సాహితి

ప్రణయ లేఖ - పరుగులు తీసిన ప్రేమ (శ్రీవిరించీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాసరావుకు ఉద్యోగం లేదు. అయితే అతను మంచి టెన్నిస్ ఆటగాడు. పెద్ద ఆటగాడు అయ్యే సూచనలున్నాయని అతని అంచనా. నడుస్తున్న నాగరికతలాగ తయారయి రోడ్డు వెంట వెడుతున్నవాడు ఒక బట్టల దుకాణం ముందు షోకేస్‌లోనున్న బొమ్మ, ఆ బొమ్మకు కట్టిన చీర లావణ్యాలకు ఆకర్షితుడై అనాలోచితంగా ఆ దుకాణంలోనికి అడుగుపెట్టాడు. అతని అదృష్టం కలిసివచ్చిందన్నట్టుగా దుకాణంలోనికి వచ్చిన ఓ అమ్మాయి, షోకేస్‌లోని బొమ్మ కదిలి వచ్చిందా అన్నట్లుగా అతని వెనక కనబడడమే కాకుండా అతన్ని పలుకరించింది- ‘ఈ చీర ఖరీదు ఎంతండీ’ అని. షోకేస్‌లో బొమ్మకు ‘ఇంత చక్కటి గొంతుక’ వుండడం కూడా అతనికి అక్కజం అనిపించింది.
పాలగుమ్మి పద్మరాజుగారి ‘గట్టులేని ప్రవాహం’ కథానికలో సన్నివేశం ఇది. అతనికి (శ్రీనివాసరావుకు) ఆ అమ్మాయితో పరిచయం లేదు. అయినా ఆమె తన అడ్రసు ‘వి.శేషగిరి, 56, గుప్త వీధి’ అని దుకాణం గుమాస్తాతో చెప్పడం, తనకే తెలియచెప్పినంత సంతోషం కలిగించి, అతన్ని ఆ ఇంటికి తీసుకుపోయింది.
ఆ ఇంటిముందు ఓ కుక్క వున్నందువల్ల అతని ప్రవేశం అంత త్వరగా జరగలేదు. తీరా, తలుపు తెరుచుకున్న తరువాత ఓ మధ్యవయస్కురాలు ఎదురయి ప్రశ్న పరంపరలు కురిపిస్తుంది. ఆమెకు, ముందు దర్శనం ఇచ్చిన కుక్కకూ అతను ముఖంలోను, గొంతులోను, కవళికలలోను పోలికలను గమనించి ఊహాలోకంలో తిరుగాడుతాడు కొంతసేపు.
ఇల్లు ఇదేనని తెలుసుకున్న తరువాత ఎందుకు వచ్చిందీ చెప్పాల్సిన అత్యవసరం ఎదురయింది అతనికి. ఇంట్లో ఒక వాటా అద్దెకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నదనీ, తనకు కావాలనే సందర్భోచితంగా చెప్పగలుగుతాడు. తను ఉత్తరం ‘ప్రేమలేఖ లాంటిది’ రాయడం రుూ మధ్యవయస్కురాలికి కాదనీ, ఇంట్లో ఎవరో తను ముందుగా చూచిన యువతి వుండి వుండాలనీ అతనికి సహజంగానే తోస్తుంది. మాటల మధ్యలో ఆ అమ్మాయి కూడా లోపల నుంచీ బయటకు వచ్చి తల్లితో ఏదో మూగ సంభాషణ చేస్తుంది. దాంతో తల్లి ఇంటిలోపలకు వెళ్లి శ్రీనివాసరావు రాసిన ప్రేమలేఖ బయటకు తెచ్చి ‘యిది నువ్వే వ్రాశావా? ఎందుకు రాశావు?.. పోలీసులను పిలిపించమంటావా?’ అని దబాయించి మరీ అడుగుతుంది. ఉత్తరం తాను రాశానో లేదో అంగీకరించాలా, తిరస్కరించాలా అనేది అతనికి తెలియక తికమకపడతాడు. పైగా దుకాణంలో తాను చూచిన యువతి, తనను ఇంతకుముందు ఎరుగను గాక యెరగను అని అబద్ధం చెప్పింది తల్లితో. ‘అందమయిన అమ్మాయిలు అబద్ధాలు చెబుతారని అతనికి అంతవరకు తోచలేదు’- ఈలోకంలో నిజానికి ఆశ్రయం లేదని స్వగతంతో చెప్పుకుంటాడు.
చావు తప్పి కన్ను లొట్టపోయిందని అన్నట్లుగా అతను ఆ ఇంట్లో నుంచి బయటపడి రోడ్డుమీదికి చేరుకునే లోపుగా ఓ విచిత్రం జరిగింది. అతను మెట్లు దిగుతూండగా తలుపు సన్నగా తెరుచుకుని సన్నని గొంతుతో ఆ యువతి కంఠస్వరం పలికింది. ‘నా పేరు సరస్వతి. ఈసారి పొరపాటు చెయ్యొద్దు. ఈ వేళ సాయంకాలం 7 గంటలకు ఇలియట్సు రోడ్డుకి ఎదురుగా బీచ్ ఒడ్డున వుంటాను’. ఆలస్యంగానయినా వచ్చిన ఈ ఆహ్వానానికి అతను ఉప్పొంగిపోతాడు. ‘ఒక చక్కని యువతి ముఖం హృదయపూర్వకమయిన చిరునవ్వుతో వికసించి సౌదామిని లాగా మెరిసింది’ అన్న ముగింపుతో కథానిక అంతం అవుతుంది.
పేరు తెలుసుకోకుండా గుడ్డిగా ఉత్తరం రాయడం, కుడితిలో పడ్డ ఎలుకలాగా కొన్ని క్షణాలు ఇబ్బందికి లోనుకావడం, చివరకు తన తప్పిదం దానంతట అదే ‘ఒప్పు’ అయి ఆహ్వానంగా ఎదురవడం అతి చమత్కారంగా సరసంగా చూపించిన రుూ కథానిక ప్రేమికులకు చక్కటి సూచనగా కూడా వుంటుంది.
పద్మరాజుగారి ‘గాలివాన’, ‘పడవ ప్రయాణం’ అతి ముఖ్యమైన కథలుగా చెబుతారు. అయితే, ఆయన వ్రాసిన చిన్న కథలలో కూడా హృదయ లాలిత్యం, సౌజన్యం తొణికిసలాడుతూ వుంటాయి. మొదటి కథ ‘సుబ్బి’ లాగానే ఈ ‘గట్టు లేని ప్రవాహం’ అన్నది కూడా మానవ ప్రవర్తన రీతులకు అద్దం పడుతుంది.

- శ్రీవిరించి, 9444963584