సాహితి

ధనికుల విలువలు.. జీవితరంగ వలవలలు (శ్రీవిరించీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పైకి ఎన్ని చెప్పినా ధనికులంటే నాకిష్టం- ధనిక వర్గాలతో పోలిస్తే నేనూ సామాన్యుణ్ణే.. కాని ఆ స్నేహం, సాంగత్యం ఎల్లప్పుడూ ఆనందాన్నివ్వదు. అది లోయలో నడవడం లాంటిది. నడవగా నడవగా ఒక పర్వతం దగ్గరికి చేరుకుంటాం. పైకి చూస్తే ఎత్తుగా శిఖరం కనిపిస్తుంది. మన అల్పత్వం మనకు అప్పుడు తెలిసొస్తుంది. స్వార్థం దిగజారుతుంది’- ఈ వాక్యాలు బుచ్చిబాబుగారి కథానిక ‘దిగజారిన మాలిన్యం’లో మొట్టమొదటిగానే కనిపిస్తాయి. కథను ఒక కట్టడంలాగా నిర్మాణం చేయడం, ఎక్కడికక్కడ తగిన వాతావరణాన్ని కల్పిస్తూ తెలియచేస్తూ చదువరికి ఆసక్తికరంగా తయారుచేయడంలో ఆయన దిట్ట. వారి కథలన్నీ మానసిక వాతావరణాన్ని జోడించుకుంటూ పేజీల ప్రమేయం లేకుండా సాగిపోతూ వుంటాయి.
ఈ కథ ఓ విచిత్రమయిన సంఘటనలో ఇరుక్కుపోయిన పాత్ర (రచయితే ఉత్తమ పురుషలో) చెబుతుంది. కథ చెబుతూ వున్న రచయిత నాటకం రాశాడు. ‘‘ఆ నాటకాన్ని ప్రదర్శిస్తాం, నీవు కూడా రుూ సందర్భానికి రమ్మని’’ స్నేహితుడు కాంతారావు ఉత్తరం వ్రాస్తే అక్కడకు చేరుకున్నాడు రచయిత. ఆ స్నేహితుడి పేరు కాంతారావు. ఒక పెద్ద వ్యాపార సంస్థకి అతను అధిపతి. మంచి జీతం, జీవితం గడుపుతూ తన ఉద్యోగస్తులందరికీ సమయోచితంగా ఆదరించి అనునయిస్తూ వుంటాడు. రచయితకు మంచి బస, ఏర్పాట్లు వున్నాయిగాని అతని నాటకాన్ని ప్రదర్శించే విషయం ఎవరూ మాట్లాడరు, కల్చరల్ శాఖ సెక్రటరీతోసహా. నాటకం ప్రతి కూడా సమయానికి దొరకదు. పాత్రలు వేసేవాళ్లు తమ సంభాషణలు చదువుకుని సిద్ధమవలేరు. నాటకంలో ప్రధాన పాత్ర వేయవలసిన ఆమె ఎక్కడికో లేచిపోయింది. ఆమెను గురించి వెదుకులాటలో కొందరు సతమతమవుతున్నారు.
ఇంతకూ నాటకం ఏర్పాట్లు ఏమాత్రం సజావుగా లేకపోగా చివరకు దాని ప్రదర్శన అవనే లేదు. ‘నాటకానికి బదులు పంచవర్ష ప్రణాళికని గూర్చి బుర్రకథగా ఏర్పాటయింది’- అని చివరిమాటగా అందరికీ చెప్పి కాంతారావు తనకు ఏదో అర్జెంట్ వ్యవహారం వున్నది కనుక వెళ్లిపోతున్నాననీ, లాజరస్ అనే అతను తతిమ్మా కార్యక్రమం నడుపుతాడనీ తప్పుకుంటాడు. రెండు మూడు రోజులు సకల మర్యాదలతో, కలుసుకున్న వారందరి శుభ సందేశాలతో, సమర్థవంతం అయిన పార్టీలు- భోజనాలతో కాలం గడిపి రచయిత తిరిగి తన ఊరికి ప్రయాణం అవుతాడు. కాంతారావు అతన్ని రైలుదాకా పంపి వీడ్కోలు తీసుకునేటప్పుడు మాత్రం కాంతారావు ‘మరోసారి మంచివాళ్లచేత ఈ నాటకం ఆడిద్దాం. మంత్రులను కూడా ఆహ్వానిద్దాం’ అని ఊరట మాటలు పలుకుతాడు.
రచయిత అక్కడ వున్న రెండు రోజులలో అనేక కొత్త విషయాలు తెలుసుకోడంతో కథనం అంతా నడుస్తుంది. నాటక ప్రదర్శనలు, ప్రజామోదనం గురించి వ్యాసాలు వ్రాయాలనే స్ఫూర్తి పొందుతాడు రచయిత రుూ అనుభవంతో. ఎస్టేట్ ఉద్యోగులందరూ ఎలాగైనా కాంతారావుగారి ‘గుడ్‌లుక్స్’లో వుండాలని పాటుపడుతూ వుండడం అనేక సన్నివేశాలుగా దర్శనం అవుతుంది. కథ అంతటికీ ‘సుధామయి’ నాయకురాలుగా రూపొందుతుంది. ఈమె చక్కని సంస్కారంగల యువతి. అందరితోనూ కలుపుగోలుగా వున్నట్లు వుంటుందిగాని ఎవరినీ దగ్గరకు రానీయదు. అయితే ఆమె మాత్రం తోటమాలిని ప్రేమించిందని వింటాడు రచయిత. ఈ సంగతి కాంతారావుతో ప్రస్తావించినపుడు అసలు విషయం బయటపడుతుంది. అదేమిటంటే, ఆమె ప్రేమించిన మాట మటుకు నిజమే. అయితే ఆ తోటమాలి మాత్రం తిన్న ఇంటివాసాలు లెక్కబెట్టలేక, యజమానికి అన్యాయం చేయడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడట. తోటమాలి వ్రాసిన ఉత్తరం కాంతారావు దగ్గర వున్నది. ఆ ఉత్తరంలో మాటల ప్రకారం, ‘ఆమె తనను కోరింది అన్న విషయం తోటమాలికి చెప్పరాని ఆనందం కలుగజేసిందట. ఆ ఆనందం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒక జీవికి అంతటి ఆనందం, నైతిక చింతన కలగజేసిందంటే ఆమె వొక గొప్ప కార్యం సాధించింది’ అనుకుంటాడు రచయిత. ఆమె లేచిపోయిందనే వార్త కూడా నిజం కాదు. తన అక్కగారికి జబ్బుగా వున్నదని టెలిగ్రామ్ వస్తే, వెంటనే బయలుదేరి వెళ్లిందట- కంపెనీ సొమ్ము ఖర్చుల కోసం వాడుకుంటూ. ‘ఆమెవి పెట్టుకున్న పళ్లు’ అనే విషయం కూడా రచయిత రాబట్టగలుగుతాడు కాంతారావునుంచి.
ధనవంతులకు కళాత్మక విలువలు ఏమాత్రం లెక్కలోకి రావనీ, జీవితంలో తటస్థించే విలవిలలు, అలజడులు అర్థంగావనీ స్పష్టంగా చెప్పే రుూ కథానిక బుచ్చిబాబుగారి అనేక మంచి కథలలో మిన్న అయినది.

- శ్రీవిరించి, 9444963584