సాహితి

గళమిప్పండి (కవితలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిలిరండి కలసిరండి
తరతరాల చరితవున్న
తెలుగు భాష కాపాడ!
తెగువజూపి ఉరకండి!!

ప్రాచీనత హోదావున్న
ప్రపంచాన ప్రసిద్ధైన
అధికమంది పలుకాడె
తెలుగు భాష కాపాడ!
కదలిరండి కలసి రండి
తెలుగు భాష కాపాడ!!

నన్నయ్య పద్యమై
అన్నమయ్య పదములై!
త్యాగయ్య కీర్తనలై
క్షేత్రయ్య మువ్వగోపాలమై!
ప్రబంధ జడికురిసి
అష్టదిగ్గ ఝరిలాగ!
కదలిరండి కలసిరండి
తెలుగు భాష కాపాడ!

నీ భాష లేనినాడు
నువ్వుండి ఫలములేదు!
నీ భాష లేని నాడు
నీ బతుకుకు విలువలేదు!
కదలిరండి కలసిరండి
తెలుగు భాష కాపాడ!

గళమెత్తి ఉరకాలి
తెలుగు భాష నిలుపాలి!
భావి భారతములోన
మన చరితలు పొగడాలి!
ఏ దేశమేగినా ఏ భాష నేర్చినా
తెలుగు భాష మనదంటు
తెగువజూపి పలకాలి!
- రానాశ్రీ

తెరమరుగవుతున్న శ్వాస..

తెరమరుగవుతున్న శ్వాస నా తెలుగు భాష
కోట్లాది గొంతుకల యాస
ఆగమవుతున్న ఘోష నా తెలుగు భాష

అబ్బా..
తేనెలూరే తీయని పలుకుల తీయందనం
మమతానురాగాల రూపాలకే పచ్చని తోరణం
కోకిల గొంతుల గానం
కోటి గొంతుకల రణ నినాదం
నా తెలుగు భాషా గొప్పదనం
చెప్పుకుంటూ పోతే సంద్రంకన్నా విశాలం..
ఇప్పుడు రాసుకుంటూ పోతే యెడతెగని విషాదం

నేడు యేలుతున్న వారలెందరో..
దారి చూపనివారే అందరూ...!

ఎన్ని సంఘాలు పెడితేనేం
అధికార భాషా సంఘాలు కావవి
మాతృభాష బోధననే
బొందలపాలు చేస్తోంటే
యేలే నాయకులే ఎగతాళి చేస్తోంటే
పరభాష పైత్యాలని సైతం
కనిపించి కదలించి విదిలించలేని
అచేతనాచేతనావస్థ రూపాలు

కన్నతల్లి చనుబాలు తాగి
వక్షాలనే కోస్తుంటే
ఎన్ని మాతృ భాషా దినోత్సవాలు
జరుపుకుంటే ఏం లాభం?

రాసే కలాలే
కూసే గళాలే
వారి రేపటి వారసత్వంనే...
పరభాషా అంగడిలో అదే సర్వస్వంగా చేస్తుంటే?

అందుకే నా తెలుగు భాష నేడు
తెరమరుగవుతున్న శ్వాస

తెలుగు తల్లి చనుబాలు తాగి తెలుగు మట్టి వాసనల తిరిగి పెరిగిన విలువలున్న మనుజులైతే?
నీ అస్తిత్వ భాషాయాసలని బతికించుకోలేని
నీ జీవితం పరభాషా లోకంలో
బానిసత్వ రూపమే...!

నిజం నిప్పే కాదు
జీర్ణించుకోలేనివారికది ముసలమని కూడా యెరుగుదునే
ఈ కవనం పోటికే కాదు
నీ గుండెల్లో చలనంకై
మనసు లోతుల్లో
మాతృభాషా మమకార మేలుకొలుపులకై..

ఛలో.. మరి మేలుకుంటావో..?
యేలుకుంటావో...?
చేతకానివారలై శిథిలరూపాలే అవుతావో..
తేల్చుకో...!! కాచుకో...!
- కర్ణాకర్ యాదవ్, 09959912304

ఎదురీత
ముళ్ళ కంచెలెన్నో దాటుకొచ్చా కానీ
నీ చూపుల కంచెలనే దాటలేకపోతున్నా!

కష్టాల కడలినే దాటుకొచ్చా కానీ
నీ మాటల సంద్రానే్న దాటలేకపోతున్నా!

ఆశల కలలెన్నో నింపుకొచ్చా కానీ
చేసిన బాసలను నింపుకోలేకపోతున్నా!

ఈసడింపులెన్నో తుంచుకొనొచ్చా కానీ
నీ చులకనభావాన్ని తుంచలేకపోతున్నా!
అడ్డంకులెన్నో తుడుచుకొనొచ్చా కానీ
నీ వౌనపు మసిని తుడవలేకపోతున్నా!

సమస్యలెన్నో సాధించుకొనొచ్చా కానీ
నీ మనసు మర్మాన్ని సాధించలేకపోతున్నా!
సమాజానికంతా సమాధానమ్తిన్నా కానీ
నీ చేతలకు సమాధానమివ్వలేకపోతున్నా!

నీవు.. నేను.. మనమనే బంధమే గానీ
నీకు నాకు మధ్య ఎంత అంతరం!
మొగుడనే సింహాసనం ఎక్కితే
అహమనే కిరీటం వచ్చి చేరునేమో!

కలిసిన జీవన ప్రయాణంలో
మనం కలవని రైలు పట్టాలమేనా!

కాసింత ప్రేమ ఇంధనం కలిపితేనే కదా
మనమనే మనుగడ సాగేది!

మనకు మనమే తప్ప వేరొకరు కాదనే
నిజాన్ని నమ్మితేనే కదా
మనదైన కుటుంబం విలసిల్లేది!
- పుట్టి గిరిధర్