ఉత్తరాయణం

నాసిరకంగా భవన నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో సైతం నేడు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు విచ్చలవిడిగా అపార్ట్‌మెంట్లను నిర్మించడం పరిపాటిగా మారింది. ధనార్జనే ధ్యేయంగా అడ్డగోలుగా బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి స్థలం లభ్యం కావడం అసాధ్యం కావడంతో అపార్ట్‌మెంట్ల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని బిల్డర్లు నాసిరకం నిర్మాణాలను చేపడుతున్నారు. దీంతో నిర్మాణ దశలోనే బహుళ అంతస్థుల భవనాలు కుప్పకూలుతున్నాయి. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేటలో నాలుగు అంతస్థుల భవనం ఆకస్మికంగా కుంగిపోవడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. భవన నిర్మాణం లోపాల మయం కావడంతో కుంగిపోయిందని అధికారులు తీరుబడిగా చెబుతుంటారు. ఇలా భవనాలు కుప్పకూలినపుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం సర్వసాధారణమైంది. ఈ ఘటనలపై విచారణలు తూతూమంత్రంగా ముగుస్తాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు అలవాటు పడి, తమ విధులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. దుర్ఘటనలు జరిగినపుడు మృతుల కుటుంబాలను పరామర్శించడం, నష్టపరిహారం ప్రకటించడం కన్నా- అనుమతులు లేకుండా భవనాలను నిర్మించేవారిని ముందుగానే గుర్తించి చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. నిర్మాణంలో ఉన్న భవనాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించాలి. నిబంధనలను ఖాతరు చేయని బిల్డర్లపై, కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు అమలు చేయాలి. ప్రజలు కూడా అనుమతుల గురించి ఆరా తీసి ఇళ్లను కొనాలి.
-కామిడి సతీష్ రెడ్డి, జెడలపేట