సాహితి

వినిపించే గొప్ప కళ... రేడియో కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశవాణిలో తెలుగు ప్రసారాలు మొదలై

ఎనిమిది దశాబ్దాలు దాటిన సమయంలో

ఇలా చర్చించుకోవడం చాలా అవసరం.

ఎంతో ముదావహం. ఒక్క కథానికే కాదు

సర్వకళలకూ సమాదరణ లభించింది.

దానికి కారణం ఆనాటి సమాజపు

చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, పైపెచ్చు

ఆకాశవాణిలో పనిచేసిన

మహానుభావులు.. ఎందరని చెప్పాలి?

ఒకరా, ఇద్దరా? ఒకచోటనా, రెండు చోట్లనా?

ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, గోపీచంద్

పింగళి లక్ష్మీకాంతం, ఐ.వి.కృష్ణారావు,

కృష్ణశాస్ర్తీ, లత, గుర్రం జాషువా, పానుగంటి,

ప్రయాగ ఉష, ఈమని శంకరశాస్ర్తీ,

బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం,

బాలాంత్రపు రజనీకాంతారావు, దాశరథి,

గొల్లపూడి- ఇలా ఎంతమంది పనిచేశారు?

సినిమా థియేటర్లు, పత్రికల పంపిణీ పెద్దగా

లేనపుడు ఆకాశవాణియే ఏకైక వినోదంగా

కొన్ని దశాబ్దాలు సాగింది. శాస్ర్తియ

సంగీతం, లలిత సంగీతం, జానపద

సంగీతం, నాటకం ఇలానూ; అలాగే

వ్యవసాయం, కార్మికులు, మహిళలు,

పిల్లలు, సైన్స్, హాస్యం, సినిమా సంగీతం

వంటి వర్గీకరణగానూ సాగింది.
నాటక రంగం నుంచి నాటకం, శాస్ర్తియ

సంగీత రంగం నుంచి శాస్ర్తియ సంగీతం

ఆకాశవాణిలో ప్రవేశించాయి. వీటితోపాటు,

ఇంకా చెప్పాలంటే మరింత వౌలికమైన

రీతిలో మనిషి మాటలు చెప్పే విధానాల

స్పోకెన్ వర్డ్స్‌గా ప్రకాశించింది. నిజానికి

కథలు చెప్పడం, కథలు వినిపించడం అనే

ప్రక్రియ ఆకాశవాణి రాకముందు నుంచి

ఉంది. ఇది చాలా సరళమైంది, సంక్లిష్టం

కానిది. అయినా గందరగోళం కూడా

బాగానే ఉందని ఆకాశవాణి కథానికల

ప్రసార తీరుతెన్నులు పరికిస్తే

బోధపడుతుంది. అమ్మలు, అమ్మమ్మలు

కథలు చెప్పడం; వాటిని మనం వినడం

కొత్త కాదు. కాని పత్రికలలో ప్రచురింపబడే

(చదువుకునే) కథకూ, రేడియోలో

ప్రసారమయ్యే (వినిపించే) కథకూ- తేడా

ఉందని వౌలికంగా గ్రహిస్తే అయోమయం

ఉత్పన్నం కాదు. వినడం మాత్రమే, కనుక

చిన్న వాక్యాలతో కథ సాగాలి. మరలా వినే

సదుపాయం లేదు కనుక ట్విస్టులు

అవసరం లేదు. ఒక్క చెవి మాత్రమే

ఇంద్రియం కనుక జాగ్రత్త వహిస్తే చాలు.
ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు,

విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం,

కడప, ఆదిలాబాదు, కొత్తగూడెం, వరంగల్,

తిరుపతి, అనంతపురం, కర్నూలు,

మార్కాపురం, నిజామాబాదు,

కథానికలను పలు కార్యక్రమాలలో ప్రసారం

చేస్తున్నాయి. చాలా విభాగాలలో కథలు

ప్రసారం అయ్యాయి, అవుతున్నాయి. ఈ

ఎనభయ్యేళ్ళ కాల వ్యవధిలో ఈ 12

కేంద్రాలే కాక, అండమాన్, బెంగుళూరు

వంటి కేంద్రాలను కూడా కలుపుకుంటే

వందలు కాదు, వేల సంఖ్యలో

ఆకాశవాణిలో కథానికలు ప్రసారమయి

ఉంటాయి. అలాగే తొలినుంచి ఇప్పటిదాకా

ఎంతోమంది కథా రచయితలు ఆకాశవాణి

ఉద్యోగులుగా పనిచేశారు. నిజానికి ఈ

జాబితా చాలా పెద్దది. బుచ్చిబాబు,

గోపీచంద్, రావూరి భరద్వాజ, సత్యం

శంకరంమంచి, జనమంచి రామకృష్ణ,

తురగా జానకీరాణి, డి.వెంకట్రామయ్య,

గొల్లపూడి మారుతీరావు, ఇంద్రగంటి

శ్రీకాంతశర్మ, సుమన శృతి, జపాల్‌రెడ్డి,

చెన్నూరి రాంబాబు, చలసూత్ర ప్రసాద్,

ఎస్.హనుమంతరావు, ఇటీవలి మెహిత్

దాకా ఎంతోమంది ఉన్నారు.
కొంత పేరు, గుర్తింపు, ప్రచారం ఉన్న కథా

రచయితలను కథతో రండి, రికార్డు చేసి

ప్రసారం చేస్తామని ఆహ్వానించడం

ఆకాశవాణి విధానం. పూర్తి వికేంద్రీకరణతో

పనిచేసే ఆకాశవాణి కేంద్రాలలో

వందలమంది కథారచయితలు తమ

కథలు చదివారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ

మొదలుకొని ఆకాశవాణిలో కథ

వినిపించని కథకుడు ఎవరైనా ఉన్నారంటే

అనే్వషించాలి. మల్లాది రామకృష్ణ శాస్ర్తీ,

విశ్వనాథ సత్యనారాయణ, ఆరుద్ర, శ్రీశ్రీ,

మాలతీ చందూర్, రామలక్ష్మి,

రావికొండలరావు, గణపతి శాస్ర్తీ, అడవి

బాపిరాజు, కుటుంబరావు, శ్రీవిరించి,

అక్కిరాజు రమాపతిరావు, మధురాంతకం

రాజారాం, పులికంటి కృష్ణారెడ్డి, పోరంకి

దక్షిణామూర్తి, ఎన్.ఆర్.చందూర్,

పి.సత్యవతి, విహారి, పెద్ద్భిట్ల

సుబ్బరామయ్య, వి.చంద్రశేఖరరావు, సలీం,

జలంధర, డి.కామేశ్వరి- ఇలా ఎంతోమంది

తాము రాసిన కథలు ఆకాశవాణిలో

వినిపించారు.
ప్రయోగాలూ.. విభిన్న ప్రయత్నాలు
కథా రచయితలు తాము కథలు

వినిపించడం చాలా మామూలుగా,

నిరంతరాయంగా, ఏకకాలంలో పలుచోట్ల

జరుగుతోంది. అంతకుమించి -
1. కథకులతో పరిచయాలు,

చర్చా కార్యక్రమాలు
2. కథా సంకలనాల పుస్తక

సమీక్షలు
3. కథా సంకలనాల ఆవిష్కరణ

సమావేశాల సమీక్షలు
4. కథల ధోరణులపై వార్షిక

సమీక్షలు, పరిచయాలు, చర్చలు
5. సమావేశాలు ఏర్పరచి కథలు

చదివించి రికార్డు చేయడం
6. సాహిత్య అకాడమి, నేషనల్

బుక్ ట్రస్ట్, విశ్వవిద్యాలయాలు,

కళాశాలలు, రచయితల సంఘాలతో

సంయుక్తంగా కథా సమావేశాలు

నిర్వహించడం.
7. కథాగోష్ఠులు, చర్చా కార్యక్రమాలు వివిధ

సందర్భాలలో చేయడం.
8. కథలు ప్రసారం చేసి,

సంకలనాలుగా పుస్తక ప్రచురణ

చేయించడం.
9. ఇతర భాషా కథా సాహిత్యంపై

పరిచయ ప్రసంగాలు, సమీక్షలు వంటి

విభిన్న ప్రయత్నాలూ, ప్రయోగాలు

తొలినుంచీ ఉన్నవే! మద్రాసు, విజయవాడ,

హైదరాబాదు కేంద్రాలలో ఎన్నో విలక్షణ

ప్రయోగాలు మైలురాళ్లుగా కనబడుతున్నా

ఆయా కేంద్రాల నిర్దేశకుల ప్రోత్సాహాలు, ఆ

కార్యక్రమాల అధికారుల ఉత్సాహాలు

ఆధారంగానే ఈ పనులు జరిగాయి. అలాగే

ఈ కార్యక్రమాలు, శీర్షికలు, కథావేదిక, కథా

ప్రపంచం, కథాలహరి, కథా స్రవంతి,

కథాసమయం, కథన కుతూహలం, కథా

మందిరం కథా ప్రపంచంలో కాసేపు ఇలా

ఎన్నో ఉన్నాయి.
పిల్లలకు కథలు చెప్పడం, పిల్లలు కథలు

చెప్పడం: రేడియో అక్కయ్య, అన్నయ్య ఈ

ప్రయోగాన్ని అతి విజయవంతంగా

నిర్వహించారు. ముళ్ళపూడి వెంకటరమణ

వంటి మహా కథకులు మద్రాసు

ఆకాశవాణి కేంద్రం పిల్లల కార్యక్రమంలో

కథలు విన్నారు, వినిపించారు. ఈ

టెక్నిక్‌ను వినియోగించుకుంటే ఫలితాలు

చాలా గొప్పగా ఉంటాయి.
ఈ కథకు ముగింపు ఏమిటి? మీ తీర్పు

ఏమిటి?: కథను కొంత నడిపించి,

అంతవరకు వినిపించి ముగింపు ఏమిటని,

మీరు రాసి పంపండని కోరడం ఒక

విధానం. ఇలా అభ్యర్థించినపుడు 700దాకా

ఉత్తరాలు వచ్చిన సందర్భం ఉందని

ప్రయాగ వేదవతి అంటున్నారు. ఈ

ఉత్తరాల ముగింపు ద్వారా కొన్ని వారాల

పాటు కార్యక్రమం సాగిన సందర్భాలు

చాలా ఉన్నాయి. అదే సమయంలో కొత్త

కథా రచయితలను అనే్వషించడానికి ఇది

చక్కని వేదిక. వార్తాంశం / సమస్య /

సామాజిక స్పృహ కల్గించే విషయం ఇచ్చి

కథలు రాయించడం. జనాభా సమస్య

అంశంమీద కథ రాయమని అడిగినపుడు-

తయారయిన చక్కని కథ ఇలా ఉంది.

కిక్కిరిసిన బస్సు ఆగింది. గృహస్తు,

ఆయన భార్య దిగారు. పిల్లలను

దింపుకుంటున్నారు. దిగిన పిల్లలను తల్లి

లెక్కవేస్తోంది. చివరికి ఎంతమందిని

కంటారండి అని కండక్టరు విసుక్కుని

ప్రశ్నించడం ముగింపు. అదే కుటుంబ

నియంత్రణ సందేశం. ఇలా

అద్భుతమయిన కథా సాహిత్యం తయారైన

సందర్భం కూడా ఉంది.
బొమ్మా బొరుసు- జంట కథలు: ఒకే

సమస్యకు రెండు ముఖాలుంటాయి.

అటువంటి సందర్భంలో ఇద్దరు కథకులతో

కథలు రాయించి, ఒకదాని తర్వాత ఒకటి

ప్రసారం చేయడం. ఉదాహరణకు అత్త కథ

చెప్పిన తర్వాత కోడలు; ప్రేయసి చెప్పిన

తర్వాత ప్రియుడు ఇలా అన్నమాట.
ఒకే రచయిత - పలు కథలు: ఒక థీమ్

ఆధారంగా ఒకే రచయిత వరుసగా కథలు

చెప్పడం మరో విధానం. కేతు విశ్వనాథరెడ్డి

దయ్యాల కథలు; జి.వి.సుబ్రమణ్యం సుశీల

కథలు, సౌభాగ్య జెన్ కథలు, భరాగో

మనస్తత్వ కథలు, షేక్స్‌పియర్ కథలు,

బైబిల్ కథలు, పురాణ కథలు- ఇలా

ప్రసారం చేసిన సందర్భాలున్నాయి.
ఒకే కథ .. పలు రచయితలు: ఒక రచయిత

కథ ప్రారంభించి కొనసాగించి ఆపితే మరో

రచయిత అందుకు ముందుకుపోవడం

గొలుసు కథ. నలుగురు, ఐదుగురు ఇంకా

ఎక్కువ అంటే పదమూడు మంది ఒకే కథ

నడిపిన సందర్భం ఉంది. ముగ్గురు,

నలుగురు రాసిన ఒకే కథ ఒకేసారి

ప్రసారమైన సందర్భం కూడా ఉంది. అలాగే

ఎంతమంది కథ రాస్తే అన్ని వారాలు

కథలు ప్రసారమైన నేపథ్యమూ ఉంది.

అలాగే ఒక కథకు ముగింపు చేస్తూ

స్పందించిన వందలాది శ్రోతలు ఉన్నారు.

ఈ ప్రయోగాలు మద్రాసు, విజయవాడ,

హైదరాబాదులో జరిగాయి.
కథా సంకలనం.. ధారావాహిక పఠనం:

ప్రచురింపబడిన కథలను స్వీకరించి,

ధారావాహికంగా చదివించడం- ఈ విధానం

శంకరమంచి సత్యం అమరావతి కథలతో

మొదలైంది. ఈ కథలు దూరదర్శన్

జాతీయ స్థాయిలో అమరావతికి

కహానియాగా ప్రసారమయి బహుళ ఖ్యాతి

పొందాయి. నాలుగేళ్ళ క్రితం కూడా కడప

కేంద్రంలో గొల్లపల్లి మంజులాదేవి చదవగా,

ఈ కథలు విశేషంగా ఆకర్షించాయి. ‘సీమ

కథల’ను 15 సంవత్సరాల క్రితం

అనంతపురం ఆకాశవాణి ధారావాహికంగా

చదివించింది. ప్రస్తుతం తదుపరి కేంద్రం

చిత్తూరు కథలకు వరుసగా వారానికి ఒకటి

చొప్పున నిలయ కళాకారులతో

సమర్పిస్తోంది.
నాటికలుగా, నాటకాలుగా.. కథలు: ఈ

రకమైన ప్రయోగాలు బాగానే జరగడమే

కాదు, జాతీయ స్థాయిలో బహుమతులు

పొందాయి. ఈ ప్రయోగాలు కాకుండా

జరిగిన మరికొన్నింటి గురించి చర్చించాలి.

హాస్య కథలు అంటూ విడిగా ప్రసారం

చేసిన సందర్భాలు చాలా కనబడతాయి.

ఇందులో చాలా ప్రఖ్యాతులు విరివిగా

రాసిన దృష్టాంతాలు చెప్పవచ్చు. అలాగే

కేవలం రచయిత్రులతో కథలు రాయించిన

ప్రయత్నాలు కూడా విజయవంతమై

ఉభయులకు పేరుతెచ్చిన ప్రయోగం.

అలాగే విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు

ఎన్నో సైన్స్ ఫిక్షన్ కథలు రాయించాయి.

ఈ విభాగంలో పేరు మోసిన ప్రతి రచయిత

ఈ కేంద్రాలలో పాల్గొని తన వైజ్ఞానిక కథను

వినిపించి ఉంటాడు.
ఎంతో కాలంనుంచి విభిన్న కేంద్రాలలో,

విలక్షణ ప్రయోగాలు ఈ స్థాయిలో

జరిగాయంటే- ఆ సమయంలో పనిచేసిన

అధికారులకే ఆ గౌరవం దక్కుతుంది.

జానకీరాం, బుచ్చిబాబు, జనమంచి

రామకృష్ణ, రావూరి భరద్వాజ నుంచి

ఇటీవలిదాకా పి.ఎస్.గోపాలకృష్ణ, ప్రయాగ

వేదవతి, సుధామ, మంత్రవాది మహేశ్వర్,

నాగసూరి వేణుగోపాల్, సుమనశృతి,

చెన్నూరి రాంబాబు వంటివారి చొరవా

ప్రయోగశీలత వల్లనే ఈ ప్రయోగాలు,

విభిన్న ప్రయత్నాలు సాధ్యమయ్యాయి.

అయితే సమాచారం పెద్దగా

క్రోడీకరించబడలేదు. కేంద్రాలలో

డాక్యుమెంట్ కాకుండా, కార్యక్రమాల

అధికారుల జ్ఞాపకాల పీఠికలల్లోనే

మిగిలిపోవడం విషాదం. పదుల సంఖ్యలో

ఉన్న విశ్వవిద్యాలయాలలో వేలాది

పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి.

కానీ ఆకాశవాణి కథానికపై ఒక్క పరిశోధన

కూడా జరగలేదని పరిశోధక అంశాల

నిష్ణాతులు వెల్దండ నిత్యానందరావు

అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్లక్ష్యానికి

అసలు కారణాలు ముడి సామగ్రి ఒకచోట

స్థిరంగా ఉండకపోవడం! రేడియో

కార్యక్రమాలను భద్రపరచడం కొంత

సమస్యాయుతం కావడం మరో కారణం.
కథను ఎంతో బాగా రాసినా చాలామంది

రచయితలు, రచయిత్రులు అదే కథను

ఆకాశవాణి శ్రోతలకు వినిపించడంలో

విజయవంతం కాలేకపోతున్నారు. పాత

తరం రచయితలకు సంబంధించి

సమాచారం లేదు కానీ పాలగుమ్మి

పద్మరాజు, ఎస్వీ భుజంగరాయశర్మ,

మధురాంతకం రాజారాం, హితశ్రీ, తంబు,

గొల్లపూడి, సింగమనేని నారాయణ వంటి ఏ

కొందరో తప్ప మిగతా చాలామంది

మైక్రోఫోన్ ముందు విఫలురయ్యారని

చెప్పడం బాధాకరం. దీనే్న మరో రకంగా

చెప్పాలంటే విహారిగారి ఛలోక్తిని ప్రస్తావించి-

టాక్స్ సెక్షన్ కనుక కథను ప్రసంగంలా

రాయటం చదవటం అని!
కథను చదవటం, వినిపించడం గురించి

తేడా తెలిసిన ఆకాశవాణి అధికారులు

పలు రకాల ప్రయోగాలు చేశారు.

రేడియోకు తగిన కథలను ఎంచుకోవడం

లేదా రాయించడం. దీని తర్వాత ఆ

కథలను బాగా వినిపించగలిగేవారితో

కార్యక్రమాలు రూపొందించడం.

నాగరత్నమ్మ, కనకదుర్గ,

రామమోహనరావు, శారద శ్రీనివాస్,

చిరంజీవి, సరోజా నిర్మల, రామం, కోకా

సంజీవరావు, గొల్లపల్లి మంజులాదేవి,

ఎం.సి.దాస్, ఆవాల శారద వంటివారు

కథలను రేడియోలో గొప్పగా వినిపించి రక్తి

కట్టించారు. అలాగే ఒక కంఠం ప్రధాన

కథను లేదా వర్ణనను చదువుతుండగా,

సంభాషణలు వచ్చినపుడు డ్రామా

వాయిసెస్‌తో రూపొందించడం వంటి

ప్రయోగాలు జరిగాయి. నాలుగు దశాబ్దాల

క్రితం ఉషశ్రీ విజయవాడ కేంద్రంలో

‘కథామందారం’ పేరిట ఈ ప్రయోగం చేసి

స్పోకెన్ వర్డ్స్ ప్రత్యేకత ఏమిటో తరచూ

చెప్పేవారట. అంతకుముందు బుచ్చిబాబు

మద్రాసు కేంద్రంలో ప్రయత్నించారు.

ఇటీవలికాలంలో పి.ఎస్. గోపాలకృష్ణ,

ప్రయాగ వేదవతి, ముంజులాది

కృష్ణకుమారి, నాగసూరి వేణుగోపాల్

వంటివారు వివిధ కేంద్రాలలో ప్రయోగాలు

చేసి ఫలితాలు సాధించారు.
రేడియోలో కథ రక్తికట్టాలంటే తగిన

వస్తువుతోపాటు తక్కువ సంభాషణలు,

మరీ తక్కువ ట్విస్టులు, మంచి కథనం,

తక్కువ నిడివి ఉండాలి. రేడియోలో కథను

చెప్పాలి, అది ఒక గొప్ప కళ!

ఒక సందర్భం... పలువురు ప్రసిద్ధులు
తీవ్ర నీటి ఎద్దడి వచ్చినపుడు హైదరాబాదు

ఆకాశవాణి ఒక విలక్షణ ప్రయోగం చేసింది.

కథలు, కవితలు, స్కిట్స్ సమావేశం

నిర్వహించి ప్రదర్శింపచేయడం- ఆరుద్ర,

రామలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి వంటివారు

ఆనాడు నీటి ఎద్దడి మీద రాసిన కథలు

ఆకట్టుకున్నాయని సమాచారం ఉంది.

సహస్రాబ్దం మారుతున్న వేళ కాల

ప్రవాహంలో మనిషి కోల్పోయినదేమిటి

అని 2000 సంవత్సరంలో విజయవాడ

ఆకాశవాణి ‘వెలుతురు చినుకులు’ పేర 14

రచయితలతో కథలు రాయించి ప్రసారం

చేసింది. ‘గ్రంథాల సర్వస్వం’ పత్రిక ఈ

కథలలో 14 కథలను నవంబరు 2000

సంచికలో ప్రచురించింది. 2011

సంవత్సరంలో హైదరాబాదు, ఆదిలాబాదు

కేంద్రాలు పలు ప్రసిద్ధ కథా రచయితలతో

సమావేశాలు నిర్వహించి, వినిపించి రికార్డు

చేశాయి. 2012 సంక్రాంతికి 12 ఆకాశవాణి

కేంద్రాలు 15 రోజులపాటు 15 కథలను

సంక్రాంతి కథోత్సవం పేరున రాష్టవ్య్రాప్తంగా

ప్రసారం చేసింది. 2014 సంక్రాంతికి మద్రాసు

ఆకాశవాణి ఐదుగురు కథా రచయితలతో

కథా తోరణం నిర్వహించింది. ఇలాంటి

దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి.

- డా నాగసూరి వేణుగోపాల్