వరంగల్

మేడారం జాతర పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి 31లోగా పనులు పూర్తికావాలి * మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్ ఆదేశం
వరంగల్, డిసెంబర్ 4: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క - సారక్క జాతర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 17 నుండి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతరకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న మేడారం జాతర ఏర్పాట్లను కనీవినీ ఎరుగని రీతిలో చేయాలని వారు అధికారులను ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్ల కోసం ముందస్తుగానే ముఖ్యమంత్రి కెసిఆర్ 101 కోట్లను కేటాయించారు. జనవరి మొదటి వారంలో క్షేత్రస్థాయిలో జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్ తెలిపారు. జనవరి 31కల్లా అన్ని పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రులు అధికారులను ఆదేశించారు. పనులలో ఎలాంటి అవకతవకలు జరిగినా, నాణ్యత ప్రమాణాలు పాటించకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సమ్మక్క - సారక్క జాతరను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన పనులను మంత్రులకు అధికారులు వివరించారు. ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు గతంలో కంటే ఎక్కువగా మేడారం జాతరకు వచ్చే అవకాశం ఉన్నందున అత్యవసర సేవలైన అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు స్పష్టం చేశారు. తాగునీరు, పార్కింగ్, స్నానఘట్టాల విషయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాతరలో కల్తీ కల్లు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ శాఖ అధికారులు మంత్రులకు వివరించారు.
పంథా మారాలి
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోల హెచ్చరిక
* పీపుల్స్‌వార్ పేరుతో బచ్చన్నపేటలో పోస్టర్లు
* ప్రజాప్రతినిధులు అవినీతికి నిలువుటద్దాలని విమర్శ

బచ్చన్నపేట, డిసెంబర్ 4: చాలాకాలం తర్వాత బచ్చన్నపేటలో పీపుల్స్‌వార్ గెరిల్లా ఆర్మీ పేరుతో మండలకేంద్రం బచ్చన్నపేటలో శుక్రవారం రెండు చోట్ల పోస్టర్లు వెలియడంతో పాలక ప్రజాప్రతినిధుల్లో భయం మొదలైంది. బచ్చన్నపేట చౌరస్తా వద్ద ఓ చెట్టుకు, బిసి హాస్టల్ గేటు గోడకు మూడు పేజీల చొప్పున పోస్టర్లు వెలిశాయి. పీపుల్స్‌వార్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర కమిటీ నేత విప్లవ్‌కుమార్ మావో పోస్టర్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ పంథా మార్చుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్రమోదీ బహుళజాతి కంపెనీల చేతుల్లో బందీ అయ్యాడని, ప్రజల శ్రేయస్సును మరిచాడని విమర్శించారు. పాములాంటి ప్రైవేటు కంపెనీలను పెంచి పోషిస్తున్నాడని ఆరోపించారు. దేశానికి వెన్నముకలాంటి రైల్వేలో, దేశ భద్రతకోసం పనిచేసే సైన్యంలో సైతం విదేశీ కంపెనీల ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించి భరతమాతను తాకట్టుపెడుతున్నాయని మండిపడ్డారు. ఇకపోతే తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి రాకముందు నక్సల్ ఎజెండానే తమ ఎజెండా అని, ఇప్పుడు మిలిటెంట్లను కాల్చి చంపుతున్నాడని ఆందోళన వ్యక్తంచేశారు. సిఎం కుతూరు కవిత ఎన్‌కౌంటర్లు చేయిస్తోందని పోస్టర్లలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో శృతి, విద్యాసాగర్‌రెడ్డిలను పట్టుకొని కిరాతకంగా దాడిచేసి కాల్చిచంపారని ఆరోపించారు. ఆ సంఘటనకు ఎన్‌కౌంటర్ రంగుపూశారని ఆరోపించారు. శృతిని రేప్‌చేసి దారుణంగా హత్యచేశారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే సంఘటన ఎమ్మెల్యే, ఎంపి, మంత్రుల కూతుళ్లపై జరిగితే దోషులను పట్టుకొని ఉరి తీసేవారని అన్నారు. శృతి, సాగర్‌లవి పేద కుటుంబాలు కావడమే ఈ సంఘటనకు ఎన్‌కౌంటర్ పేరుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశావర్కర్లు, పంచాయతీ, మున్సీపాల్ సిబ్బంది సమ్మెలు, ధర్నాలు చేసినా ముందుకు రాని ప్రభుత్వం పోలీసులకు లక్షల్లో వేతనాలు పెంచి, ఎసి వాహనాలు ఇచ్చి కిరతాకపు పనులు చేయిస్తుందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేవారిని వేలాది రూపాయలు లాగుతున్నారని, వీరిని పట్టించుకునే నాథుడే లేరన్నారు. మిషన్ కాకతీయ పేరుతో నాయకులు జేబులు నింపుకొని అవినీతికి తలపడ్డా పట్టించుకునేవారు లేరన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొమరవెళ్లి ప్రభుత్వ భూమిని బినామి పేర్లతో అక్రమంగా పట్టా చేయించుకోవాలని చూస్తే జాయింట్ కలెక్టర్ అడ్డుకోగా జెసిని బెదిరించి పట్టాచేయించుకున్నాడని పోస్టర్లల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 826మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడితే అవి ప్రేమ విఫలమై చేసుకున్న ఆత్మహత్యలుగా చిత్రికరించి ఎమ్మెల్యేలు పోలీస్‌రికార్డుల్లో రాయిస్తున్నారని విమర్శించారు. అదే విధంగా మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో ఓ పేద మహిళ ప్రభుత్వ ఇండ్లు మంజూరు చేయించాలని ఓ ప్రజాప్రతినిధిని ఆశ్రయిస్తే మెడపట్టి బయటకు నెట్టివేయించిన సంఘటన జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల విధానాలు మారాలంటే యువత ప్రజాసైన్యంలో చేరాలని పిలుపునిచ్చారు. బచ్చన్నపేటలో పోస్టర్లు వెలిసిన సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ పోస్టర్లను తొలగించారు. ఎవరో ఆకతాయిలు అంటించిన పోస్టర్లుగా సమాధానం ఇచ్చారు.

టిఆర్‌ఎస్‌కు ఎంపిటిసిల ఝలక్ !?
* ప్రతిపక్షాలు పోటీలో లేకున్నా ఎంపిటిసిల ఫోరం నుండి పోటీ * అభ్యర్థిగా చంద్రవౌళి ఖరారు
వరంగల్, డిసెంబర్ 4: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి ఎంపిటిసి ఫోరం నుండి పోటీ తప్పేట్లు లేదు. స్థానిక సంస్థల్లో మెజార్టీ ఓటర్లు ఎంపిటిసిలే కావడంతో ఓట్లు మావే, సీట్లు మావే అన్న నినాదంతో ఎంపిటిసి ఫోరం నుండి ఫోరం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి చంద్రవౌళి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఎంపిటిసిల ఫోరం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, టిఆర్‌ఎస్‌కు బలం కాస్త అటో ఇటో తేడాతో సమానంగా ఉన్నప్పటికి టిఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో అనేక మంది స్థానిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిపోయింది. కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కూడా ముందుకు రాని పరిస్థితి. ప్రతిపక్షాలను బలహీనం చేయడంతో ఏకగ్రీవంగానే ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవాలన్న టిఆర్‌ఎస్‌కు ఎంపిటిసిల ఫోరం నుండి పోటీ తప్పే పరిస్థితి లేదు. మొన్నటి వరంగల్ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ విజయానికి ప్రతిపక్షాలన్నీ డీలా పడిపోయాయి. ఎంపిటిసిల ఫోరం నుండి మద్దతు ఇస్తామని పరోక్ష సంకేతాలు కాంగ్రెస్‌కు పంపుతున్నా నాయకులు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో ఇక ఎంపిటిసిల ఫోరం రంగంలోకి దిగి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని పావులు కదుపుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రజాప్రతినిధులం తామే అయినప్పటికీ ప్రభుత్వం ఎంపిటిసిలను పట్టించుకోవడం లేదన్నది వారి వాదన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిటిసిలకు విధులు, నిధులు కేటాయించక తమను చులకనగా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లకే పనికొస్తామే తప్ప అధికారం లేకుండా ఉత్సవ విగ్రహంలా మిగిలిపోతున్నామని మధనపడుతున్నారు. పంచాయతీలకు ఇస్తున్న నిధులను తమకు ఇవ్వకపోవడంతో సమస్యలను తామే పరిష్కరించుకునే విధంగా స్థానిక సంస్థల్లో మెజార్టీ ఓటర్లుగా ఉన్న తామే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫోరం ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రవౌళి ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఎంపిటిసిలంతా ఫోరం అభ్యర్థికే ఓటు వేస్తారని బలంగా నమ్ముతున్నారు. ఎవరు క్యాంపులు నిర్వహించిన ఓట్లు పడేది మాత్రం ఫోరం అభ్యర్థికేనని ఈ మేరకు లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు కొందరు ఎంపిటిసిలు తెలిపారు. ఇదిలావుండగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవంగానే అవుతుందని టిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. అధినేత టికెట్ ఎవరికి ఖరారు చేస్తే వారే ఏకగ్రీవంగా ఎన్నిక కావడమే తరువాయి అన్నట్లుగా టిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. దీంతో అధికార పార్టీలో పోటీ తీవ్రంగా నెలకొంది. ఆ పార్టీ నుండి బిసి కోటాలో కనె్నబోయిన రాజయ్యయాదవ్, కొండా మురళీధర్‌రావులు ఉండగా, ఓసిల నుండి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ముద్దసాని సహోదర్‌రెడ్డి, వరదారెడ్డిలు ఉన్నారు.

క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలి
* బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి

వడ్డేపల్లి, డిసెంబర్ 4: బిజెపి కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యలయంలో ముఖ్య కార్యకర్తలు సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను మొగిలి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 7న జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర పార్టీ విడుదల చేసిందని తెలిపారు. ఈ ఎన్నికలకు అనుగుణంగా జిల్లాలో 15 తేదీలోపు అన్ని బూత్ కమిటీలను, 23 తేదీలోపు అన్ని మండల కమిటీలను ఎన్నిక చేయాలన్నారు. ప్రతి మండలానికి 25 మంది క్రియాశీలక సభ్యులు ఉండాలని, మున్సిపాలిటీకి 50 మంది సభ్యులకు తగ్గకుండా ఉండాలని వివరించారు. జిల్లా కమిటీకి 75 శాతం కమిటీలు పూర్తి అయితేనే జిల్లా కమిటీ అర్హత పొందుతుందని పేర్కొన్నారు. 7న జరిగే జిల్లా కార్యవర్గ సమావేశానికి జాతీయ కౌన్సిల్ సభ్యులు, పార్లమెంట్ ఇన్‌చార్జి కన్వీనర్లు, మోర్చాల అధ్యక్షులు, నియోజక వర్గ ఇన్‌చార్జిలు, మండల అధ్యక్షులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమార్, త్రిలోకేశ్వర్, భద్రయ్య, వెంకట్, దశరథం తదితరులు పాల్గొన్నారు.

మూడో రోజు నామినేషన్లు నిల్
నరుూంనగర్, డిసెంబర్ 4: వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికకు సంబంధించి మూడోరోజైన శుక్రవారం కూడా నామినేషన్లు దాఖలు కాలేదని జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఈ నెల 9 వరకు సెలవు దినాల్లో మినహా ఉదయం 11 గంటల నుండి 3 గంటల మధ్య నామినేషన్ వేయవచ్చని చెప్పారు.
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
ఏటూరునాగారం, డిసెంబర్ 4: అప్పుల బాధ తాళలేక జిల్లాలో ఒకేరోజు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో ఒకరు ఏటూరునాగారంనకు చెందిన వారు కాగా, మరొకరు ములుగుకు చెందిన రైతు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయ. ఏటూరునాగారం మండలంలోని షాపల్లి గ్రామానికి చెందిన గద్దల రామయ్య (56) అనే రైతు పురుగుల మందు తాగి శుక్రవారం మృతి చెందాడు. వివరాలలోకి వెళ్తే... షాపల్లి గ్రామ రైతు రామయ్య గత కొనే్నళ్లుగా తన వ్యవసాయ భూమిలో వరి, వేరుశనగ పంటలను సాగుచేస్తున్నాడు. అతడికి నలుగురు కుమారులు కాగా ఇద్దరికి వివాహం చేయగా మిగిలిన ఇద్దరు చదువుకుంటున్నారు. అయితే ఏయేటికాయేడు పంట దిగుబడులు సరిగారాక నష్టం వాటిల్లడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా పొలంలో బోరు వేయించేందుకు రూ.లక్షా యాభైవేలు అప్పు చేశాడు. పంటలు సరిగా పండక పోవడంతో చేసిన అప్పులు తీర్చలేనని మనస్థాపానికి గురై శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపమారక స్థితికి చేరాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఏటూరునాటారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజిఎంకు తరలించాల్సిందిగా సూచించారు. ఎంజిఎంకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో రామయ్య మృతి చెందాడని బంధువులు తెలిపారు.
* రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి...
అప్పుల బాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న రైతు రామయ్య కుటుంబానికి 10 లక్షల ఎక్సిగ్రేషియా చెల్లించాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్నదాతలను ఆదుకుని ఆత్మహత్యలను నివారించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ములుగు: అప్పులబాధ భరించలేక రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మల్లంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్లంపల్లికి చెందిన చిట్టిరెడ్డి జక్కిరెడ్డి (42) తనకున్న మూడెకరాలతోపాటు మరో నాలుగెకరాలను కౌలుకు తీసుకుని పత్తి, పసుపు, మిరప పంటలు సాగుచేశాడు. పంటల సాగు కోసం రూ.6.70 లక్షలు అప్పు చేశాడు. దిగుబడి రాకపోవడంతోపాటు నీళ్లు అందక పంటలు ఎండిపోయాయి. దీంతోచేసిన అప్పులెలా తీర్చాలనే బెంగతో ఉన్న జక్కిరెడ్డి మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం
* రిజిస్ట్రార్ అల్త్ఫా హుస్సేన్
నక్కలగుట్ట, డిసెంబర్ 4: నేటి సమాజంలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి వ్యక్తికి ఎంతో అవసరమని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఖాజా అల్త్ఫా హుస్సేన్ అన్నారు. శుక్రవారం కెయులో అసిస్టెంట్ ప్రమోషన్ ప్రత్యేక శిక్షణ ముగింపు సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అల్త్ఫా హుస్సేన్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో కంప్యూటర్ విజ్ఞానం సర్వసాధారణమైందని అన్నారు. నిత్య నూతనమైన కంప్యూటర్‌ను నేర్చుకుంటేనే విధులను నిర్వహించే స్థాయికి వచ్చిందని తెలిపారు. కంప్యూటర్ అనేది నిత్యజీవితంలో భాగంగా మారిన ఈ దశలో విశ్వవిద్యాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరమని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకుంటే విశ్వవిద్యాలయ పరిపాలన సులభం అవుతుందని తెలిపారు. కెయు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామస్వామి మాట్లాడుతూ అనతి కాలంలోనే కంప్యూటర్ అవసరాలు ఎక్కువైనాయని అన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉద్యోగులు కూడా మారవలసిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఉద్యోగులలో నైపుణ్యం పెంపొందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో దయాకర్‌రావు, డాక్టర్ కోలా శంకర్, డాక్టర్ పుల్లాశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మార్పునకు స.హ చట్టం సాధనం
చట్టాన్ని ఆయుధంగా మార్చుకున్నప్పుడే సత్ఫలితాలు * కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్
నక్కలగుట్ట, డిసెంబర్ 4: సమాచార హక్కు చట్టమే సమాజంలో మార్పునకు దోహదపడుతుందని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ అన్నారు. పర్చ రంగారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో సమాచార చట్టంపై అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. కోదండ రామారావు అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీ్ధర్ మాట్లాడుతూ దేశంలో సగం మంది ప్రజలు తమ హక్కులేంటో తెలియకుండా జీవనం కొనసాగిస్తున్నారని, ఈ దుస్థితికి కారణం పాలకులు ప్రజలను చైతన్యం చెయకపోవడమే అని వివరించారు. సమాచార హక్కు చట్టం అనేది ఓ సాధనం అని, దానిని ఆయుధంగా మార్చుకున్నపుడే సమాజంలో సత్ఫలితాలు వస్తాయన్నారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారుల్లో తెలియని భయం నెలకొందన్నారు. పాలకులు ప్రభుత్వ పథకాల మాదిరిగానే సమాచార హక్కు చట్టాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి అవగాహన కలిగించాలని సూచించారు. సమాచారం ఉంటేనే ప్రశ్నించగలమని, ఒక ప్రశ్న ప్రభుత్వ విధానాలను మార్చగలదని పేర్కొన్నారు. ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఏ సమాచారాన్ని అయినా అడిగి తీసుకునే హక్కును ఈ చట్టం కల్పించిదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సామాజిక సేవకురాలు జ్యోతిరెడ్డి మాట్లాడుతూ యువత మేల్కొనాలని, యువతకు చట్టాలపై అవగాహన అవసరమని అన్నారు. లా కళాశాల అధ్యాపకులు డాక్టర్ విజయ్‌చందర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామానుజరావులు ప్రసంగించారు.

విచారణ మరిచారు.. బెదిరింపులకు దిగారు..
* కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు * లబోదిబోమంటున్న వివోలు

పాలకుర్తి, డిసెంబర్ 4: ఉప ఎన్నికలో ఐకెపికి చెందిన వివోలు బమ్మెర, మంచుప్పుల గ్రామాల్లో డబ్బులు పంచకుండా దాచుకున్నారని కథనాలు రావడంతో కలెక్టర్ వాకాటి కరుణ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో జిల్లా అడిషనల్ పిడి మనోహర్, ప్రాజెక్టు మేనేజర్లు పృధ్వీరాజ్, శ్రీనివాస్‌లు విచారణ చేపట్టారు. బమ్మెరలోని వివోలు రాపోలు లక్ష్మీ, రాపోలు శోభా, జంపాల లక్ష్మీలతో పాటు మంచుప్పులకు చెందిన వివోలు సైదులు, రేణుక, భానులను పిలిపించి విచారణ జరిపారు. డబ్బు పంపిణీపై వివోల ఆధ్వర్యంలో జరగలేదని హామీ పత్రాలు రాసివ్వాల్సిందిగా డిఆర్‌డిఎ, ఐకెపి ఉన్నతాధికారులు, సిసి యాదగిరిలు వివోలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు తమకేమీ తెలియదని, తామేమీ తప్పు చేయనట్లు అధికారులు రాసిస్తేనే విచారణ అధికారులకు హామీ పత్రాన్ని రాసిస్తామని ఖరాఖండిగా చెప్పారు. దీంతో ఉదయం 11 గంటలకు వచ్చిన అధికారులు సాయంత్రం 5 గంటల వరకు వేచిచూశారు. విలేఖరులు కార్యాలయం ముందు వేచి ఉండడంతో జంకిన అధికారులు వెళ్లిపోయారు. విచారణ గ్రామంలో చేపట్టాల్సి ఉండగా బెదిరింపులకు పాల్పడడానికి వివోలను ఐకెపి కార్యాలయానికి పిలిపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ వాకాటి కరుణ విచారణ నిస్పక్షపాతంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినా డిఆర్‌డిఎ అధికారులు పెడచెవిన పెట్టారు. ఎన్నికల్లో డబ్బులు పంచిన విషయాన్ని కప్పిపుచ్చడానికి తూతూమంత్రంగా విచారణ చేపట్టి విషయం బయటికి పొక్కకుండా దాస్తున్నట్లు రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విచారణ చేపట్టకుండా ఐకెపి కార్యాలయంలో వివోలను విచారించిన విచారణ అధికారులను కలెక్టర్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డిఆర్‌డిఎ ఎపిడి మనోహర్‌ను వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాలను విచారించామని తెలిపారు. వారు రాతపూర్వకంగా రాసిచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. వివోలు ఎలాంటి హామీపత్రం ఇవ్వలేదని చెబుతున్నా డిఆర్‌డిఎ ఎపిడి మనోహర్ హామీపత్రం రాసిచ్చినట్లు చెప్పడం కొసమెరుపు.

టెట్ రద్దు చేయాలి
తెలంగాణ విద్యార్థి వేదిక డిమాండ్ * డిఇఓ కార్యాలయం ముట్టడి
నక్కలగుట్ట, డిసెంబర్ 4: రాష్ట్రంలో టెట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం డిఇఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ముట్టడికి పెద్ద ఎత్తున బిఎడ్, డిఎడ్ విద్యార్థులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టివివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐత అనిల్ మాట్లాడుతూ 2011 మేలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టెట్ నిర్వహిస్తున్న సందర్భంలో చాత్రోపాధ్యాయులు, ఉపాధ్యాయ మేధావి వర్గాల్లో నిరసనలు వెల్లువలా వచ్చాయని గుర్తుచేశారు. అపుడు విషయాన్ని అర్థం చేసుకున్న కెసిఆర్, చంద్రబాబులు టెట్‌ను వ్యతిరేకించారన్నారు. చంద్రబాబు అన్నమాట ప్రకారం టెట్ రద్దు చేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రద్దు చేయకపోవడం శోచనీయమని తెలిపారు. తక్షణమే ముఖ్యమంత్రి కెసిఆర్ టెట్‌ను రద్దు చేస్తునట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.