జాతీయ వార్తలు

చక్మా, హాజోంగ్‌లకు భారత పౌరసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలలో నివసిస్తున్న చక్మా, హాజోంగ్ శరణార్థులందరికీ భారత పౌరసత్వాన్ని ఇస్తుందని, అయితే దీనివల్ల ఈ రాష్ట్రాల్లోని స్థానిక ప్రజల హక్కులకు ఎలాంటి విఘాతం కలుగకుండా చూస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఇక్కడ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో చక్మా-హాజోంగ్ శరణార్థుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కిరెన్ రిజిజు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సుమారు గంట సేపు సాగిన ఈ సమావేశానంతరం రిజిజు విలేఖరులతో మాట్లాడుతూ చక్మా-హాజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వాన్ని కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని, అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లోని స్థానిక ప్రజల హక్కులు ఏమాత్రం దెబ్బతినకుండా చూస్తామని అన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాల్సి ఉంది. చక్మాలు 1964 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లో స్థిరపడ్డారు. అయితే స్థానిక ప్రజల హక్కులు, షెడ్యూల్డు తెగల (ఎస్‌టి) హోదా వంటి అంశాలకు ఏమాత్రం విఘాతం కలుగబోదు’ అని ఆయన పేర్కొన్నారు. మైన్మార్‌లో వేధింపుల కారణంగా భారత్‌కు వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలను తిరిగి వెనక్కి పంపించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో చక్మా, హాజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే అంశం తెరమీదికి వచ్చింది. రోహింగ్యా ముస్లింలు అక్రమ వలసదారులని అరుణాచల్‌ప్రదేశ్‌కే చెందిన రిజిజు అన్నారు. అయితే చక్మా, హాజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని అరుణాచల్‌ప్రదేశ్‌లోని అనేక సంస్థలు, పౌర సమాజం వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. దీనివల్ల రాష్ట్ర జనాభాలో మార్పులు సంతరించుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే చక్మా, హాజోంగ్ శరణార్థులకు ఎస్‌టి హోదా, భూమి హక్కులు వంటివి కల్పించకుండా భారత పౌరసత్వం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఒక అధికారి చెప్పారు. చక్మా, హాజోంగ్ శరణార్థుల సమస్యకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని రిజిజు ఈ సందర్భంగా నిందించారు.