జాతీయ వార్తలు

విద్యా సాధికారతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ట్రిపుల్ తలాఖ్, హాజ్ అంశాలపై ముసురుకున్న వివాదాలు, చోటుచేసుకున్న సంస్కరణల... ఆయా వర్గాల సంక్షేమానికి కేంద్రం చేపట్టిన చర్యలు మరుగునపడేలా చేశాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. అయితే, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న మైనారిటీ నేతలు, పదిహేడేళ్ల జునైడ్ హత్యకేసులను ప్రస్తావిస్తూనే.. మైనారిటీల విషయంలో కేంద్రం తీసకుంటున్న సంక్షేమ చర్యలు విపక్షాలకు నోటిమాట లేకుండా చేస్తున్నాయన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే విధ్వంస చర్యలు, పెత్తన ధోరణిని ప్రభుత్వం సహించేది లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ సర్కారు మైనారిటీల సంక్షేమానికి 9.6 శాతంమేర బడ్జెట్ పెంచిందని చెబుతూ, 2016-17లో 3827.25 కోట్లు ఉన్న బడ్జెట్ 2017-18లో 4195.48 కోట్లకు పెరిగిందన్నారు. గత ఆరు దశాబ్దాల్లో అభివృద్ధి పేరిట మైనారిటీలను ప్రభుత్వాలు బుజ్జగించాయే తప్ప, సాధికారతకు చేపట్టిన కార్యక్రమాలేవీ లేవన్నారు. ఆ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ఎన్డీయే సర్కారు కృషి చేస్తోందని నఖ్వీ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాదిలో తన మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలను వివరిస్తూ మైనారిటీల్లో అన్ని వర్గాల విద్యా సాధికారత, ముఖ్యంగా బాలికల లిటరసీ రేటు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మైనారిటీల మంత్రిత్వ శాఖ నిధులతో వౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (ఎంఏఈఎఫ్) ద్వారా ముస్లిం వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మూడంచెల విధానంలో సెంట్రల్ స్కూళ్లు, కమ్యూనిటీ కాలేజీలు, జాతీయ కేంద్రాలను నెలకొల్పి విద్యా సాధికారత సాధనకు కృషి చేస్తామన్నారు. ముస్లిం వర్గాలు కేంద్రీకృతమైవున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ‘ప్రగతి పంచాయతీ’లను మరింత విస్తరించనున్నట్టు నఖ్వీ చెప్పారు. డిసెంబర్ 17న రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో ‘ప్రగతి పంచాయతీ’ ప్రారంభించామని, భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ముస్లిం వర్గాల్లోని కులవృత్తులు, చేతివృత్తులను పరిరక్షించి, ఆయా రంగాల్లో నిమగ్నమైన వారిలో మరింత నైపుణ్యం పెంచేందుకు ‘హునాన్ హాత్ (నైపుణ్య శిక్షణ)’ మరింత విస్తృతం చేస్తామన్నారు.