తూర్పుగోదావరి

కాకినాడలో చంద్రబాబును అడ్డుకుంటాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 25: ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబరు 1వ తేదీన కాకినాడ రానున్న నేపథ్యంలో ఆయనను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య చెప్పారు. జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతికి నిరసనగా ఇందుకు నిర్ణయించినట్టు తెలిపారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజల తరఫున తాము అడుగుతున్న ప్రశ్నలకు జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పంటి వైద్యం కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రజల సొమ్ము 2.8 లక్షల రూపాయలను ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. జిల్లాలో ఇంతవరకు ఎన్ని గృహాలు మంజూరు చేశారో లెక్కలు చెప్పగలరా అని ప్రశ్నించారు. కాకినాడ స్మార్ట్‌సిటీ అభివృద్ధిలో భాగంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. స్మార్ట్‌సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే, అమరావతి నుండి అవినీతిని మానిటరింగ్ చేస్తున్నారా అని మాలకొండయ్య నిలదీశారు. కాకినాడ కార్పొరేషన్‌లో అవినీతిపై విచారణ జరగకుండా అధికారులను బదిలీ చేసి, బలి చేస్తున్నారన్నారు. జిల్లాలో నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకాలకు వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కాకినాడ రూరల్ వలసపాకలకు చెందిన పేద భార్యాభర్తలిద్దరు 50వేల ఉపాధి హామీ నిధుల కోసం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. మూడేళ్ళుగా ఆ పేదలను వేతనాలివ్వకుండా తిప్పుతున్నారని, ఇటువంటి ఉదాహరణలు అనేకం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. జిల్లాలో లంక గ్రామాల్లో కాలువలపై వంతెనలు నిర్మించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదన్నారు. నేడు వరదలొచ్చినా లంక గ్రామాల ప్రజల భద్రతకు తీసుకున్న దాఖలాల్లేవని విమర్శించారు. వరదలొచ్చి పోతున్నాయని, ముంపు ప్రాంతాల ప్రజలను మాత్రం ఆదుకున్న నాథుడు లేడని వాపోయారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. ఏజన్సీ ప్రజల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ విధమైన శ్రద్ధ లేదని వ్యాఖ్యానించారు. ఏజన్సీ ప్రజల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని విమర్శించారు. జిల్లాలో అనుమతి లేకుండా పెద్ద ఎత్తున రొయ్యల చెరువులు తవ్వుతున్నారన్నారు. బీసీ ఎస్సీ మత్స్యకార వర్గాలు అనేక సమస్యల్లో కూరుకుపోయాయని, ఆయా వర్గాలకు చెందిన కార్పొరేషన్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఓట్లతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని మాలకొండయ్య పేర్కొన్నారు.

కోర్టు ఆవరణలో నాగుపాము హల్‌చల్
అమలాపురం, ఆగస్టు 25: అమలాపురంలో కొత్త నిర్మిస్తున్న కోర్డు భవనంలోకి శనివారం నాగుపాము ప్రవేశించి సిబ్బందికి ముచ్చెమటలు పట్టించింది. శనివారం నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులకు సుమారు ఆరు అడుగలకు పైబడిన నాగుపాము కనిపించడంతో వారు బెంబేలెత్తుతూ పరుగులు తీసి విషయాన్ని అడిషనల్ సివిల్ జడ్జి పవన్‌కుమార్‌కు తెలిపారు. పవన్ కుమార్ ఆదేశాల మేరకు ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన పాములను పట్టే జేజీ వర్మకు సమాచారం అందించారు. వర్మ హుటాహుటిన అక్కడకు చేరుకుని చాకచక్యంగా దానిని బంధించాడు. దీంతో కోర్టు సిబ్బందితో పాటు నిర్మాణ పనులు చేస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈసందర్భంగా సివిల్ జడ్జి పవన్‌కుమార్‌తో పాటు డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు, స్థానికులు వర్మను అభినందించారు. ఈసందర్భంగా వర్మ మాట్లాడుతూ పాములను చంపవద్ధని, ఎక్కడైనా ఎటువంటి పాము కనిపించినా తన సెల్ నెం.9949956232, 9666113235 కు ఫోన్ చేస్తే దానిని భద్రంగా పట్టుకుని దూరప్రాంతంలో వదులుతానన్నారు. ఇలా చేసినందుకు తనకేమీ పారితోషికం చెల్లించనవసరంలేదని వర్మ తెలిపాడు.