించే కదిలించే అన్ని అంశాలను ముందుకు తెస్తాడు. కొంతమంది కవులు కవిత్వంపై వ్యాఖ్యానించడానికి బదులు కవి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడడం నాగరికం అనిపించదు. కవి పేరు ప్రస్తావించకుండా ఆ కవి రచనల పేర్లు ఏకరువుపెట్టడం కూడా క్షంతవ్యంకాదు. గ్రూపుల్లో కూటాల్లో చేరడం, ఇతర కవులను విమర్శించడం లాంటి సంకుచిత భావాలను సృజనకారులు విడనాడాలి. సత్యాన్ని ఆవిష్కరించడానికి కలాన్ని ఖడ్గంగా ఝుళిపించాలి. మారుతున్న కాలంతోపాటు శిల్పంలో మార్పులు రావాలే కానీ శీలంతో కాదు.
కవులు తమ కవిత్వం తాము సృష్టిస్తూ కవిత్వం గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం తెలుగులో ఒక సాంప్రదాయం. ఈ పని వ్యక్తిగతంకాను, గుంపుగాను జరుగుతూ వస్తుంది. సామాజిక సందర్భం మారినప్పుడు, కొత్త భావజాలం అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్తఉద్యమం పుట్టినప్పుడు కవిత్వాభిప్రాయాలు సంఘర్షించడం, మారడం, సవరింపబడడం సహజం. కవిత్వ సృష్టి, కవిత్వ చర్చ ఇవి ఏ భాష కవిత్వ అభివృద్ధికైనా అత్యవసరమే.

- ఎస్.ఆర్.్భల్లం 9885442642