జాతీయ వార్తలు

రూ.2600 కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 21: వరదలు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తక్షణమే రూ.2600 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గత పది రోజుల్లో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 223 చేరుకుంది. దాదాపు పది లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మంగళవారం ఇక్కడ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతస్థాయి సమావేశంలో వరద పరిస్థితిని, పునరావాసన చర్యలను సమీక్షించారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని మంత్రివర్గం కోరింది. ఈ నెల 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గత వంద సంవత్సరాల్లో మునుపెన్నడూ లేని విధంగా సంభవించిన వరదలు, భారీ వర్షాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. వరదల వల్ల కేరళ రాష్ట్రానికి రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇంతవరకు కేంద్రం రూ.680 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో పునర్నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సి ఉందని, దీనికి అనుగుణంగా కేంద్రం రుణ పరిమితిని పెంచాలని కోరనున్నట్లు ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు. బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3 శాతం వరకు రుణాలు తీసుకోవచ్చని, ఈ పరిమితిని 4.5 శాతానికి పెంచాలని కోరినట్లు ఆయన చెప్పారు. అదనంగా రూ.10,500 కోట్ల రుణాలను సేకరించేందుకు కేంద్రం అనుమతి అవసరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం, ఎన్జీవో సంస్థలు రంగంలోకి దిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్థిక సాయం వెల్లువెత్తుతోంది. ఆర్థికసాయం ప్రకటించిన వారిలో కార్పోరేట్ సంస్థలతో పాటు విదేశాలు కూడా ఉన్నాయి. యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో రుణాల చెల్లింపుపై ఒక ఏడాది పాటు మారటోరియం ప్రకటించాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. పల్లపు ప్రాంతాల నుంచి బాధితులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 3,200 శిబిరాల్లో 10.78 లక్షల మంది బాధితులు తలదాచుకుంటున్నారు. వీరిలో 2.12 లక్షల మంది మహిళలు, ఒక లక్ష మంది పిల్లలు ఉన్నారు. ఎర్నాకుళం, త్రిశూర్, పతనంతిట్టా, అలప్పూజా, కొల్లాం జిల్లాల్లో పలు పట్టణాలు, గ్రామాలు, పొలాలు నీట మునిగాయి. ఇక్కడ పునర్నిర్మాణం పనులు నెలల కొద్దీ చేపట్టాల్సి ఉంటుంది. గత ఐదు రోజుల్లోనే 1.63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం విజయన్ చెప్పారు. కేరళలో సంప్రదాయబద్ధంగా ఓనం పండుగను నిర్వహిస్తారు. కాని వరదలు, భారీ వర్షాల వల్ల ఓనం పండుగ ఉత్సవాలను ప్రజలు జరుపుకోలేకపోతున్నారు. ఈ పండుగను ఈ నెల 25వ తేదీన జరుగుతుంది. కాగా ఓనం పండుగ కోసం వసూలు చేసిన విరాళాలను వరద బాధితుల సహాయం కోసం ఖర్చుపెట్టాలని పలు సంఘాలు నిర్ణయించాయి. బక్రీద్ పండుగను కూడా నిరాడంబరంగా జరపాలని ముస్లిం వర్గాలు నిర్ణయించాయి. త్రిశూర్, మల్లపురం, కొజికోడ్‌లో లక్షలాది ఇండ్లు జలమయమయ్యాయి. శిబిరాల నుంచి ఇండ్లకు వెళ్లేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. చాలా మంది ప్రజలు సర్వం కోల్పోయి షాక్‌కు గురయ్యారు. ఇళ్లు మునిగాయి. ఇంట్లోని వస్తువులు పనికిరాకుండా పోయాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టులతో మునిగాం. ఇక ఓనం పండుగను ఎలా జరుపుకుంటాం అంటూ బాధితులు చెబుతున్నారు. రవాణా సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా నీళ్లలో వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాగా వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో పునర్నిర్మాణ పనులకు సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

చిత్రం..కేరళలో వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సహాయక సిబ్బంది...