సంపాదకీయం
నిగ్గుతేలిన బొగ్గు మరక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య
సౌభాగ్యముల్-అన్న కవివాక్కులు మాజీ
ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో ఇలా
ధ్రువపడింది. పదేళ్లపాటు ప్రధానమంత్రిత్వం
వహించిన అంతర్జాతీయ స్థాయి అర్థికవేత్త
అపరాధం చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు
లభించడం మన ప్రజాస్వామ్య చరిత్రలో మరో
విపరిణామం. బొగ్గు బొరియల-కోల్‌బ్లాక్స్-ను
ప్రభుత్వేతర సంస్థలకు, బహుళ జాతీయ
వాణిజ్య సంస్థలకు కేటాయించడంలో జరిగిన
ఘోరమైన అక్రమాలలో మన్మోహన్
భాగస్వామ్యం లేదన్న వాదం న్యాయస్థానాల్లో
వీగిపోయింది. న్యాయస్థానం నిర్ధారించిన
నిందితుడు మన్మోహన్ సింగ్. నిందితుడు
నేరస్థుడు కావచ్చు. కాకపోనూ వచ్చు.
విచారించి నిర్ధారించి నిగ్గు తేల్చవలసింది
న్యాయస్థానాలు. అధికారంలో ఉన్న
సమయంలో ఈన్యాయ ప్రక్రియకు నామం
పెట్టగలిగిన మన్మోహన్ సింగ్ ఇప్పుడు
నిందితుడిగా న్యాయాస్థానంలో నిలబడవలసి
వస్తున్నది. వచ్చే నెల 8వ తేదీన సింగ్ బొగ్గు
బొరియల కేటాయింపుల అక్రమాల గురించి
విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానంలో
హాజరుకావలసి ఉంది. ‘‘మన్మోహన్ సింగ్‌ను
నేరాభియోగంపై విచారించడానికి వలసిన
ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి’’ అన్నది
ప్రత్యేక న్యాయస్థానాధీశుడు భరత్ పరాశర్
బుధవారం చేసిన నిర్ధారణ...ఇలా
నిర్ధారించడానకి దోహదం చేసిన దీర్ఘ నేపథ్యం
రాజకీయ విభేదాలకు, పాలనాపరమైన
వైరుధ్యాలకు అద్దంపడుతోంది. మన్మోహన్‌సింగ్
పదవిలో ఉండిన సమయంలో బొగ్గు బొరియల
అవినీతి గురించి ఆరాతీసిన కేంద్ర నేరపరిశోధక
బృందం-సిబిఐ- మన్మోహన్ సింగ్ నిర్దోషిగా
తేల్చింది. ఇలా నిర్ధారించడం సరికాదని
న్యాయస్థానం బుధవారం నిర్ణయించడం సిబిఐ
స్వతంత్రమైన పనితీరులోని డొల్లతనాన్ని వెల్లడి
చేసింది. సిబిఐని స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా
మన్మోహన్ ప్రభుత్వం పనిచేయనివ్వకపోవడం
వల్లనే సిబిఐ ఆయనకు బొగ్గు బొరియల
అవినీతితో సంబంధం లేదని నిర్ధారించింది. ఇలా
ప్రభుత్వ నిర్వాహకుల అవినీతిని
కప్పిపుచ్చడానికి సిబిఐ వారు దశాబ్దుల
తరబడి కృషి చేస్తుండడం పాలనా వైపరీత్యం.
బొగ్గు బొరియల అవినీతి విషయంలో కాని,
రెండవశ్రేణి దూరవాణి తరంగాల-2జి స్పెక్ట్రమ్-
కలుషితం చేసిన అవినీతి దుర్గంధం విషయంలో
కాని సిబిఐ తనకు తానుగా నేర పరిశోధనకు
పూనుకోలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం
పూనుకోనివ్వలేదు. సర్వోన్నత న్యాయస్థానం
పదేపదే అదలించిన తరువాత మాత్రమే
సిబిఐలో కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వ
రాజకీయ నిర్వాహకులకు ఈ అత్యున్నత
దర్యాప్తు సంస్థ ఊడిగం చేస్తోందనడానికి ఇంత
ఆలస్యంగా మన్మోహన్ సింగ్‌పై అభియోగం
నమోదు కావడం ఒక సాక్ష్యం.
బొగ్గు బొరియలలో పుట్టలు పగిలిన అవినీతికి
తాను బాధ్యుడు కాదన్న వాదం మన్మోహన్
సింగ్ 2012 మార్చి నుండి వినిపిస్తూనే
ఉన్నాడు. సంకీర్ణ మంత్రివర్గంలోని భాగస్వామ్య
పక్షాల అధినేతలు నిజానికి 2004 నుంచి
ప్రభుత్వం పనితీరును నియంత్రిస్తున్నారు.
అందువల్ల ప్రధానమంత్రి ప్రభుత్వం సాధించిన
ఘనకార్యానికి కాని, హీన కార్యాలకు కాని
ప్రత్యక్షంగా బాధ్యుడు కాదన్నది జనమెరిగిన
రాజకీయ వాస్తవం. అందువల్ల 2004 నుంచి
కూడ వాస్తవంగా ప్రభుత్వాన్ని నడిపించింది
కాంగ్రెస్ అధిష్ఠానం వారు. వివిధ సంకీర్ణ
భాగస్వామ్య పక్షాల వారు. జనానికి మేలు
చేసింది మన్మోహన్ సింగ్ అని 2004, 2014
సంవత్సరాల మధ్య యుపిఎ వారు ఎప్పుడూ
చెప్పలేదు. ఈ మేలు చేసిన ఘన భాగస్వామ్య
పక్షాల అధినేతలదన్నదే ప్రచారమైన వైపరీత్యం.
అందువల్ల అతి పెద్ద భాగస్వామి అయిన
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులే ప్రజలకు ‘మేలు’
చేశారన్నది జరిగిన నిర్ధారణ. ఈ
అగ్రనాయకులు ఎవరన్నది బహిరంగ రహస్యం.
ఇది జరిగిన యేళ్లకు మన్మోహన్ సింగ్‌కు
ఘనత లభించలేదు. అందువల్ల ఘనత
పొందిన కాంగ్రెస్ అధిష్ఠానం వారే అవినీతికి
కూడా బాధ్యత వహించాలి. కానీ ఇది రాజకీయ
వాస్తవం, ఈ వాస్తవంతో రాజ్యాంగ వ్యవస్థకు
సంబంధం లేదు.
కానీ రాజకీయ వాస్తవ వైపరీత్యం వలలో
చిక్కిన మన్మోహన్ సింగ్ ఇప్పుడు రాజ్యాంగ
బద్ధంగా నేరారోపణల సుడిగుండంలో
ఇరుక్కుపోయాడు. మన్మోహన్ సింగ్ చేసిన
తప్పులన్నింటికీ మూలకారణం కాంగ్రెస్
అధిష్ఠానం చేతిలో ఆయన కీలుబొమ్మగా
మారడం. పదవిలో ఉంటే చాలునన్న అధికార
మోహం పదేళ్ల పాటు ఆయనను వదల్లేదు.
ఒరిస్సాలో బొగ్గుబొరియలను హిండాల్కో
సంస్థవారికి అక్రమంగా కేటాయించిన
కార్యక్రమాన్ని మన్మోహన్ సింగ్ ప్రత్యక్షంగా
పర్యవేక్షించాడన్న నిర్ధారణ అయిన ప్రాథమిక
ఆరోపణ. ఇలా కేటాయించడానికి, అనేకానేక
అక్రమాలకు పదేళ్లు మన్మోహన్ సింగ్ అమోదం
తెలపడం కాని కాంగ్రెస్ అధిష్ఠానం వారి ఒత్తడి
కారణంగా జరిగింది. బాధ్యత లేని అధికారం
చెలాయించిన కాంగ్రెస్ అధిష్ఠానం వారు
పదేళ్లపాటు పుట్టలు పగిలిన కట్టలు
తెంచుకున్న అధికార రాజకీయ అవినీతికి
అసలు కారణం. న్యాయ స్థానంలో ఈ గుట్టును
మన్మోహన్ సింగ్ రట్టు చేసే ప్రమాదం ఉందని
కాంగ్రెస్ అధినాయకులు ఆందోళన
చెందుతున్నారట. అలా రట్టు చేయవద్దని
మన్మోహన్‌ను బుజ్జగించడంలో భాగంగానే
గురువారం కాంగ్రెస్ అధిష్ఠానంవారు
ఊరేగింపుగా మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్లి
సంఘీభావం వ్యక్తం చేశారన్నది ప్రచార
మాధ్యమాలలో గట్టిగా వినబడిన గుసగుసల
సారాంశం...
మన్మోహన్ సింగ్ గట్టును రట్టు చేస్తాడా? లేక
వౌనం వహిస్తాడా?అన్న ప్రశ్నలు న్యాయ
ప్రక్రియకు సంబంధం లేనివి. అధిష్ఠానం ఒత్తడికి
లొంగుతాడా, అధిష్ఠానం వారి ప్రతినిధుల
బలవంతానికి తలొగ్గి అవినీతికి ఆమోదముద్ర
వేశానని న్యాయస్థానంలో మన్మోహన్
నివేదించినట్టయితే కాంగ్రెస్ అధిష్ఠానం అపకీర్తిని
మూటకట్టుకుంటుంది. దానివల్ల మన్మోహన్
సింగ్ తన బాధ్యత నుండి తప్పించుకోలేడు. ఈ
బాధ్యత ప్రాతిపదికగానే ఆయన నేరం కాని,
నిర్దోషిత్వం కాని నిగ్గుతేలుతుంది. బొగ్గు
బొరియల కేటాయింపులలో అక్రమాల
కారణంగా 2004-2009 సంవత్సరాల మధ్య
ప్రభుత్వ ఖజానాకు 1,86,000 కోట్ల రూపాయలు
గండిపడడం 2012 ఆగస్టు 17న ప్రభుత్వం
ఆదాయ వ్యయ నియంత్రణ సమీక్షా
మండలి-సిఎజి- నిగ్గు తేల్చిన వాస్తవం.
హిండాల్కో కంపెనీకి జరిగిన కేటాయింపులు ఈ
విస్తృత అవినీతిలో భాగం. 1993 నుంచి జరిగిన
214 బొరియల కేటాయింపును సుప్రీంకోర్టు గత
ఏడాది ఆగస్టులో రద్దు చేయడానికి సిఏజి
నిర్ధారణ ప్రాతిపదిక. కానీ హిండాల్కో కంపెనీకి
జరిపిన కేటాయింపులు సక్రమ పద్ధతిలో
జరిగాయని మన్మోహన్ సింగ్ కార్యాలయం
వారు చివరి వరకు బుకాయించారు. ఈ
బుకాయింపు ఇక చెల్లదన్నది బుధవారం
జరిగిన న్యాయ నిర్ధారణ...