జాతీయ వార్తలు

పెరిగిన మద్దతు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసే దిశగా 2018-19 సంవత్సరానికి గాను పధ్నాలుగు ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను బాగా పెంచారు. మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం ఈ నిర్ణయాలు తీసుకున్నది. వరి ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచటం గమనార్హం. పంటల కనీస మద్దతు ధర సాగు వ్యయంపై 150 శాతం అధికంగా ఉండేలా నిర్ణయిస్తామంటూ ఎన్‌డీఏ ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ప్రకటించటం తెలిసిందే. ఈ ప్రకటనకు అనుగుణంగా కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం నేడు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. బడ్జెట్‌లో ప్రకటించిన ఈ విధానానికి అనుగుణంగా సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్) అన్ని ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను సిఫారసు చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేఖరుల సమావేశంలో తెలిపారు. వరి ధాన్యం కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.1550 నుండి రూ.1759 పెంచారు. సాగు వ్యయంతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. గ్రేడ్-ఏ వరి ధాన్యం ఏంఎస్‌పీని రూ.1590 నుండి రూ.1770 పెంచారు. రూ.180 ఈ పెరుగుదల సాగు వ్యయంతో పోలిస్తే 51.80 శాతం అధికం. హైబ్రీడ్ జొన్నల కనీస మద్దతు ధరను రూ.1700 నుండి రూ.2430కి పెంచారు. క్వింటాలుకు రూ.730 పెరగ్గా, ఇది సాగు వ్యయంపై 50 శాతం పెరిగింది. మల్దండి రకం జొన్నల ఏంఎస్‌పీని రూ.1725 నుండి రూ.2450, సజ్జలు రూ.1425 నుండి రూ.1950 పెంచారు. ఇది సాగు వ్యయంపై 96 శాతం అధికం. రాగుల ధరను రూ.1900 నుండి రూ.2897, మొక్కజొన్న రూ.1425 నుండి రూ.1700, కందులు రూ.5450 నుండి రూ.5675, పెసర్ల కనీస మద్దతు ధరను రూ.5575 నుండి రూ.6975, మినుములు రూ.5400 నుండి రూ.5600, వేరుశనగ రూ.4450 నుండి రూ.4890, పొద్దుతిరుగుడు రూ. 4100 నుండి రూ.5388కి పెంచారు. సోయాబీన్ ధరను రూ.3050 నుండి రూ.3399, సెసమమ్ రూ. 5300 నుండి రూ.6249, నైగర్‌సీడ్ రూ.4050 నుండి రూ.5877, పత్తి (మధ్యరకం) కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4020 నుండి రూ.5150, పత్తి పొడురకం రూ. 4320 నుండి రూ.5450కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. కాగా, రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ క్వింటాలుకు పెసర కనీస మద్దతు ధరను రూ.1400, నైగర్‌సీడ్ రూ. 1827, పొద్దుతిరుగుడు రూ.1288, పత్తి రూ. 1130 రూపాయలు పెంచటం అపూర్వమని చెప్పారు. వీటి కనీస మద్దతు ధరలను గతంలో ఎప్పుడు ఇలా పెంచలేదన్నారు. ప్రధాని మోదీకి రైతుల పట్ల గల చిత్తశుద్ధికి ఇది నిదర్శమని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వరి ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు 200, హైబ్రీడ్ జొన్నల ధర 730 రూపాయలు, రాగుల కనీస మద్దతు ధర 997 పెరిగిందని ఆయన తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే అత్యధిక కనీస మద్దతు ధర 52.47 శాతం రాగులకు లభిస్తే జోన్నల ధర 42.94 శాతం పెరిగిందని ఆయన వివరించారు. కందిపప్పు కనీస మద్దతు ధర క్వింటాలుకు 225 పెరిగిందన్నారు. పప్పు ధాన్యాల కనీస మద్దతు ధరను పెంచటం వలన వీటి ఉత్పత్తి అధికం అయ్యేందుకు అవకాశం ఉందని అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన రైతుల ఆదాయం పెరుగుతుందని, కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. దీనివలన దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వరి ధాన్యం సాగు వ్యయం 1166 రూపాయలుగా నిర్ణయించింది. మా ప్రభుత్వం దీనిని యాభై శాతం పెంచి కనీస మద్దతు ధరను క్వింటాలుకు 1750 రూపాయలుగా నిర్ణయించటం ముదావహమని రాజ్‌నాథ్ చెప్పారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కనీస మద్దతు ధర ఇంతగా పెరగడం ఇదే మొదటిసారని అన్నారు. వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా కనీస మద్దతు ధరలు బాగా పెరిగాయని, అయితే ఇప్పుడు పెరిగిన మద్దతు ధరలు అప్పటికంటే ఎక్కువేనని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

ఉన్నత విద్యకు ప్రోత్సాహం
-- కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
దేశంలో ఉన్నత విద్యను మరింత ప్రోత్సహించేందుకు ఉన్నత విద్య ఆర్థిక సంస్థ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ, (హెచ్‌ఈఎఫ్‌ఏ) పరిధిని పెంచాలని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం నిర్ణయించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో ఉన్నత విద్యా ఆర్థిక సంస్థ పెట్టుబడిని పదివేల కోట్లకు పెంచాలని నిర్ణయించటంతోపాటు విద్యా రంగంలో వౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు ఒక లక్ష కోట్ల రూపాయలను సేకరించాలని ప్రధాని ఆదేశించారని రవిశంకర్ తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పాఠశాల విద్య, ఏయిమ్స్ లాంటి సంస్థల్లో ఉండే వైద్య సంబంధ వౌలిక సదుపాయాలు, ఇతర వైద్య, ఆరోగ్య సంస్థల్లో ఏర్పాటు చేసేందుకు, కేంద్రీయ విద్యాలయాలకు ఈ నిధి నుండి ఆర్థిక సహాయం చేస్తారని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఉన్నత విద్య ఆర్థిక సంస్థ రానున్న నాలుగు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలను సేకరిస్తుంది చెప్పారు.