సాహితి

నిరీక్షణ (కవితలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలిలో రంగులు ఎగురుతున్నాయి
ఇది హర్షం!
విద్వేషం విభిన్న వర్ణాల్లో
ఆలోచనల అలలపై తేలుతున్నాయి
ఇది ప్రవాహమే, కానీ సంఘర్షణ!
చల్లని చూపు
మనల్ని మనమేంటో చెబుతుంది!
చెట్ల నీడల జాడల వెంట పరుగు..
ఆకుల సందుల్లో మెరిసే కిరణాలు
అక్షింతలై దీవిస్తాయి..
దుఃఖం ముసురుపట్టిన దేహం
కుండపోతగా వర్షిస్తూనే వుంది.
నిజంగా ఓ స్నేహం కోసం
ఎంత నిరీక్షణో కదా..!!

- తంగెళ్ళపల్లి కనకాచారి
8790874028

కిరణాలు

చెట్టు
సేవామూర్తి
అయినా సరే
నీ చెంతకు రాదు

భయంవల్ల
గుడిలోనే దేవుడు,
బయటికొస్తే
బతుకనిస్తాడా మానవుడు!

పగలు వెలుతురు
మనసు తెరిచెయ్!
రాత్రి చీకటి
తలుపు మూసెయ్!
నాలుగు కాళ్ళ
కుర్చీ గదా!
ఎక్కగానే
మనిషి జంతువు!

పూర్వం కొమ్మలు
వంగేవి, వంచేవి
నేటి కొమ్మలు
వంగరు, వంచుతారు

అంతరించిపోటానికి
పిచ్చుకలు కాదు
దోమలు
రాజకీయ నాయకులు.

రియల్ ఎ‘స్టేట్’లో
‘స్టేట్’
వ్యవసాయం తరుగుతూ..
వ్యాపారం పెరుగుతూ..
పెళ్లాం పిల్లలు
మంత్రుల కవసరం,
కానుకల పళ్ళెం
ఇతరులకివ్వలేం!

‘మ్యాజిక్’ కావాలా!
నన్ను వదిలెయ్!
‘మ్యూజిక్’ కావాలంటే
నన్ను చదివెయ్!
నా కలం
దివ్య వరం
అదే పువ్వు..
అదే బాంబు..
- రావి రంగారావు
9247581825

పడి మొలిచిన...

భూమికి
ప్రకృతి ప్రసాదించిన వరం చెట్టు

బాల బడి పంతులమ్మ
బెత్తం దెబ్బై
ఆకతాయినీ అల్లరినీ అదుపులో పెట్టినప్పుడు
పసి వయసుని ఓదార్చిందీ ఒడిలో నిద్రపుచ్చిందీ చెట్టే

పొద్దునే్న
పళ్ళు తోమిన ముఖం పుల్లా
పొలం బువ్వ ఇంకాస్త ఆలస్యమైనపుడు
పరగడుపున పండ్ల చిరుతిండీ
చిల్లరివ్వలేదని
అన్నంపై అలిగినప్పుడు
పొరుగూరి దారిలో ఆకలి తీర్చిన అమ్మా చెట్టే

ఆటలో
అవతల ముఠాకి అందనంత ఎత్తులో
కొమ్మలమీద కూర్చోబెట్టిందీ చెట్టే
నిపాయించలేని బరువూ భారమూ పడ్డప్పుడు
కోప్పడి
కాలో చెయ్యో బెణికించిందీ చెట్టే

ఎర్రబస్సు కోసం
ఎదురుచూసే ఊరికి చల్లటి అరుగయ్యిందీ చెట్టే
చెరువులోకి
గొడ్లూ గేదెలూ దిగినప్పుడు
ఒడ్డున బుడ్డోడికి గొడుగు నీడయ్యిందీ చెట్టే

నల్ల జాబిల్లి నిరీక్షణలకీ
నిర్మలమైన తొలి యవ్వన ప్రేమకీ
నోరెత్తని సాక్షి చెట్టే

నింగిలో కదిలిపోతున్న నీటిని
నేలపైకి ఆహ్వానించిందీ స్వాగతించిందీ చెట్టే
చెమట చుక్కల చాకిరి పిట్టల చలువ పందిరీ చెట్టే

హోరుగాలికి
విరిగిపోయేదీ వికలమయ్యేదీ చెట్టే
నిలదొక్కుకున్న
చిగురులై పరాజితుల నిర్వచనమయ్యేది చెట్టే

శ్వాసలేని నీ దేహం చుట్టూ
చితిమంటై జ్వలించేదీ చెట్టే

కాగితంమీద
ప్రతి అక్షరం శుభాకాంక్షలు చెప్పాల్సింది చెట్టుకే
చెట్టు పుట్టుకకే

గూడూ గుడిసే గృహమూ
ఆశ్రమమూ పర్ణశాలా
ఏదైతేనేం
పిట్టకీ పశువుకీ
మనిషి బతుక్కీ స్వచ్ఛమైన ఆసరా చెట్టే
మనిషికి జ్ఞానోదయ మార్గం సూచించిన
దయామయి చెట్టే
మనిషి చదవాల్సిన మంచి పుస్తకం చెట్టే

నిజానికి
ప్రాణకోటి తోబుట్టువూ
భూమికి కాస్త పెద్ద బిడ్డా చెట్టే కదా

పడి మొలిచినదైనా
పెరట్లో మొక్కైనా
అది మాట్లాడే భాష వింటున్నావా ఓ హృదయమున్న జీవీ!

అనాది హరిత ప్రపంచానికీ
ఆకుపచ్చని రక్తానికీ
నీడల సిరికీ నువ్వివ్వగలిగిందొక్కటే

పాదిలో
చెంబెడు నీళ్ళు..
- రవి నన్నపనేని, 9963671531

కరువు

కరువంటే-
తిండి లేకపోవడమో
పంటలు పండకపోవడమో కాదు
కరువంటే-
మనుషులమధ్య మాటలు కరువవ్వడం
ఒకరికొకరికి కరచాలనాలు లేకపోవడం
వౌనం రాజ్యమేలడం
కరువంటే-
మేఘాలు వలసపోవడం
వర్షాలు కురవకపోవడమూ కాదు
కరువంటే-
నడిరోడ్డుమీద ఆత్మల్ని అమ్ముకోవడం
నట్టింట్లో ఆప్యాయతల్ని కోల్పోవడం
గుప్పెడు డాలర్ల కోసం
సరిహద్దుల్ని దాటి సాగిపోవడం
కరువులు ఎక్కడో లేవు
గుండెల్లోనే వున్నాయి
ఎండిన గుండెల్లో ఘనీభవించిన
కరువుల్ని పారదోలడం చేతకాక
దేవుణ్ణి తిడుతున్నాం
మానవుణ్ణి శపిస్తున్నాం
కోట్లాదిమంది వున్న దేశంలో
మాట్లాడేందుకు మనిషే లేకపోవడం కన్న మించిన
పెద్ద కరువేముంది?
అన్నీ వుండి, దిక్కులేని వాడిగ
మనిషి చచ్చిపోవడమే
మనల్ని పీడిస్తున్న పెద్ద కరువు
బీటలు వారిన మన హృదయ సీమల్ని తడిపేందుకు
పెదవులపై దొర్లించే పొడి మాటలు కాదు -
గుండె నిండిన మానవతా జలపాతాలు కావాలి!
బతుకు నిఘంటువులో
మమకారం, సహకారం, పరోపకారం వంటి
పదాల్ని చేర్చి, కొత్త జీవన రాగం పాడుకోవాలి
- బీరం సుందరరావు, 9848039080