S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌలిక సదుపాయాలతోనే పెట్టుబడులు

గుంటూరు, సెప్టెంబర్ 25: వౌలిక సదుపాయాల ప్రాజెక్టులే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే వారధులని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం ఉండవల్లిలోని సిఎం నివాసంలో వౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములైన ఇంధన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సీఆర్డీయే ఉన్నతాధికారులతో సుమారు మూడు గంటల పాటు సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులతో పారిశ్రామిక సంస్థలు విస్తరిస్తాయన్నారు. ఈ కారణంగా ఉపాధి కల్పన మెరుగుపడటంతో రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు దోహద పడతాయన్నారు.

రాజకీయాలు మాని జిల్లా అభివృద్ధికి సూచనలు, సలహాలివ్వాలి

వికారాబాద్, సెప్టెంబర్ 25: అఖిలపక్షంలోని పార్టీల నాయకులు రాజకీయాలు మాని కొత్తగా ఏర్పడబోతున్న వికారాబాద్ జిల్లా అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలని టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్.శుభప్రద్‌పటేల్ సూచించారు. ఆదివారం స్థానిక అర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎంను విమర్శించే అర్హత ప్రతిపక్ష నాయకులకు లేదని చెప్పారు.

ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం

నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 25: ముంపు ప్రాంతాల బాధితులను అన్ని విధాలుగా అదుకుంటామని మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కనకారెడ్డి పేర్కొన్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ముంపుకు గురైన షిర్డీనగర్, ఎన్‌యండిసికాలనీ, బండచెరువు నుండి లాలాపేట వరకు నాలాను స్థానిక కార్పొరేటర్, జిహెచ్‌యంసి అధికారులతో కలసి పరిశీలించారు. ఈసందర్భంగా ఎంపి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలలో నివసించే కాలనీవాసులు వర్షాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముంపు ప్రాంత బాధితులను కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్సింగ్‌రావు, పరశురాంరెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

ముంపు ప్రాంతాల్లో సైనిక సహాయం

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మహానగరంలో కురిసిన భారీ, అతి భారీ వర్షాల నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. భారీవర్షాలతో శివారులోని నిజాంపేట, హకీంపేట, అల్వాల్ ప్రాంతాలతో పాటు నగరంలోని బేగంపేట, అల్లంతోట బావి, వడ్డెర బస్తీ వంటి ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిన సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టిన సహాయక చర్యలు సక్రమంగా సాగకపోవటంతో శనివారం సైన్యాన్ని, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగటంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఆదివారం కూడా సైనికులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు నిజాంపేట, అల్వాల్, బేగంపేట, హకీంపేటల్లో సహాయక చర్యలు చేపట్టడంతో బాధితులకు కొండంత అండ దొరికింది.

ఉప్పల్‌లో కూలిన విద్యుత్ స్తంభం

ఉప్పల్, సెప్టెంబర్ 25: ఉప్పల్‌లో భారీ వర్షానికి ఆదివారం రాత్రి నడి రోడ్డుపై విద్యుత్ స్తంభం నేల కూలింది. మెరుపులతో కూడిన మంటలు రావడంతో స్థానికులు, వాహనదారులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. కేంద్రీయ విద్యాలయం వద్ద జరిగిన ఈ ఘటన చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి హబ్సిగూడ వరకు అంధకారం నెలకొంది.

బండారి లే అవుట్ కాలనీలో సహాయక చర్యలు

జీడిమెట్ల, సెప్టెంబర్ 25: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీ ఐదు రోజులుగా వరద నీటిలో కూరుకుపోయింది. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి వరద నీటిని బయటికి పంపించే చర్యలు చేపడుతున్నారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో వరద నీరు నిండి ఫ్లాట్‌లలో నివసించే బాధితులకు అన్ని విభాగాల అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. వరద నీటిని కాలనీలో నుండి పంపించే పనిలో అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాలనీకి పై భాగంలో ఉన్న తుర్క చెరువు కట్ట ప్రమాదకరంగా మారడంతో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ రక్షణ దళాలు డేంజర్ జోన్‌గా ప్రకటించి అటువైపు ఎవరినీ వెళ్లనివ్వకుండా రక్షణ చర్యలను చేపట్టారు.

తుమ్మచెరువుకు భారీ వ రద..లోతట్టు ప్రాంతాల్లో భయం

మేడ్చల్, సెప్టెంబర్ 25: పట్టణంలోని తుమ్మ చెరువులో సామర్ధ్యానికి మించి వరద నీరు పారుతుండటతో పరివాహక ప్రాంతాల్లోని కాలనీవాసుల్లో టెన్షన్ నెలకొంది. తుమ్మ చెరువులోకి భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు చెరుతుండటంతో చెరువుకు అలుగు లేకపోవడంతో నీరు బయటకు వెళ్లే మార్గంలేక కట్టకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉండటంతో పరిసర కాలనీ ప్రజానీకంలో తీవ్ర టెన్షన్ నెలకొంది. గతంలో చెరువు చివరకు అలుగుపారే విధంగా తూం ఉండేది. రానురాను పట్టణం అభివృద్ధి చెందడం దానితో పాటు బహుళ అంతస్తులు వెలువడంతో అదికాస్త కానపడకుండా రియల్టర్‌లు మాయం చేశారు.

వరద ముంపు బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

జీడిమెట్ల, సెప్టెంబర్ 25: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో భారీ వర్షాలకు ముంపు బారిన పడిన బాధితులను ఆదివారం కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పరామర్శించారు. సుభాష్‌నగర్‌లో వరద నీటి బాధితులను పరామర్శించి ఇంటింటికి తిరిగి మినరల్ వాటర్ బాటిళ్లను అందజేశారు. నాలాలో కొట్టుకుపోయిన దేవేందర్ కుటుంహానికి రూ.ఐదు వేల చెక్కును అందజేశారు. విహెచ్, కూన మాట్లాడుతూ బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆదుకుంటుందని అన్నారు. నిరుపేదలకు అండగా కాంగ్రెస్ నిలబడుతుందని, వరద బాధితులకు నితంతరం సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు.

సమస్య పూర్తయ్యే వరకు అన్ని శాఖల అండదండలు

జీడిమెట్ల, సెప్టెంబర్ 25: సమస్య పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు కాలనీలో ఉండి అండదండలు ఉంటాయని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట్ గ్రామం, బండారి లేఅవుట్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్‌తో కలిసి మంత్రి పర్యటించారు. కాలనీలోని బాదితులను పరామర్శించి సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల సహాయక చర్యల గురించి బాదితులను అడిగి ఆరా తీశారు. అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లలో వరద నీటిని సాధ్యమైనంత త్వరగా మళ్లించాలని బాదితులు మంత్రిని కోరారు.

సమాచార హక్కు ప్రజలకు ఓ ఆయుధం

చార్మినార్, సెప్టెంబర్ 25: సమాచార హక్కు ప్రజలకు ఓ ఆయుధం లాంటిదని, దీనివల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సమాచార హక్కు వికాస సమితి ఆవిర్భావ సదస్సు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాచార హక్కుపై ప్రతి పల్లె, గ్రామాల్లో కూడా అవగాహన పెంపొందించాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వికాస సమితి ప్రచారం చేయాలని సూచించారు.

Pages