తూర్పుగోదావరి

భీమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, నవంబర్ 19: సామర్లకోట పంచారామ క్షేత్రం భీమేశ్వరాలయ ప్రాంగణం సోమవారం తెల్లవారుజామున ఓం నమశ్శివాయ పంచాక్షరి నామ జపంతో మార్మోగింది. పవిత్ర కార్తీక మాసం రెండో సోమవారం భీమేశ్వరాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి 9 గంటల వరకూ సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా వేస్తున్నారు. 150కు పైగా పంచారామాల ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో యాత్రీకులు తరలివచ్చారు. అయితే పాలకొల్లు పంచారామ క్షేత్రంలో అర్చకుడు ఆలయంలో మృతి చెందిన కారణంగా సంప్రోక్షణ పూజల అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఆలయం తెరవడంతో సోమవారం అర్ధరాత్రి వరకూ సామర్లకోటకు పంచారామాల బస్సులు వస్తూనే ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. ఆలయ పుష్కరిణిలో, గోదావరి కాల్వలో పుష్కరిణి వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. దీప దానాలు, సాలగ్రామ దానాలు అధిక సంఖ్యలో చేపట్టారు. అలాగే రుద్రాభిషేకాలు, అభిషేకాలు నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున 3.30 గంటలకు గోవు, దూడ ప్రదక్షణ పూజలు, తదుపరి వినాయక పూజ, అనంతరం కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ స్వామివారి యోగ లింగానికి పిఠాపురం మహారాజ గోత్రనామాలతో తొలి అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు చేపట్టారు. తరలివచ్చిన వేలాది మంది భక్తులు ఆలయ ధ్వజస్తంభం, రావిచెట్టు, మారేడు చెట్టు, జమ్మి వృక్షాలు, కాలభైరవుని ఆలయం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. అలాగే ఆలయంలో ధ్వజస్తంభం చెంతన వున్న మహా శివలింగానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆలయ పుష్కరిణిలో జలాలను పోటీలు పడి తెచ్చి ఓం నమశ్శివాయ నామాలు జపిస్తూ అభిషేకాలు చేశారు. పంచారామాల యాత్రీకులకు పులిహోర, వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేపట్టారు. ఆలయం వద్ద భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే జగదీష్‌మోహన్ (బాబు), సభ్యులు, భక్తసంఘం నాయకులు, దీపారాధన సంఘం నాయకులు, అన్నదాన ట్రస్టు నాయకులు పర్యవేక్షించారు. లక్షపత్రి పూజల్లో భాగంగా స్వామివారికి అమ్మవారికి ఉదయం నుండి రాత్రి వరకూ కాకినాడకు చెందిన పాత్రికేయుడు కవి స్వాతి ప్రసాద్ కుటుంబం, తిరుపతికి చెందిన గాలి ఆనందరావు కుటుంబీకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల రద్దీతో భీమేశ్వరాలయం కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ సతీమణి, పలువురు జిల్లా జడ్జీలు, ప్రముఖులు కార్తీక మాసం రెండో సోమవారం పూజల్లో పాల్గొన్నారు. భక్తుల బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లను పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు, సీఐ వై యువకుమార్, సామర్లకోట ఎస్సై ఎల్ శ్రీనువాసు నాయక్, పలువురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు, సీసీలు, హోంగార్డులు పర్యవేక్షించారు.
ద్రాక్షారామంలో...
రామచంద్రపురం: ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయానికి కార్తీక మాస రెండో సోమవారం భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారికి అర్చకులు విశేష అభిషేకం, పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో పెండ్యాల వెంకట చలపతిరావు నేతృత్వంలో వివిధ ఆలయాల సిబ్బంది, ద్రాక్షారామ ఆలయ సిబ్బంది భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. థ్వజస్తంభం వద్ద మహిళలు కార్తీక దీపారాధనలు నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, స్థానిక డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్ దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. పంచారామ దర్శిని పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల ఆధ్వర్యంలో బస్సులు నడిపారు. ధాన్యం కమిషన్ వ్యాపారులు, రైస్ మిల్లర్ల నేతృత్వంలో భారీ ఎత్తున అన్నదాన వితరణ చేశారు. శ్రీ పైండా వెంకన్న రామకృష్ణయ్య అన్నదాన సత్రంలో ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ పైండా సుబ్రహ్మణ్య జగన్నాథ సత్యప్రసాద్ జమీందారు నేతృత్వంలో భారీ అన్నదానం నిర్వహించారు. రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్ నేతృత్వంలో ఎస్సై గోవాడ వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.