Others

విమర్శ అస్తిత్వాన్ని కోల్పోతోందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన కాలంనుండి ఆధునిక కాలం వరకు తెలుగు సాహిత్యానికి వెన్నుముకగా నిలిచింది పదునైన విమర్శే. ఒక్క సాహిత్య రంగంలోనే కాదు, ఏ రంగంలో చూసినా నాణ్యతకు వారధిగా విమర్శ కనబడుతుంది. గాలి వానల బీభత్సానికి ఎదురొడ్డి నిలచిన వృక్షమే మహావృక్షమవుతుంది అన్న చందాన, విమర్శల ధాటికి తట్టుకు నిలబడిన సాహిత్యమే ఉత్తమ విలువలు కలిగిన సాహిత్యం అవుతుంది. ఎక్కడయితే విమర్శనాత్మక దృష్టి ఉండదో అక్కడ హెచ్చుతగ్గులు, నైపుణ్య ప్రభావితాలు ఉండవు. కాబట్టి గొప్ప సాహిత్యం రావాలన్నా, అది గుర్తింపబడాలన్నా సహేతుక విమర్శ తప్పనిసరి. అయితే ప్రస్తుత ఆధునిక సమాజంలో విమర్శ విశేష ప్రాధాన్యాన్ని కలిగి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజంలో ఆర్థికపరమైన స్థిరత్వం, సామాజిక మాధ్యమాలు మారుమూల ప్రాంతాలకు చేరువవడం, వార్తాపత్రికలూ మరియు వివిధ సాహితీ సేవాసంస్థల ప్రోత్సాహం కారణంగా నవతరం కవులు అనుకోని విధంగా సాహిత్య రంగంలో దూసుకుపోతున్నారు. ఏ పాఠకుడు అయినాసరే నాణ్యమైన పుస్తకాలనే కోరుకుంటాడు. అంతేనా, యువ రచయితలు సైతం అలాంటి నాణ్యమైన రచనలు చదవడం ద్వారానే తమనుతాము సంస్కరించుకోగలిగి, ప్రభావవంతంగా మారగలుగుతారు. పరిణతితో కూడిన సాహిత్యాన్ని సాహితీ క్షేత్రంలో పారించగలుగుతారు. మరి సాహిత్యంలో నాణ్యతకు ఇంత ప్రాముఖ్యమున్న పరిస్థితుల్లో, ఏ రచనలో ఎంత సాహిత్యముందో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేది సాహిత్యాన్ని అవపోసనపట్టిన విమర్శకులే. దాని ఆధారంగానే ఉన్నత ప్రమాణాలున్న రచనలు వెలుగులోకి వస్తాయి. ప్రమాణాలు లేనివి కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే సాహిత్యానికి విమర్శను వెనె్నముకగా చెప్పవచ్చు.
అయితే సాధారణంగా సాహిత్య పుస్తకాలలో ముందుమాటలు చూస్తూనే ఉంటాము. వీటినే సమీక్షలు అని అంటారు. మరి విమర్శ, సమీక్ష రెండూ ఒకటేనా అంటే ఇవి స్థూలంగా ఒకేలా తోచినా, సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ రెండింటి మధ్య వైరుధ్యాలున్నాయి. అయితే ప్రస్తుత కాలంలో ఈ రెండూ తమ ఉనికిని చాటుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుతమున్న సమీక్షలను ఆధారంగా చేసుకుని ఒక పుస్తక సారాన్ని అంచనావేయడం దాదాపు అసాధ్యంగా ఉంది.
విమర్శకు కల కారణాలను తెలియపరచడం విమర్శకుడి కనీస బాధ్యత. అప్పుడే ఆ రచయితా తన తప్పులని సరిచేసుకుని, భవిష్యత్తులో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాడు. కానీ ఇంతటి సున్నిత అంశాలని ఆయా విమర్శకులు విస్మరిస్తుండడంతో విమర్శకుడికి మరియు రచయితకు మధ్య భేదాభిప్రాయాలు రావడంతోపాటు, విమర్శను గౌరవించలేని స్థితి నేడు నెలకొంది. నారాయణరెడ్డిగారు అన్నట్లు ఇపుడిపుడే వెలుగుతున్న దీపాలను రెండుచేతులు అడ్డుపెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత అనుభవజ్ఞులపై, విమర్శకులపై ఉంది. కావున సమీక్షలు వెలువరించే ముందు, విమర్శనాస్త్రాలు సంధించే ముందు హేతుబద్ధ ధోరణిని అనుసరించడం ఉత్తమం.
స్థూలంగా సమీక్షిస్తే ఎన్ని పుస్తకాలకి ముందుమాటలు రాసాము, ఎన్ని సభలకు అధ్యక్షత వహించాము అనేదానికన్నా, ఆయా సమీక్షలు ఆయా రచయితలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, సాహిత్య క్రియాశీలతకు ఎంతవరకు దోహదం చేస్తుంది అనే కోణంలో చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రెండింటి అంతిమ లక్ష్యం క్షేత్రాన్ని దేదీప్యమానం చేయడమే.
మరి విమర్శలు ఎవరిపై చేయాలి, సూచనలను ఎవరికి ఇవ్వాలి అన్నది అనుభవజ్ఞులు గుర్తెరిగి నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. అనుభవం ఉన్నవారిపై విమర్శ ఎక్కువ సకారాత్మక ప్రభావాన్ని చూపిస్తే, ఇపుడిపుడే సాహితీ క్షేత్రంలో మొలకలై వస్తున్న యువగళంపై సూచనలు అమిత ప్రభావాన్ని చూపిస్తాయి. విమర్శలోని లోతుల్ని అవగతం చేసుకోవాలంటే వారికి కనీస అనుభవసారం తప్పనిసరి. అప్పుడే విమర్శల ధాటికి తట్టుకుని నిలబడగలుగుతారు. లేదంటే వారి ఆరాటం గాలిలో ప్రమిదలుగా మారే ప్రమాదం ఉంది. ఇది తెలుగు సాహిత్యానికి శుభసూచకం కాదు. యువకులను విమర్శించడంకన్నా, వారి నైపుణ్యాలను పెంచే చర్యలపై దృష్టి కేంద్రీకరించాలి. ఇక విమర్శకుడికి అర్హత అవసరమా అని ప్రశ్నిస్తే, తప్పనిసరి అన్నదే సమాధానం. విమర్శ చేయాలంటే ఆయా అంశాలపై సంపూర్ణ అవగాహన, అనుభవం ఉండి తీరాలి, లేదంటే విమర్శ అసంపూర్ణంగా మిగలడమేకాక రచయిత మనోభావాల్ని అది దెబ్బతీస్తుంది. కాబట్టి విమర్శకులు వీలయినంత అవగాహనతో ముందుకెళ్లడం తప్పనిసరి. ప్రస్తుత కాలంలో తెలుగు సాహిత్యంలో విమర్శనాత్మక ప్రక్రియ అంత చురుకుగా మాత్రం లేదనేది నిర్వివాదాంశం. దురదృష్టవశాత్తు సాహిత్యంలోకూడా రాజకీయాలు ఎక్కువయ్యాయి. కూటములు, వర్గాలు ఎక్కువయి ఆధిపత్యపోరు కూడా అంతర్లీనంగా జరుగుతోంది. తమ వర్గంవారిని కాపాడుకుంటూ, అవతలి వర్గం వారిని విమర్శించే సంఘటనలు ఎక్కువయ్యాయి. కొన్ని సంఘటనలను చూస్తుంటే కేవలం రచనలు చేసేటపుడు మాత్రమే రచయిత మనసు నిష్కల్మషంగా ఉంటుంది అని అర్థం అవుతుంది. ఉత్తమ పురస్కారాల్లో, రచనల్లో అంతగా ప్రమాణాలు లేనివి గుర్తింపబడుతుండడం తెలుగు సాహిత్యానికి ఆమోదయోగ్యం కాదు. వీటిని ఎండగట్టేది విమర్శే. విమర్శనాత్మక దృష్టి క్రియాశీలంగా ఉన్నప్పుడే నాణ్యమైన రచనలకు గుర్తింపు లభిస్తుంది. అలాంటి విమర్శకులు సాహిత్యంలో అరుదుగా కనిపిస్తుండడం బాధాకరం. ఆరోగ్యకరమైన విమర్శనా చర్చ జరిగినపుడే గొప్ప రచనలు పురుడుబోసుకుంటాయి. విమర్శకు, గొప్ప రచనలకు అవినాభావ సంబంధం వుంది. విమర్శ ఎదురవనపుడు రచయిత తనను తాను పరిపూర్ణత సాధించినట్లుగా భావిస్తాడు. తద్వారా నిత్య విద్యార్థి అనే చెరనుండి విడివడి, తనకే అంతా తెలుసనే స్థితికి చేరుకుంటాడు. కాబట్టి విమర్శ రచయితని నిత్య విద్యార్థిని చేస్తుంది. అలాగే విమర్శకు ప్రతి విమర్శా తప్పనిసరి. సాహిత్య నాణ్యతకు విమర్శ వెనె్నముక అయితే, విమర్శకి ప్రతి విమర్శ వెనె్నముక. అపుడే విమర్శ సరైన దృక్కోణంలో వెళ్తుంది. కాబట్టి సహేతుక విమర్శనాత్మక శైలితో కూడిన విమర్శ సర్వదా ఆమోదయోగ్యమే.

- పరవస్తు విశ్వక్సేన్