జాతీయ వార్తలు

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు విడుదల కావడం, తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు సంబంధించిన దానితో పాటు పలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ, ఆయన మంత్రివర్గ సహచరులకు సంబంధించిన ఫొటోలు, ప్రభుత్వ పథకాల ప్రచారం, వాటికి సంబంధించిన వార్తలను తొలగించారు.
అయితే ఇంకా కొన్ని వెబ్‌సైట్లలో కొందరు మంత్రుల ఫొటోలు, వారికి సంబంధించిన సమాచారం మాత్రం కన్పిస్తూనే ఉంది. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు, నేతలకు తక్షణం ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు ముగిసే వరకు అమలులో ఉండే ఈ నియమావళి ప్రకారం కేంద్రంలో కాని, రాష్ట్రాల్లో కాని అధికారంలో ఉన్న మంత్రులు తదితరులు తమ హోదాను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదు. అలాగే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఆఖరికి ప్రధాన మంత్రి సైతం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఏ రూపంలోనూ నిధులు ఇవ్వడం కాని, ప్రాజెక్టులకు, పథకాలకు నిధులు విడుదల చేయడం, విడుదల చేస్తామని ప్రకటించడం కాని చేయరాదు. అలాగే ఎన్నికల ప్రచారం నిమిత్తం మంత్రులు తమ అధికార యంత్రాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన ప్రవర్తన నియమావళిని కేబినెట్ కార్యదర్శి, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపుతూ ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఆయా మంత్రుల ఫొటోలు, వారికి సంబంధించిన వార్తలను తక్షణం తొలగించడం లేదా కన్పించకుండా చేయడం చేయాలని ఆదేశించింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో ప్రధాని కార్యాలయం వెంటనే తన పీఎంఓ వెబ్‌సైట్‌లో ఉన్న నరేంద్రమోదీకి సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారాన్ని తొలగించింది. అలాగే ప్రెస్ ఇన్ఫర్‌మేషన్ బ్యూరో వెబ్‌సైట్‌లోని ప్రభుత్వ సమాచారాన్ని సైతం తీసివేశారు. కాని న్యాయశాఖ మంత్రిత్వ వెబ్‌సైట్‌లో ఆ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సహాయ మంత్రి పీపీ చౌదరికి చెందిన ఫొటోలను తొలగించడం కాని, ప్రధాని నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమానికి సంబంధించిన లింక్‌లు మాత్రం తొలగించకుండా యథావిధిగానే ఉంచారు.
అలాగే మైనారిటీ వ్యవహార శాఖ మంత్రిత్వ శాఖలో సంబంధిత మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, సహాయ మంత్రి వీరేందర్‌కుమార్ ఫొటోలు సైతం ఇంకా అలాగే ఉన్నాయి. ఇలావుండగా బహిరంగ ప్రదేశాలైన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, మున్సిపల్ బిల్డింగ్‌లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల ఆస్తులకు చెందిన గోడలపై, ఇళ్లపై రాతలు రాయడం, పోస్టర్లు అంటించడం, హోర్డింగ్‌లు, బేనర్లు, జెండాలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషిద్ధమని పేర్కొన్న ఈసీ ఈ మేరకు కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.