జాతీయ వార్తలు

అన్నీ మంచి శకునములే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
==========
* మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిస్థితులు
శివపురి (మధ్యప్రదేశ్), నవంబర్ 18: గత పదిహేను సంవత్సరాలుగా మధ్యప్రదేశ్‌లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పదవిలోకి రావడమన్నది ఈసారి అత్యంత కీలకమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. అన్నీ అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తప్ప మరెప్పుడూ అధికారంలోకి రాలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ను బీజేపీ ఆధిపత్యం నుంచి తప్పించేందుకు, అదేవిధంగా తమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అహరహం శ్రమిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న విషయంలో తమమధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్న ఆయన కలసికట్టుగానే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తమకు సంబంధించినంతవరకు పదవి కోసం పాకులాడటం లేదని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సింధియా వెల్లడించారు. గత ఆరు రోజులుగా తాను రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించానని, ఈ నెల 26న ప్రచారం ముగిసేలోగా దాదాపు 60 నియోకవర్గాల వరకు ప్రచార కార్యక్రమాన్ని చేపడతానని తెలిపారు. మొదటినుంచి కూడా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ - బీజేపీల మధ్య ప్రధాన పోటీ జరుగుతూ వస్తోంది. అయితే 2003 నుంచి ఇప్పటివరకూ కూడా బీజేపే అధికారంలో వుండటం కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నీరుగారిపోయే పరిస్థితికి చేరుకుందన్న కథనాలు వెలువడ్డాయి. అందుకే ఈసారి కాకపోతే మరెప్పుడూ అధికారంలోకి రాలేమని పట్టుదలతోనే తాము ముందుకు సాగుతున్నామని సింధియా వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు ప్రచారమే సర్వస్వంగా పార్టీ నాయకులందరూ శ్రమిస్తారని సింధియా వెల్లడించారు. ఇంతకుముందు కంటే కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగయ్యాయని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం సర్వశక్తులతో పార్టీ శ్రేణులన్నీ ప్రచారం సాగిస్తున్నాయని, ముఖ్యంగా ప్రచార కమిటీ సారథిగా ఇందుకు తాను నేరుగా బాధ్యత వహిస్తున్నానని సింధియా తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలన్న దానిపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం అవుతుందని ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటికిప్పుడు ఎవరికీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న పట్టుదల లేదని, ముందుగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో దీర్ఘకాల అధికార లేమినుంచి తప్పించాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు సక్రమమైన పాలన అందే అవకాశం ఉంటుందని వెల్లడించిన ఆయన ఏ నాయకుడ్నీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధినాయకత్వం ప్రకటించకపోవడాన్ని సమర్థించారు. ఒక రకంగా ఇది పార్టీ నేతల మధ్య ఎలాంటి అపశ్రుతులకు అవకాశమివ్వని పరిణామమేనని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. సింధియాతోపాటు కమల్‌నాథ్, దిగ్విజయ్‌సింగ్ సహా అనేకమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ తరపున ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన పలు ఎన్నికల సర్వేలను ప్రస్తావించిన సింధియా అన్నీ కూడా కాంగ్రెస్ అనుకూల సంకేతాలనే అందించాయని తెలిపారు. అయితే సర్వేల ఫలితాలను ఆలంబనగా చేసుకుని ఇక అధికారం తమదేనన్న ధీమాతో తాము వ్యవహరించడం లేదని, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ శ్రేణులన్నీ ప్రచారం సాగిస్తున్నాయని తెలిపారు. సర్వేల విషయంలో పూర్తిస్థాయిలో నమ్మకం పెట్టుకోవడానికి వీల్లేదని, గతంలో వీటి ఫలితాలు విఫలమైన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు. తనకు సంబంధించినంతవరకు తన అంచనాలు, నిర్ణయాల మేరకే వ్యవహరించి ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. తనకెప్పుడూ అతి విశ్వాసం లేదని, చివరి క్షణం వరకూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే ఊపిరిగా పనిచేస్తామని తెలిపారు. ఏడున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో 5.30 కోట్లకు పైగా ఓటర్లున్నారు. వీరందరి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని పేర్కొన్న ఆయన ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గేందుకు ఇటు అర్థబలాన్ని, అధికార బలాన్ని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల వ్యూహం గురించి విజయం సాధించేందుకు అది వేసే ఎత్తుల గురించి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో తాను లోతుగా అధ్యయనం చేశానని, వాటికి అడ్డుకట్ట వేసే రీతిలోనే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళుతున్నానని తెలిపారు.